బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి

– ఉద్యోగుల సంక్షేమమే ప్రధమ ప్రాధాన్యత
– సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైద్రాబాద్, ప్రజాతంత్ర, మే 6 : ఉద్యోగుల సౌలభ్యం, సమానత్వం, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియను ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియను సంక్షేమ శాఖ పరిధిలో పూర్తిగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్‌ రాష్ట్ర సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో టీజీఎస్‌డబ్ల్యూఆర్ఈ  ఐఎస్, టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ ఆశ్రమ పాఠశాలలు, షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ, దివ్యాంగుల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దూర ప్రాంతాల్లో దీర్ఘకాలం చాలా  సేవలందించిన ఉద్యోగులకు వారు కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులు, ఒకేచోట పనిచేసే స్పౌస్ కేసులు వంటి అంశాలను సానుకూలంగా పరిగణించాలన్నారు. దుర్భర పరిస్థితుల్లో విధులు నిర్వర్తించిన వారికి మానవీయ దృక్పథంతో న్యాయం చేయాలన్నారు. బదిలీలకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి వాటిని ఉద్యోగులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి దశలో డిజిటల్ పద్ధతులను వినియోగించి మానవ జోక్యం తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వేగంగా స్పందించాలని ఆదేశించారు. ఎలాంటి ఒత్తిడి లేదా ఇతర వ్యక్తిగత ప్రభావాలు లేకుండా నిష్పాక్షికంగా ప్రక్రియ కొనసాగించాలని స్పష్టం చేశారు. గురుకుల సంస్థల్లో బోధన నాణ్యత దెబ్బతినకుండా అవసరమైన సిబ్బంది సమతుల్యతను కాపాడాలని చెప్పారు. మహిళా ఉద్యోగులు, దివ్యాంగులు, సీనియర్ ఉద్యోగులకు ప్రత్యేక సౌలభ్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. గురుకులాల్లో అమలు చేసిన 370 జీవో కారణంగా ఉద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులను అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 190 జీవో జారీ చేసినప్పటికీ అమలులో సమస్యలు ఉన్నాయన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ జీవో అమలు సాధ్యాసాధ్యాలను సమగ్రంగా పరిశీలించి అమలు చేసేలా కృషి చేయాలన్నారు. ఉద్యోగులకు అన్యాయం జరగకుండా సమంజస నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉద్యోగులు సంతృప్తిగా, మనశ్శాంతితో పనిచేసే వాతావరణం కల్పించడం ద్వారా బోధనలో నాణ్యత మరింత మెరుగవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సంతోష్, టీజీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి(ఎఫ్‌ఏసీ) శారద, టీజీటీడబ్ల్యూఆర్ఈ ఐఎస్ అధికారులు అదనపు కార్యదర్శి ఎన్.రాజేందర్ రెడ్డి సంయుక్త కార్యదర్శి నట రాజ్. వెంకన్న, లింగారెడ్డి, రాజుబాబు, వేణుగోపాల్, దివ్యాంగుల శాఖ డైరెక్టర్ శైలజ, ఎస్‌సీడీడీ ఇన్‌చార్జి సెక్రటరీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *