శ్రీనివాసనగర్ మరో వెలుగుమట్ల కానుందా?

– రోడ్డు విస్తరణ పేరుతో పేదలపై ప్రతాపం!
– ఖమ్మంలో అగమ్యగోచరంగా 650 కుటుంబాల పరిస్థితి..
– పట్టాలిచ్చి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఇప్పుడు ఖాలీ చేయాలనడంపై ఆందోళన
– కోర్టు తీర్పు నేపథ్యంలో అధికారుల నోటీసులు
– రంగంలోకీ రాజకీయ పార్టీలు

ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువ కముందే తాజాగా ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్లో సుమారు 650 కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రోడ్డు విస్తరణ, మాస్టర్ ప్లాన్ పేరుతో ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. చేయడంతో మూడు రోజుల కిందట వారు గంటల తరబడి స్థానిక టింబర్ డిపో ప్రధాన రహదారి వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
అసలు వివాదం ఎందుకు ?

శ్రీనివాసనగర్ అయ్యప్ప స్వామి ఆలయం ప్రాంతంలో సుమారు 40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వారికి గత ప్రభుత్వం జీవో 58 ప్రకారం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాలు పొందిన వారికి ప్రస్తుత ప్రభుత్వం మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో కొందరు నిర్మాణాలు చేపట్టారు. ఇదే సమయంలో ఇళ్లున్న రహదారి 80 అడుగులు ఉండగా అది ఆక్రమణలకు గురైందని కొంతమంది బడా వ్యాపారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, తీర్పు వారికి అనుకూలంగా రావడంతో అధికారులు ఇళ్ల పట్టాలను, ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేశారు. కొన్ని రోజులు వివాదం ఎటు తేలకుండా ఉండగా న్యాయస్థానం తీర్పును అధికారులు అమలు చేయటం లేదని తిరిగి బడా వ్యక్తులు కోర్టుకు విన్నవించటం, వెంటనే ఇళ్ల తొలగింపునకు ఆదేశాలు రావటంతో ఒక్కసారిగా బాధితులు రోడ్కెక్కారు. రెండు పడక గదుల ఇళ్లు అందిస్తామని చెప్పిన అధికారులు ఆ వైపుగా చర్యలు తీసుకోలేదంటూ విమర్శలు ఉన్నాయి. జీవో నం.58 కింద క్రమబద్ధీకరణ పట్టాలిచ్చే సమయంలో స్థానిక రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ ప్రణాళిక విభాగం అధికారులు పరస్పరం చర్చించకుండానే నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. రహదారి 80 అడుగులున్న విషయాన్ని ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్లక పోవడం, క్రమబద్ధీకరణ పట్టాలు జారీ చేయడం, వెంటనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో అగ్గికి ఆజ్యం పోసిన ట్లయింది. ఏళ్ల క్రితం మాస్టర్ ప్లాన్లో 80 అడుగుల రహదారి ఉంటే అక్కడ ఏళ్లుగా ఉంటున్న వారికి క్రమబద్ధీకరణ పట్టాలు ఎలా మంజూరు చేశారు? వాళ్లకే ఇందిరమ్మ ఎలా మంజూరు చేశారు? అన్న ప్రశ్న లకు సమాధానం చెప్పేవారే లేకుండా పోయారు.

కార్పొరేషన్ అధికారులు ఏమంటున్నారంటే..

మాస్టర్ ప్లాన్ లో 80 అడుగుల రహదారి ఉందంటూ ప్రైవేటు వ్యక్తులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు తీర్పు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు 90 మందికి నోటీసులు జారీ చేశాం. మిగిలిన వారికి త్వరలోనే నోటీసులు అందిస్తామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నారు.

త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు

ఇప్పటకే మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ముగిసింది. త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో శ్రీనివాసనగర్ ఇళ్ల సమస్యపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. తాము ఇళ్ల పట్టాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ళు కూలుస్తోందని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. న్యాయ పోరాటం కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. అక్కడ ఉన్న టింబర్ డిపోలను నగరానికి దూరంగా తరలించాలని కోరుతూ స్థానిక వ్యాపారులు తెచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సీపీఎం నాయకులు తెలిపారు. ప్రతిపక్షాలన్ని అధికార పార్టీని దోషిని చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అటు అధికారులు ఇటు పాలకులు సమస్య జఠిలం చేయకుండా వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని శ్రీనివాసనగర్ వాసులు అంటున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *