ఎల్‌నినో బిల్లులు ఎవరి జేబుల్లోకి?

– \రాష్ట్రంలో 35-40% వర్షపాత లోటు.. పడిపోయిన భూగర్భ జలాలు
– రూ.802.92 కోట్ల ప్రణాళికతో రేవంత్ రెడ్డికి నివేదిక
– కమిటీ సిఫార అమలులో ఆచరణ ఎంత?
– చిన్నారెడ్డి కమిటీ నివేదికపై లోతైన విశ్లేషణ

(మేకల ఎల్లయ్య – ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)

రాష్ట్రాన్ని ఎల్‌నినో రూపంలో తీవ్రమైన వాతావరణ పరిణామాలు, వర్షాభావ పరిస్థితులు ముంచెత్తుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడంతో ప్రారంభమైన ఈ శీతోష్ణస్థితి మార్పు, భారతీయ నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపింది. రాష్ట్రంలో సాధారణ నైరుతి రుతుపవనాల వర్షపాతం 740.60 మిల్లమీటర్లు కాగా, జూలై చివరి నాటికి కేవలం 234.80 మిల్లీమీటర్లు మాత్రమే నమోదై, దాదాపు 30 శాతం నుంచి 40 శాతం వర్షపా లోటు ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 23 జిల్లాలలో వృద్ధి క్షీణించి జలాశయాల్లో ఇన్‌ఫ్లో తగ్గడం, భూగర్భ జలమట్టం గత ఏడాదితో పోలిస్తే సగటున ఒక మీటరు కంటే దిగువకు పడిపోవడం గమనార్హం. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జీవో 427 ద్వారా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి అధ్యక్షతన 27 మంది నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమగ్ర పరిశోధనలు చేసి రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి అందజేసింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపి, సీనియర్ అధికారులు కృపాకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలతో కూడిన బృందం సమర్పించిన ఈ సిఫార్సుల అమలుకు రూ. 802.92 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. అయితే ఈ కార్యాచరణ నివేదిక ఆచరణాత్మకత, ప్రభుత్వ పరిపాలనా-ఆర్థిక సామర్థ్యాలు, లోపించిన విధానపరమైన వ్యూహాలు, చారిత్రక కరవు నిర్వహణ పాఠాలు, అంతర్జాతీయ నమూనాల ఆధారంగా రూపొందించిన లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నది. వాతావరణ శాఖ (ఐఎండీ) పరిశోధకుడు డాక్టర్ ఎస్. స్టెల్లా అందించిన విశ్లేషణల ప్రకారం ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐవోడీ) తటస్థంగా ఉన్నందున ఎల్‌నినో తెస్తున్న పొడి వాతావరణాన్ని తగ్గించే అవకాశం లేకపోయింది. రాష్ట్రంలో నీటిపారుదల, వ్యవసాయం, పశుసంవర్ధకం, ఉద్యానవనం, విద్యుత్ శక్తి రంగాలు తీవ్ర ప్రతికూల ప్రభావానికి లోనవుతున్నాయి. ఈ సవాళ్లను అధిగమించేందుకు చిన్నారెడ్డి కమిటీ గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలలో తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను ప్రతిపాదించింది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గడంతోపాటు భూగర్భ జలాలు 1 మీటరు లోతునకు పడిపోయాయి. దీనితో నీటి అవసరం ఎక్కువగా ఉండే వరికి బదులుగా కందులు, పెసలు, మినుములు, జొన్న, రాగులు, సజ్జలు సాగు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ ప్రత్యామ్నాయ పంట విత్తనాలపై 75 శాతం సబ్సిడీ ఇవ్వాలని, పంట రుణాల పునర్వ్యవస్థీకరణతోపాటు మారటోరియం విధించాలని సూచించింది. జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోవడంతోపాటు, ప్రాజెక్ట్ ఇన్ ఫ్లోలు నిలిచిపోవడంతో డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థలను విస్తృతంగా అమలు చేయాలని, బ్రాడ్ బెడ్ అండ్ ఫరో, రిడ్జ్ అండ్ ఫరో పద్ధతులు అవలంభించాలన్నది. భూగర్భ జలాల రీచార్జి పనులు చేస్తూ ఫార్మ్ పాండ్లు, మల్చింగ్, వర్షపు నీటి నిల్వ నిర్మాణాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. నీటి లభ్యత తగ్గడంతో శాశ్వత తోటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నందున, తక్కువ వ్యవధిలో చేతికి వచ్చే కూరగాయల సాగుతోపాటు ఆయిల్ పామ్, పండ్ల తోటలు, పట్టుపరిశ్రమకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని, శాశ్వత పందిర్లు, షేడ్ నెట్ హౌస్‌లు, ఉద్యాన నీటి వనరులకు పాయింట్ సబ్సిడీలు కల్పించాలన్నది. పశుగ్రాస కొరతతో మేత ధరల పెరుగుదలతోపాటు పశువుల అమ్మకం పెరిగే ప్రమాదం ఉన్నందున జిల్లాస్థాయి పశుగ్రాస బ్యాంకుల ఏర్పాటు, సైలేజ్, హే తయారీ, అజోల్లా సాగు చేయాలని సూచించింది. దీనితో పాటు ఉచితంగా పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేయాలని, అవసరమైనచోట పశు శిబిరాలు ఏర్పాటు చేసి తాగునీటి తొట్టెల నిర్వహణ చేయాలన్నది. మంచినీటి ఎద్దడి, గ్రామీణ వలసల పెరుగుదలను నివారించేందుకు మిషన్ భగీరథ ద్వారా ప్రాజెక్టుల నీటిని తాగునీటికే మొదటి ప్రాధాన్యంగా కేటాయించాలని, ఉపాధి హామీ పథకం కింద చెరువుల పూడికతీత, చెక్ డామ్‌ల నిర్మాణ పనులు చేపట్టి, గ్రామీణ కూలీలకు నిరంతరంగా పని కల్పించాలన్నది.

