– రైతుల భూములను 22ఏ లో పెట్టడం దారుణం
– కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై కౌటాలలో భారీ నిరసన
– హరీష్ రావు తీవ్ర ఆగ్రహం
సిర్పూర్ కాగజ్‌నగర్/ కౌటాల: సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే కాంగ్రెస్ పాలనలో భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలపై సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గం కౌటాలలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అకారణంగా తమ భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టడంతో పడుతున్న ఇబ్బందులను స్థానిక రైతులు హరీష్‌రావుకు తెలిపి కన్నీటిపర్యంతమయ్యారు. రాత్రికి రాత్రే సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలో 42,867 ఎకరాలను నిషేధిత జాబితాలో పడేశారని తెలిపారు. ఇందులో చింతల మానేపల్లిలో 8,878 ఎకరాలు, బెజ్జూర్లో 8,325 ఎకరాలు, కాగజ్‌నగర్లో 6,690 ఎకరాలు, కౌటాలలో 6,350 ఎకరాలు, దహేగాంలో 5,268 ఎకరాలు, సిర్పూర్ (టి)లో 4,406 ఎకరాలు, పెంచికల్ పేట్ లో 2,950 ఎకరాలు ఉన్నాయన్నారు. భూములు 22ఏ లో పడటంతో బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని, రిజిస్ట్రేషన్లు కాక ఆడబిడ్డల పెళ్లిళ్లు ఆగిపోతున్నాయని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. రేపు రైతుబంధు, బీమా, ఎరువులు కూడా దక్కకుండా పోయే ప్రమాదం ఉందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
రాష్ట్రవ్యాప్తంగా 14.50 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి 40 వేల మంది రైతులను కబ్జాదారులుగా చిత్రీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఇల్లు 22ఏ లో పడితే రాత్రికి రాత్రే తొలగించుకున్నారని, మరి పేద రైతులకు ఒక న్యాయం, ముఖ్యమంత్రికి ఇంకో న్యాయమా అని హరీష్ రావు ప్రశ్నించారు.
పొంగులేటిని అసెంబ్లీ నుంచి నిషేధించాలి
ఒక్క ఎకరా కూడా నిషేధిత జాబితాలో పెట్టలేదని అబద్ధాలు ఆడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాలకు రాకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో పథకాలన్నీ బంద్
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, దళితబంధు అన్నీ బంద్ అయ్యాయని ఆరోపించారు. నెలకు రూ.4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రతి అవ్వకు, తాతకు ఈ ప్రభుత్వం రూ.66,000 బాకీ పడిందని, ఆ పాత బాకీలన్నీ వడ్డీతో వసూలు చేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.
పోరాటానికి పిలుపు
ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీష్ రావు హెచ్చరించారు. అప్పటికీ భూములను 22ఏ నుంచి తొలగించకపోతే ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు ‘వంటా వార్పు’ చేపడతామని, అవసరమైతే లక్షలాదిమంది రైతులతో సెక్రటేరియట్, సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. కోనేరు కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరూ ఒక్కటయ్యారని, రైతుల భూములకు విముక్తి లభించే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





