వారికి దేశ భ‌క్తి స‌ర్టిఫికెట్లు ఇవ్వ‌డం త‌గ‌దు

– అది దేశాన్ని అవమానించడమే
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసం ఒవైసీ బ్రదర్స్ దేశభక్తులంటూ ప్రశంసలు కురిపించడం తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోందని, ఇది సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ధ్వజమెత్తారు. దేశభక్తులు అంటే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని, అలాంటి మహోన్నత నాయకులతో ఒవైసీలను పోల్చడం ఒక విడ్డూరమని ఎద్దేవా చేశారు. అసలు ఏ అర్హతను చూసి ఒవైసీ సోదరులకు రేవంత్ రెడ్డి దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. గతంలో 15 నిమిషాలు పోలీసులను పక్కకు జరిపితే ఈ దేశంలో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తామంటూ బెదిరింపులకు దిగినందుకా.. లేక బహిరంగంగా మేము ఆవు మాంసం తింటాం అంటూ మాట్లాడినందుకు మెచ్చుకుని దేశ భక్తి సర్టిఫికెట్లు ఇస్తున్నారా.. అసలు దేని కోసం వీళ్లను దేశ భక్తులు అంటున్నారో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని నిలదీశారు. దేశభక్తి అంటే దేశాన్ని ఒకటిగా కలిపే జాతీయ జెండాకు, జాతీయ గీతానికి, జాతీయ గేయానికి మర్యాద ఇవ్వడమని గుర్తు చేశారు. అసెంబ్లీలో వందేమాతరం పాడుతుంటే ఒక్క మజ్లిస్ ఎమ్మెల్యే గానీ, ఓవైసీ సహా ఎవరూ నిలబడలేదని, మరి అలాంటి వాళ్లను చూసి దేశ భక్తులు, పేట్రియాటిజం అనడం హాస్యాస్పదమని అన్నారు. రాహుల్ గాంధీకి పాకిస్తాన్, చైనాలపై ఎలాంటి దేశ భక్తి ఉందో అదే దేశ భక్తి ఈ ఒవైసీలకు కూడా ఉందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారేమోనని విమర్శించారు. మోదీకి, అమిత్ షాకు దేశ భక్తి ఉందని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నందుకు సంతోషమని, కానీ ఒవైసీలకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడం మాత్రం ఈ దేశంలో ప్రతి ఒక్కరినీ ఘోరంగా అవమానించడమేనని అన్నారు. కాంగ్రెస్‌కు నిజంగా దేశ భక్తి ఉంటే ముందుగా సభల్లో పూర్తిగా వందేమాతరం పాడి నిరూపించుకోవాలని, ఆ రోజే వాళ్లు కూడా దేశ భక్తులు అవుతారని స్పష్టం చేశారు. ఈ బుజ్జగింపు వ్యాఖ్యలను ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారని రామచందర్‌రావు అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *