– సిరిసిల్ల నేతన్నకు కేటీఆర్ ప్రశంసలు
– ‘వెండి వెన్నెల’ చీర ఆవిష్కరణ
– అధికారంలోకి వస్తే కర్మాగారం నెలకొల్పుతాం
– కేటీఆర్ హామీ
సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: చేనేత రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కొత్త తరహా హ్యాండ్‌లూమ్ మగ్గాన్ని రూపొందించిన నేతన్న నల్లా విజయ్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. విజయ్ ఆహ్వానం మేరకు సిరిసిల్లలోని ఆయన ఇంటికి వెళ్లిన కేటీఆర్.. ఎలక్ట్రానిక్ జాకార్డ్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కొత్త హ్యాండ్‌లూమ్ మగ్గాన్ని పరిశీలించి ఆవిష్కరించారు. ఈ మగ్గంపై రూపొందించిన ‘వెండి వెన్నెల’ చీరను కూడా కేటీఆర్ ఆవిష్కరించారు. ఒకప్పుడు సిరిసిల్లలో అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన మహానుభావుడు నల్లా పరంధాములు అని కేటీఆర్ గుర్తుచేశారు. ఆయన కళా నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా సిరిసిల్లకు గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. సిరిసిల్లలో ఇంత అద్భుతమైన కళాకారులు ఉన్నారా అని ప్రపంచం ఆశ్చర్యపడేలా పరంధాములు చేనేత కళను చాటారని పేర్కొన్నారు. నల్లా పరంధాములు వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు నల్లా విజయ్ అనేక వినూత్న ప్రయోగాలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. చేనేత కళాకారుల నైపుణ్యానికి ఆధునిక సాంకేతికతను జోడించి మెరుగైన ఉత్పత్తులను అందించాలనే తపనతో విజయ్ ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తున్నారని ప్రశంసించారు. ప్రస్తుతం ‘షిఫ్ట్ జాకార్డ్’ పేరుతో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వెండి, బంగారంతో ప్రత్యేకమైన చీరలను రూపొందిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ‘వెండి వెన్నెల’ పేరుతో రూపొందించిన చీర అద్భుతంగా ఉందని, విజయ్ నైపుణ్యం, సృజనాత్మకతను అభినందించేందుకు, ఆయన చేసిన ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చానని చెప్పారు. విజయ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని కేటీఆర్ అన్నారు. గతంలోనూ విజయ్‌ను ప్రోత్సహించానని, భవిష్యత్తులో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. విజయ్ కోసం సిరిసిల్లలో ఒక అద్భుతమైన కర్మాగారం ఏర్పాటు చేసి, అవసరమైన అన్ని రకాల సబ్సిడీలు అందించడంతో పాటు ఈ పరిశ్రమను మరింత మంది నేతన్నలు అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తానని కేటీఆర్ తెలిపారు. విజయ్‌తో పాటు సిరిసిల్ల చేనేత కళను కాపాడి, మరింత అభివృద్ధి చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. సిరిసిల్లను కేవలం పవర్‌లూమ్ పరిశ్రమకే పరిమితం చేయకుండా, ఆధునిక సాంకేతికతతో కూడిన హ్యాండ్‌లూమ్ చేనేతకు కూడా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విజయ్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని కేటీఆర్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ జాకార్డ్ టెక్నాలజీతో మగ్గంపై పని వేగం పెరగడంతో పాటు నేతన్నల శ్రమ తగ్గుతుందని విజయ్ తెలిపారు. ముఖ్యంగా మహిళా కార్మికులకు పని సులభతరం అవుతుందని, తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతుందని చెప్పారు. కొత్త సాంకేతికతతో రూపొందిస్తున్న ప్రత్యేకమైన చీరలకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, తద్వారా నేతన్నలకు అదనపు ఆదాయం సమకూరుతోందన్నారు.
చేనేత రంగాన్ని ప్రోత్సహించడంలో కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారని విజయ్ తెలిపారు. గతంలో తాము రూపొందించిన వినూత్న చీరలను కూడా కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించామని, ఈసారి ఎలక్ట్రానిక్ జాకార్డ్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన హ్యాండ్‌లూమ్ మగ్గాన్ని, దానిపై రూపొందించిన ‘వెండి వెన్నెల’ చీరను కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




