ఇక కొత్త ఆయుధంతో విరుచుకుపడతాం

– అమెరికాకు ఇరాన్ నేవీ కమాండర్ హెచ్చరిక

టెహ్రాన్, ఏప్రిల్ 30 : శత్రు బలగాలపై త్వరలోనే కొత్త ఆయుధంతో విరుచుకుపడనున్నట్లు ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే హర్మూజ్‌ను తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. ఈ క్రమంలో ఇరాన్ నుంచి తాజా హెచ్చరికలు వచ్చాయి. ‘అతిత్వరలో శత్రు బలగాలపై కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తాం.. అది వారిని తీవ్రంగా భయపెట్టనుంది.. అది వారి పక్కనే ఉంది.. దానితో వారికి గుండెపోటు కూడా రావచ్చు’ అని షారమ్ ఇరానీ పేర్కొన్నారు. అయితే ఆ ఆయుధం ఏంటి అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. హర్మూజ్‌ను దిగ్బంధించి ఇరాన్‌ను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసి చర్చలకు తీసుకురావాలనే అమెరికా వ్యూహాన్ని ఆయన కొట్టిపారేశారు. అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎసఎస్ అబ్రహాం లింకన్‌పై తమ దళాలు దాదాపు ఏడు క్షిపణులతో విరుచుకుపడ్డాయన్నారు. దీంతో అది కొన్ని రోజులు కార్యకలాపాలను నిర్వహించలేకపోయిందన్నారు. అమెరికా దిగ్బంధనం ఉన్నప్పటికీ నౌకలు కొన్ని తమ ఓడరేవుల నుంచి వెళ్తున్నాయన్నారు. మరికొన్ని వాటి గమ్యస్థానాలకు కూడా చేరుకుంటున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తమ ప్రజల కోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. శత్రువులు పశ్చాత్తాపం చెందేవరకు వారిని దెబ్బ కొడతామన్నారు.

———————————————-
నేనసలే మంచోడిని కాను : ట్రంప్
వాషింగ్టన్, ఏప్రిల్ 30 : ఘర్షణను ముగించాలనే ఇరాన్ ప్రతిపాదనను అంగీకరించాలంటే తమ షరతులకు ఒప్పుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకునే వరకు ఆ దేశంతో శాంతి ఒప్పందం కుదరదని తేల్చిచెప్పారు. అప్పటివరకు నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని హెచ్చరించారు. బుధవారం ఓ మీడియా సంస్థకు ట్రంప్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడారు. ‘బాంబు దాడి కంటే దిగ్బంధనమే ఎక్కువ ప్రభావవంతంగా ఉంది.. వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారి పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది.. వారు రాజీ పడాలనుకుంటున్నారు.. నేను దిగ్బంధనాన్ని కొనసాగించడం వారికి ఇష్టం లేదు.. ఎత్తివేయడం నాకు ఇష్టం లేదు.. ఎందుకంటే వారు అణ్వాయుధాన్ని కలిగి ఉండడానికి వీల్లేదు’ అని చెప్పారు. కాగా, శాంతి ఒప్పందానికి అంగీకరించేలా ట్రంప్ చేస్తున్న బెదిరింపులపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా మోసపూరిత ప్రణాళిక ఓడిపోతుందని, దిగ్బంధనం ద్వారా దేశంలో అంతర్గత కలహాలను సృష్టించాలనే ట్రంప్ ప్రణాళిక ఎన్నటికీ సఫలం కాదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ పేర్కొన్నారు. యుద్ధం ముగిసిన తరువాతే అణు కార్యక్రమంపై చర్చలని ఇరాన్ తేల్చి చెప్పిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ఇరాన్ తమ పనిని సరిగ్గా చేయలేకపోతోంది.. వారికి అణురహిత ఒప్పందంపై ఎలా సంతకం చేయాలో తెలియదు.. వారు త్వరగా తెలివిగా వ్యవహరించాలి.. అని ట్రంప్ తన పోస్టులో రాశారు. ఈ పోస్టుతోపాటు ఏఐ రూపొందించిన తన చిత్రాన్ని కూడా పంచుకున్నారు, అందులో ఆయన అసాల్ట్ రైఫిల్‌ను పట్టుకుని ఉండగా, వెనుక పర్వత ప్రాంతంలో బాంబులు పేలుతున్నాయి. ఆ చిత్రంపై ’నో మోర్ మిస్టర్ నైస్ గై- (ఇకపై మంచివాడిగా ఉండను) అని బ్యానర్ ఉంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న సున్నితమైన కాల్పుల విరమణ ఒప్పందంపై అనిశ్చితి పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ బెదిరింపులకు దిగడం గమనార్హం. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించాలని ట్రంప్ ఆదేశించారని వాల్‌స్ట్రీట్ జర్నల్ బుధవారం నివేదించింది. ఈ కథనం ప్రకారం ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశ ఓడరేవులను సుదీర్ఘకాలంపాటు దిగ్బంధించడానికి సిద్ధం కావాలని ట్రంప్ జాతీయ భద్రతా అధికారులను ఆదేశించారు. ఇరాన్ చిత్తశుద్ధితో చర్చలు జరపడం లేదని ఆయన భావిస్తున్నారు. ఇరాన్ తన యురేనియం శుద్ధిని 20 ఏళ్ల పాటు నిలిపివేసేలా, ఆ తర్వాత కఠినమైన ఆంక్షలను అంగీకరించేలా బలవంతం చేయాలని ఆయన ఆశిస్తున్నారని ఆ కథనం తెలిపింది. అమెరికా తమ దేశ నౌకలను స్వాధీనం చేసుకోవడాన్ని ఇరాన్ సముద్రపు దొంగతనంగా అభివర్ణించింది. ఈ వివాదంపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు, భద్రతా మండలికి ఇరాన్ రాయబారి అర్ సయీద్ ఇరవాని ఫిర్యాదు చేశారు. అమెరికా చర్యలు అంతర్జాతీయ వాణిజ్యంలో చట్టవిరుద్ధమైనవని పేర్కొన్నారు.
——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *