– ప్రధాని మోదీ పేదల పొట్టకొట్టే యత్నం
– అధికారం ఉందని ఇష్టారీతి నిర్ణయాలు
– ఉపాధితో పేదరిక నిర్మూలనకు అడుగులు
– మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం
– సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8: పేదలపై కక్షతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్నే మారుస్తారా అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు. గాంధీ భవన్‌లో గురువారం నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ , పలువురు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అధికారం ఉందని మోదీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మెజారిటీ ఉందని చట్టసభలను వినియోగించి పేదలను అణచివేస్తామంటే కుదరదు. ఉపాధి హా పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాల్సిన సమయమిదని అన్నారు. ఈ పథకంతో ఎన్నో విప్లవాత్మక మార్పులు వొచ్చాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 2024 ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ నేతలు ప్రచారం చేశారు. అన్ని సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్నే మార్చేసేవారు. తద్వారా పేదల హక్కులను కాలరాయాలని చూశారు. కార్పొరేట్లకు దేశాన్ని అప్పగించే ప్రయత్నం చేశారు. ప్రజలను కాంగ్రెస్ అప్రమత్తం చేయడంతో బీజేపీ 240 సీట్ల వద్ద ఆగిపోయింది. దీంతో రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన వాయిదా పడింది.
వోట్ల తొలగింపు వెనుక పెద్ద కుట్ర
వోట్లను తొలగించేందుకు ఎస్‌ఐఆర్ తీసుకొచ్చారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఉపాధి హా పథకం వల్ల వెట్టిచాకిరి ఆగిపోయిందని, గ్రామాల నుంచి వలసలు తగ్గాయన్నారు. అలాగే పనికి తగ్గ వేతనం డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దేశంలో 80 శాతం మంది ఈ ఉపాధి హాపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నుతోందని సీఎం రేవంత్ ఆరోపించారు. పథకం పేరు మార్పు వెనుక ప్రధాని మోదీ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఎస్‌ఐఆర్ వెనుక పెద్ద కుట్ర ఉందని.. వీబీ జీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్) చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. ఉపాధి హామీని రద్దు చేస్తే మళ్లీ వలసలు ప్రారంభమవుతాయని హెచ్చరించారు. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు, అదానీ-అంబానీలకు ప్రజలను కూలీలుగా మార్చేందుకు ఉపాధి హాని రద్దు చేస్తున్నారని విమర్శించారు. వికసిత్ భారత్ కాదు.. సంక్షోభ భారత్‌ను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నల్ల చట్టాల విషయంలో క్షమాపణ చెప్పే వరకు వదల్లేదని.. ఇప్పుడు ఉపాధి హా విషయంలోనూ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అధికారం ఉందని మోదీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ ఆరోపించారు. సమావేశంలో పార్టీ కార్యకర్తల పాత్రను ముఖ్యమంత్రి రేవంత్ కొనియాడారు. కార్యకర్తల కష్టం, త్యాగాలతోనే అధికారంలో ఉన్నామని.. వచ్చిన పదవులన్నీ కార్యకర్తలు ఇచ్చినవేనని చెప్పారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో 66 శాతంపైగా కాంగ్రెస్ గెలిచిందని, మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలవాలని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడినవాడు ఎప్పుడూ నష్టపోడని తెలిపారు. కాంగ్రెస్ మంత్రులంతా కష్టపడి పైకొచ్చినవారేనని, పార్టీ అవకాశం ఇస్తే తనతోపాటు ఎవరికైనా గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు.
ఉపాధి హామీపై మరణశాసనమే: మంత్రి ఉత్తమ్ కుమార్
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో (ఎమ్జీఎన్‌ఆర్‌ఈజీఎస్) కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలు గ్రామీణ కార్మికులకు మరణశాసనమని నీటిపారుదల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.మోదీ ప్రభుత్వం పథకాన్ని బలహీనపరచేందుకు రూట్‌మ్యాప్‌ను రూపొందించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మానసపుత్రికగా పేరుగాంచిన ఈ చట్టం గ్రామీణ భారతంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. 100 రోజుల పని హామీ, వేతనాలు, గ్రామ పంచాయతీల అధికారాలు.. ఇవన్నీ రద్దు చేసి పథకం ఉద్దేశాన్నే దెబ్బతీశారన్నారు. నిధులలో40 శాతం కోతలు విధించి రాష్ట్రాలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని 12 వేల గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి, ఎంజీనరేగా పునరుద్ధరణ కోసం రాష్ట్రపతికి సమర్పించాలని పిలుపునిచ్చారు. సోనియాగాంధీ అలుపెరగని పోరాటాన్ని అభినందించారు.
సామ్రాజ్యవాదుల కంటే బీజేపీ ప్రమాదకరం : డిప్యూటీ సీఎం భట్టి 
జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గాంధీ భవన్‌లో గురువారం జరిగిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన చట్టాలు ఈ దేశంలో సామాజిక, ఆర్థిక , రాజకీయ సంస్కరణలు, గొప్ప మార్పులు తెచ్చాయన్నారు. సామ్రాజ్యవాదుల కంటే బీజేపీ ప్రమాదకరమని ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒక్క కొత్త చట్టం తీసుకు రాకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన చట్టాలన్నిటినీ రద్దు చేసే కార్యక్రమం చేపట్టిందన, చివరకు దేశ స్వాతంత్య్రాన్ని కూడా రద్దు చేస్తుందని విమర్శించారు. కొత్త ఉపాధి చట్టం రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలోని పెద్దలు అంతా ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





