– తాగునీటికే తొలి ప్రాధాన్యం
– రికార్డు స్థాయిలో 19,543 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను తీర్చాం
– వర్షాభావ పరిస్థితులతో వరి సాగు 18% తగ్గుదల
– ప్రత్యామ్నాయ పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యం
– ‘తెలంగాణ జలసిరి’తో భూగర్భ జలాల పునరుద్ధరణకు చర్యలు
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 18 : పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షపాతం లోటు, జలాశయాల్లో నీటి ప్రవాహం తగ్గడం, విద్యుత్ డిమాండ్ పెరగడం వంటి సవాళ్లు ఎదురయ్యాయని, అయితే ప్రభుత్వం ఏప్రిల్ నుంచే ముందస్తు చర్యలు చేపట్టి పరిస్థితులను విజయవంతంగా నియంత్రిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో స్పష్టం చేశారు. సమస్య తలెత్తిన తర్వాత స్పందించడం కాకుండా, నష్టం జరగకముందే అప్రమత్తమై వివిధ శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లోనే కాక, ఆగస్టులో ఏకంగా 38 శాతం వర్షపాతం లోటు నమోదైందని డిప్యూటీ సీఎం తెలిపారు. వర్షాభావ పరిస్థితుల వల్ల వానాకాలం సాగు విస్తీర్ణం గత ఏడాది 139.29 లక్షల ఎకరాల నుంచి ఈ ఏడాది 123.74 లక్షల ఎకరాలకు తగ్గింది. వరి సాగు సుమారు 18 శాతం తగ్గింది. తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు, పంటల వైవిధ్యీకరణపై 1,600 గ్రామాల్లో 2 లక్షలకు పైగా రైతులకు అవగాహన కల్పించాం. 32 జిల్లాలకు ప్రత్యేక ఎల్‌నినో వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాం. నిపుణుల సలహాలతో 27 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి అధికారులను, రైతులను నిరంతరం అప్రమత్తం చేస్తున్నాం.
రాబోయే 12 నెలలకు తాగునీటి భద్రతే లక్ష్యంగా..
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం 808 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 465 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. రాబోయే 11–12 నెలల తాగునీటి అవసరాలకు నీటిని కేటాయించిన తర్వాతే ఇతర అవసరాలకు వినియోగిస్తాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, దేవాదుల, కోయిల్ సాగర్, భీమా తదితర ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులు, రిజర్వాయర్లను నింపుతున్నాం. సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాలకు మిషన్ భగీరథ, కృష్ణా, గోదావరి వనరుల నుంచి ప్రత్యామ్నాయంగా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేశాం.
‘తెలంగాణ జలసిరి’
పడే ప్రతి వర్షపు చుక్కను నిల్వ చేసేందుకు 24 లక్షల ఇంకుడు గుంతలు, 50 వేల వ్యవసాయ కుంటలు, 12 వేల పర్కొలేషన్ ట్యాంకులు, 12 వేల బోరు బావుల రీచార్జ్ నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించాం.
చరిత్రలో రికార్డు విద్యుత్ డిమాండ్
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వ్యవసాయ బోరుబావుల వాడకం పెరగడం, ఎత్తిపోతల పథకాల లోడ్ భారీగా పెరగడం వల్ల విద్యుత్ డిమాండ్ తీవ్రస్థాయికి చేరిందని తెలిపారు. సెప్టెంబర్ 9న ఉదయం 10.41 గంటలకు రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 19,543 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 4,000 మెగావాట్ల అదనపు భారం పడింది. జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయినప్పటికీ, థర్మల్ కేంద్రాల ఉత్పత్తి పెంచడం, సింగరేణి బొగ్గు కేటాయింపులను సమర్థంగా వాడుకోవడం, మార్కెట్ కొనుగోళ్ల ద్వారా విద్యుత్‌ను సమీకరించి రైతులకు, గృహాలకు, పరిశ్రమలకు ఎలాంటి అంతరాయం లేని సరఫరాను అందించాం.
గ్రామీణ ఉపాధి – ప్రజారోగ్యంపై నిఘా
వర్షాభావ సమయంలో గ్రామీణ జీవనోపాధులను కాపాడేందుకు 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 7.3 కోట్ల పని దినాలను సృష్టించి, ₹2,100.53 కోట్ల వేతనాలను నేరుగా కూలీల ఖాతాల్లో జమ చేశాం. ఎల్‌నినో వల్ల పెరిగే ఉష్ణోగ్రతల దృష్టియా వేడిగాలుల హెచ్చరికలు జారీ చేయడం, తాగునీటి ఏర్పాట్లు, కూలింగ్ కేంద్రాలు, అంగన్‌వాడీల ద్వారా పోషకాహార పంపిణీకి చర్యలు తీసుకున్నాం. ఈ ఏడాది 6.18 కోట్ల మొక్కల లక్ష్యానికి గాను ఇప్పటికే 5.91 కోట్ల మొక్కల నాటే ప్రక్రియను, పంపిణీని పూర్తి చేశాం. ప్రకృతి విపత్తులను ఆపడం సాధ్యం కాకపోయినా, ప్రభుత్వ ముందస్తు చర్యలు, వివిధ శాఖల సమన్వయంతో ప్రజలను, రైతాంగాన్ని ఆదుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





