బీసీ మహిళ క‌నుకే వేటు వేశారు

– సురేఖ బర్తరఫ్‌పై బీఆర్ఎస్ 

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 3 : కేబినెట్ నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన‌ అంశంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఒక బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలిగించాలనుకోవడం దారుణమని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వెయ్యి రోజుల పాలనకు నిరసనగా నారాయణపేట జిల్లా కోస్గిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ‘బీఆరఎస్ రైతు గర్జన’ సభలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఎంతోమంది ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నిత్యం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బహిరంగంగానే మాట్లాడుతున్నారని, కానీ కేవలం ఓ బీసీ మహిళా నాయకురాలిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని పదవి నుంచి తొలగించడం కాంగ్రెస్ వైఖరికి అద్దంపడుతోందని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. మంత్రుల్లో కొందరికి ఒక న్యాయం, సురేఖకు మరొక న్యాయమా అని నిలదీశారు. ప్రస్తుత కేబినెట్‌లోని పలువురు మంత్రులపై అవినీతి, కమీషన్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వం సురేఖ విషయంలో మాత్రం ఇంత కఠినంగా వ్యవహరించడం వెనుక బీసీ వ్యతిరేక ఆలోచనా ధోరణి ఉందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలను అనేక రకాలుగా మోసం చేస్తూ వస్తోందని, పదవుల తొలగింపులోనూ బలహీన వర్గాల నేతలనే బలిపశువులను చేస్తున్నారని విమర్శించారు. సురేఖ ఉద్వాసన కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయమైనప్పటికీ ఒక బలమైన బీసీ నాయకురాలికి జరిగిన ఈ అన్యాయాన్ని ప్రజలు, బీసీ వర్గాలు గమనిస్తున్నాయని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *