– ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు సీతక్క, సురేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8ః మేడారం మహా జాతరకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రులు సీతక్క, కొండా సురేఖలు ప్రత్యేకంగా ఆహ్వానించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు మంత్రులు గురువారం చేరుకోగానే మాజీ ఎంపీ సంతోష్ రావు వారిని ఆత్మీయంగా స్వాగతించారు. మంత్రులిద్దరూ మేడారం మహా జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని కేసీఆర్ దంపతులకు అందజేసి మేడారం మహా జాతరకు తప్పనిసరిగా రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆలయ ప్రసాదమైన బంగారం, నూతన వస్త్రాలను కూడా వారికి అందజేశారు. ఆహ్వాన పత్రాన్ని స్వీకరించిన కేసీఆర్ మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మేడారం మహా జాతరకు హాజరవుతానని చెప్పారు. మేడారం ఆలయ నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ సతీమణి శోభమ్మ మంత్రులు సీతక్క, కొండా సురేఖలకు బొట్టు పెట్టి నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల సమయంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు స్వయంగా మేడారం మహా జాతర ఆహ్వానం అందజేశామని, ఆ సమయంలో కేసీఆర్ ను కలుసుకునే అవకాశం రాలేదని, అందుకే స్వయంగా ఫామ్ హౌస్‌కు వచ్చి ఆహ్వానించామని చెప్పారు. మంత్రులతోపాటు ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు ఆకాంక్ష రెడ్డి కూడా ఉన్నారు.
మంత్రులకు ఆత్మీయ పలకరింపు : పసుపు కుంకుమలతో సత్కరించిన శోభమ్మ
సిద్దిపేట: బాగున్నారా అమ్మ అంటూ తన నివాసానికి వచ్చిన మహిళా మంత్రులకు మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆత్మీయంగా పలకరిస్తూ స్వాగతం పలికారు. కొండా సురేఖ, సీతక్క గురువారం సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోనీ కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలని కోరుతూ ప్రభుత్వం తరఫున కేసీఆర్ దంపతులను బొట్టు పెట్టి ఆహ్వానించారు. తమ ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి, పసుపు-కుంకుమ వస్త్రాలు, తాంబూలాలతో సంప్రదాయ పద్ధతిలో కేసీఆర్–శోభమ్మ దంపతులు సత్కరించారు. అనంతరం తేనీటి విందు ఏర్పాటు చేశారు. పరస్పర యోగక్షేమాల అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణమయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




