– పూర్తిగా నష్టపోయిన భద్రాచలం పరిసర ప్రాంతాలు
– విభజన తర్వాత సీఎంగా కేసీఆర్ దృష్టి పెట్టకపోవడంతోనే నష్టం
– కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే భద్రాచలం వెనుకబాటు
– పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ప్రమాదం
– రెవెన్యూ మంత్రి పొంగులేటి
భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : ఆంధ్రప్రదేశ్ పునర్విభ„జన సరిగా జరగలేదని, కావాలని భద్రాచల పరిసర ప్రాంతాలను ఆంధ్రాలో కలుపుకోవడం వల్ల భద్రాచలం ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లిందని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సీతారామచంద్రస్వామి దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత భద్రాచల ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు (కేసీఆర్) ఈ ప్రాంతంపై దృష్టి పెట్టకపోవడం వల్ల, కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కవ్వడం వల్ల ఈ ప్రాంతంలోని మండలాలు, గ్రామాలు ఆంధ్ర ప్రాంతంలో కలిసిపోయాయన్నారు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి అయిన దొరవారు చేసిన తప్పులు చాలా ఉన్నాయన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలాన్ని నిర్లక్ష్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి భద్రాచలం మండలాలు, పంచాయతీలను ఆంధ్ర ప్రాంతానికి కట్టబెట్టారని విమర్శించారు. ఆంధ్ర ప్రాంతానికి వెళ్లిన పంచాయతీలను తెలంగాణలోకి తెచ్చుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికలు కూడా గట్టిగా చెబుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా పోలవరం ప్రాజెక్టును ఎత్త్తు తగ్గించకుండా నిర్మించడం ఈ ప్రాంత ప్రజలను ఇబ్బందులపాలు చేయడమేనని అన్నారు. ఇప్పటికే గోదావరి 55 అడుగులు వస్తే భద్రాచలం ప్రాంతాలు పూర్తిగా నీట మునుగుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం వద్ద పూర్తిస్థాయిలో బ్యాక్ వాటర్ చేరుకుంటుందని, ఈ కారణంగా భద్రాచలం ముంపునకు గురవుతుందని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీతో మాట్లాడి ముంపు ప్రాంతాలు తగ్గించే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉండగా ఆ దిశగా పనిచేయడం లేదన్నారు. కేవలం పక్క రాష్ట్రానికి మాత్రమే నిధులు కేటాయిస్తూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ముందుకు సాగుతున్నారని అన్నారు. ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఐదు పంచాయతీలను ఆంధ్రలో కలుపుకున్నారని అన్నారు. భద్రాద్రికి ఏపీ రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందని, అయినప్పటికీ భద్రాచల ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ భద్రాచలం అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించామని చెబుతూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. రామాలయం అభివృద్ధి పూర్తిస్థాయిలో చేసి భక్తులకు అందుబాటులో తీసుకొస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





