– నానాజాతి సమితిలాంటి బీఆర్ఎస్సా విమర్శించేది?
. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 4 : అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన నాయకులను చేర్చుకుని బీఆర్ఎస్ ఒక ‘నానాజాతి సమితి’లా మారిందని, అలాంటి పార్టీ కాంగ్రెస్‌ను విమర్శించడం హాస్యాస్పదమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) మండిపడ్డారు. ములుగు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో కేటీఆర్, బీఆర్ఎస్ బీజేపీ నాయకుల వైఖరిపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ రాజకీయ ప్రస్థానం టీడీపీతోనే ప్రారంభమైందని, కేటీఆర్‌కు తారకరామారావు అనే పేరు కూడా ఎన్టీఆర్ జ్ఞాపకార్థమే వచ్చిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్‌లో టీడీపీ నాయకులు చేరలేదా? మరి బీఆర్ఎస్‌ను కూడా ‘పచ్చ పార్టీ’ అనాలా అని ప్రశ్నించారు.
ప్రజా ప్రభుత్వ పాలన – అభివృద్ధి సంక్షేమ పథకాలు
గత ప్రభుత్వం పదేళ్లలో ఇళ్లు ఇవ్వలేకపోయినా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం తొలి దశలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింద రైతులకు సన్నవడ్లకు బోనస్ చెల్లించి ధాన్యం కొనుగోలు చేయడమే కాక అదే సన్నబియ్యాన్ని పేదల కడుపు నింపేందుకు పంపిణీ చేస్తున్నాం.. సామాన్య కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం.. రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియను సమర్థవంతంగా చేపడుతున్నామని చెప్పారు.
బీఆర్ఎస్ హామీల అమలుపై విమర్శ
పదేళ్ల పాలనలో దళితుడిని సీఎం చేస్తామని, ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, మూడెకరాల భూమి, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తామని చెప్పి ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారని విమర్శించారు.కాంగ్రెస్ నాయకులను, ప్రజాప్రతినిధులను కించపరిచేలా పోస్టర్లు వేస్తూ వ్యక్తిగతంగా అవమానిస్తే సహించేది లేదని, కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు.
బహిరంగ చర్చకు సిద్ధం
నియోజకవర్గం, మండలాల వారీగా లబ్ధిదారుల జాబితాల లెక్కలతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సవాల్ విసిరారు. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలే తప్ప ప్రతీ పనిని రాజకీయ కోణంలో అడ్డుకోవడం సరికాదన్నారు. అలాగే తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో, ఇందిరమ్మ ఇళ్లకు రావాల్సిన నిధులపై ఎందుకు సహకరించడం లేదో ఆ పార్టీ నాయకులు జవాబు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



