‘డోర్ స్టెప్ డెలివరీ’ మరింత చేరువ

– మీ సేవ, సైబరాబాద్ మున్సిపల్, పోలీస్, సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త కార్యక్రమం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా మీ సేవ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం విజయవంతమైంది. సైబరాబాద్ పరిధిలో ఉన్న రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో ఉన్నతాధికారులు పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ, మీ సేవ కమిషనర్ టి.రవికిరణ్ హాజరయ్యారు. ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే కార్యక్రమంలో భాగంగా మీ సేవ అందిస్తున్న డోర్‌స్టెప్ డెలివరీ(డీఎస్‌డీ) సేవల గురించి కమిషనర్ రవికిరణ్ ప్రత్యేకంగా వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు దార్శనికతతో పౌరసేవలు అత్యంత సులువుగా అందుతున్నాయని తెలిపారు. ప్రజలు మీ సేవ కేంద్రాలకు వెళ్లకుండానే తమ ఇంటి వద్ద నుంచే వివిధ ప్రభుత్వ సేవలను పొందే అవకాశం డోర్ స్టెప్ సర్వీసుల ద్వారా లభిస్తుందన్నారు. బిజీగా ఉండే ఐటీ ప్రొఫెషనల్స్‌తోపాటు, మీ సేవ కేంద్రాల దాకా వెళ్లలేని వృద్దులకూ ఈ సౌకర్యం ఉపయోగపడుతుందన్నారు. 1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఈ సేవలను పొందవచ్చని, జనన, మరణ ధృవీకరణ పత్రాల్లో సవరణలు, పిల్లల పేర్ల నమోదు, కుల ధ్రువీకరణ పత్రాలు, జనన తేదీ ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు, గ్యాప్ సర్టిఫికెట్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, Oద్పుీ సర్టిఫికెట్లు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చు ఆదా చేయడంతోపాటు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంలో ఈ విధానం కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పౌర సేవలను సులభతరం చేసి అందించటంలో మీ సేవ చొరవను కమిషనర్ సృజన మెచ్చుకున్నారు. తగిన ప్రచారం కల్పించటం ద్వారా ఈ సేవలు పొందాలని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లను కోరారు. ప్రభుత్వ శాఖలు, పోలీస్ విభాగం, మున్సిపల్ సంస్థలు, సాంకేతిక సేవా సంస్థలు, నివాస సముదాయాల మధ్య సమన్వయం పెంపొందించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని పోలీస్ కమిషనర్ రమేష్ తెలిపారు.

ప్రజా రవాణా వ్యవస్థ వినియోగం మరింతగా పెరగాలి

సైబరాబాద్ పరిధిలోని పౌరులు ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా వినియోగించడంపై దృష్టి పెట్టాలని కమిషనర్ రమేష్ కోరారు. సైబరాబాద్ మూవ్స్ పేరుతో ట్రాఫిక్‌పై అవగాహన కల్పించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టు, ప్రత్యేక లూప్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌ల మద్దతు కూడా కావాలని కోరారు.

ప్రజా రవాణా, ఆన్‌లైన్ బుకింగ్ సేవలకు డిజిటల్ పరిష్కారం

మీ టికెట్ యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న డిజిటల్ సేవలను కూడా కార్యక్రమంలో వివరించారు. ఈ యాప్ ద్వారా కొత్త బస్ పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడం, రెన్యువల్, టీజీఎస్ ఆర్టీసీ బస్ టికెట్ సేవలు, హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ బుకింగ్, నెహ్రూ జూ పార్కుతోపాటు, ఇతర పార్కులు, సందర్శనీయ స్థలాల ప్రవేశ టికెట్లను నేరుగా ఈ యాప్ నుంచే ఆన్‌లైన్ బుకింగ్ చేసుకునే సౌకర్యాలను పౌరులు వినియోగించుకోవచ్చని తెలియజేశారు. డిజిటల్ సాంకేతికత ద్వారా ప్రజా రవాణా, వినోద, ఇతర పౌర సేవలను సులభంగా పొందేలా చేయడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశమని వివరించారు.

రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌ల భాగస్వామ్యానికి పిలుపు

ఈ కార్యక్రమంలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ‘క్యూర్’ పరిధిలో అమలవుతున్న డోర్ స్టెప్ సర్వీసుల సేవలను పొందేందుకు గేటెడ్ కమ్యూనిటీ, అపార్టుమెంట్ అసోసియేషన్లు భాగస్వాములు కావాలని అధికారులు ఆహ్వానించారు. ప్రతీ నివాస సముదాయంలోని ప్రజలకు మీ సేవ డోర్‌స్టెప్ డెలివరీ, మీ టికెట్ యాప్, ఇతర ప్రభుత్వ, పౌర సేవలపై అవగాహన కల్పించడంలో అసోసియేషన్లు వారధిగా నిలవాలని సూచించారు. ప్రభుత్వ చొరవను, ఐటీ శాఖ ద్వారా అందిస్తున్న సేవలను రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేన్ల ప్రతినిధులు ప్రశంసించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *