– కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు
మంచిర్యాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 22ఏ నిషేధిత జాబితా ముసుగులో 5,525 ఎకరాల ఇండ్ల స్థలాలు, పట్టణ పరిధిలో 10 వేల ఇండ్లను ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టి ప్రజల ఆస్తులను సున్నా చేసిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంచిర్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దశాబ్దాలుగా నివాసముంటున్న ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారి ప్రజల గొంతు కోస్తోందని విమర్శించారు. పట్టణంలోని రెడ్డి కాలనీ, రాజీవ్ నగర్, ఎన్టీఆర్ నగర్, తిలక్ నగర్, గౌతమ్ నగర్, ఇస్లాంపూర్, ఏసీసీ, శ్రీరామ్ నగర్ ప్రాంతాలతోపాటు 1982 గోదావరి వరదల సమయంలో నస్పూర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లడ్ కాలనీలోని ఇండ్లను కూడా 22ఏ లో పెట్టారని తెలిపారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం జీవో 76 ద్వారా సింగరేణి కార్మికులకు ఉచితంగా ఇచ్చిన 6,222 రిజిస్టర్డ్ ఇండ్ల పట్టాలను, పేదలకు ఇచ్చిన జీవో 58, 59 పట్టాలను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసి ప్రజలను రోడ్డున పడేసిందని ఆరోపించారు. ఇళ్లు, ప్లాట్లు నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో నిర్మాణ అనుమతులు (బిల్డింగ్ పర్మిషన్లు) రావడం లేదని, బ్యాంకులు రుణాలు నిలిపివేశాయని, ఆడపిల్లల పెళ్లిళ్లు కాక ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రికి ఒక న్యాయం.. పేదలకు ఒక న్యాయమా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు 22ఏ లో పడితే ఎటువంటి దరఖాస్తు లేకుండా రాత్రికి రాత్రే ఆ జాబితా నుండి తొలగించుకున్నారని, మరి సాధారణ ప్రజలు దరఖాస్తులు పట్టుకుని మీసేవలు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలని ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేవలం ‘సారీ’ చెప్తే సరిపోదని, 22ఏ భూములపై తక్షణమే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పోరాట కార్యాచరణ
ప్రభుత్వం ఎటువంటి దరఖాస్తులతో సంబంధం లేకుండా రాత్రికి రాత్రే 22ఏ లో పెట్టిన ఆస్తులన్నింటినీ బేషరతుగా తొలగించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 10 వేల బాధిత కుటుంబాలతో మంచిర్యాల కలెక్టరేట్‌ను ముట్టడించి ‘వంటా వార్పు’ చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పక్షాన ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసి మెడలు వంచుతామని తేల్చి చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





