– ఛత్తీస్‌గఢ్ సీఎంను కోరిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : సమ్మక్క–సారక్క బ్యారేజీగా పిలిచే సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతిని (ఎన్‌ఓసీ) వీలైనంత త్వరగా జారీ చేయాలని నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. న్యూదిల్లీలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయితో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమై ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూములు, ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి నష్టపరిహారం చెల్లిస్తుందని, అవసరమైతే పరిహార నిధులను ముందుగానే జమ చేసేందుకు కూడా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, పరస్పర సహకారం, సంప్రదింపుల ద్వారా పెండింగ్ అంశాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. సమ్మక్క సాగర్‌కు సంబంధించిన బ్యాక్‌వాటర్ ప్రభావం, ముంపునకు గురయ్యే భూములు, నివాస గృహాలు, బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం, ఛత్తీస్‌గఢ్ నుంచి రావాల్సిన ఎన్‌ఓసీపై విస్తృతంగా చర్చించారు. ముంపు ప్రభావిత కుటుంబాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా అమలులో ఉన్న నిబంధనల ప్రకారం భూములు, ఇళ్లు, ఇతర ఆస్తులకు పరిహారాన్ని అంచనా వేసి పూర్తిస్థాయిలో చెల్లిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. బ్యారేజీలో పూర్తి జలాశయ మట్టం వరకు నీటిని నిల్వ చేసి, నిర్దేశిత సాగునీటి ప్రయోజనాలను రైతులకు అందించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సహకరించాలని కోరారు.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ప్రత్యేకతలు
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించారు. బ్యారేజీ పొడవు 1,143 మీటర్లు కాగా, 59 రేడియల్ గేట్లను ఏర్పాటు చేశారు. పూర్తి జలాశయ మట్టం +83 మీటర్ల వద్ద 6.94 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా రూపొందించారు. సాగునీటి అవసరాల కోసం గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
ఆయకట్టు స్థిరీకరణ – నీటి పంపకాలు
అసలు నీటి వనరు నుంచి తగినంత నీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ పరిధిలోని 5 జిల్లాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. సూర్యాపేట జిల్లాలో 2,34,199 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 96,494 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 85,774 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 22,422 ఎకరాలు, జనగామ జిల్లాలో 1,111 ఎకరాలు, రామప్ప–పాకాల అనుసంధాన కాలువ ద్వారా ములుగు జిల్లాలో 8,000 ఎకరాలు, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో 22,000 ఎకరాల కొత్త ప్రాంతాలకు సాగునీరు అందించనున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం పరిధిలోని కొంత ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు మార్గమధ్యంలోని గ్రామాల తాగునీటి అవసరాలను కూడా తీర్చనున్నారు.
ప్రాజెక్టు నేపథ్యం & అనుమతుల ప్రస్థానం
2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పి.వి.నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి పథకానికి అనుమతి లభించింది. 2017లో రీ-ఇంజినీరింగ్‌లో భాగంగా బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని తుపాకులగూడెంకు మార్చి పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. 2020లో ప్రాజెక్టుకు ‘సమ్మక్క సాగర్’గా నామకరణం చేసి పర్యావరణ అనుమతులు సాధించారు. 2021లో సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల సంఘానికి సమర్పించారు. 2024 డిసెంబర్‌లో సవరించిన పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. సాంకేతిక అనుమతులు వచ్చినప్పటికీ ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్‌ఓసీ రాకపోవడంతో అంతర్రాష్ట్ర అంశాల పరిశీలన పెండింగ్‌లో ఉంది.
రూ. 9.883 కోట్లతో బ్యాక్‌వాటర్ అధ్యయనం
సమ్మక్క సాగర్ వల్ల ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడే బ్యాక్‌వాటర్ ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 9.883 కోట్లను ఛత్తీస్‌గఢ్ జలవనరుల శాఖకు చెల్లించింది. డీజీపీఎస్ సర్వేలు పూర్తయినట్లు ఛత్తీస్‌గఢ్ జలవనరుల శాఖ తెలియజేసింది. ప్రస్తుతం లైడార్ డ్రోన్ సర్వేలు, క్షేత్రస్థాయి సమాచార సేకరణ కొనసాగుతున్నాయని, వీటి ఆధారంగా ముంపు ప్రభావిత ప్రాంతాలు, భూములు, ఆస్తుల వివరాలను నిర్ధారించి పరిహార ప్రక్రియ చేపడతారు. రెండు రాష్ట్రాల మధ్య నిరంతర సంప్రదింపుల ద్వారా పెండింగ్ అంశాలను పరిష్కరించి సమ్మక్క సాగర్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