కమిటీ సిఫార అమలులో ఆచరణ ఎంత?

కమిటీ రూ.802.92 కోట్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించినప్పటికీ ప్రభుత్వ ఆర్థిక, పరిపాలనా యంత్రాంగానికి ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యమనే అంశంపై విధానపరమైన సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. మొదటగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. బడ్జెట్ ప్రతిపాదనల్లో సంక్షేమ పథకాలకు ఉన్న భారీ కట్టుబాట్లు, రుణాల తిరోగమన చెల్లింపుల నేపథ్యంలో రూ.802.92 కోట్ల తక్షణ కేటాయింపు అంత సులభం కాదు. అందుకే ప్రభుత్వం కేంద్ర విపత్తు సహాయ నిధి (ఎన్ డీఆర్ఎఫ్/ఎస్ డీఆర్ఎఫ్) ద్వారా సహాయం కోరాలని భావిస్తోంది. కేంద్రం నుంచి నిధుల మంజూరు ఆలస్యమైతే 75 శాతం సబ్సిడీపై విత్తనాల పంపిణీ, సూక్ష్మ సేద్య పరికరాల సరఫరా ప్రక్రియ ఖరీఫ్ సీజన్ ముగిసేవరకు కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉన్నది. రెండవది క్షేత్రస్థాయిలో సాగు సరళిని మార్చడంలో యంత్రాంగం వైఫల్యం చెందుతున్నది. జూలై 21 నాటికే రైతులు 10,06,511 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. వ్యవసాయ శాఖ భూగర్భ జలాలను వాడవద్దు, వరి సాగు ఆపండి అని హెచ్చరించినప్పటికీ ప్రత్యామ్నాయ పంటలకు రాబడి హామీ లేకపోవడంతో రైతులు ఈ సూచనలను తిరస్కరించారు. నష్టపరిహార నిధి లేకుండా కేవలం ప్రకటనల ద్వారా రైతుల సాగు విధానాన్ని మార్చడం పరిపాలనాపరంగా అసాధ్యంగా మారింది. మూడవది ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లేమి అంతర్గత ప్రతిబంధకంగా మారింది. ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపిన వివరాల ప్రకారం జలవిద్యుత్ ఉత్పత్తి పడిపోయి విద్యుత్ గ్రిడ్‌పై తీవ్ర భారం పడుతున్నది. నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్ ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో రాకపోతే రిజర్వాయర్లలోని నీరు కేవలం తాగునీటికే పరిమితమవుతుంది. నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖల మధ్య సరైన డేటా సమగ్రత లేకపోవడం వల్ల క్షేత్రస్థాయి నిర్ణయాల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది.

నిపుణుల కమిటీ ప్రణాళికలో కొన్ని లోపాలు

చిన్నారెడ్డి నిపుణుల కమిటీ ప్రాథమిక సవాళ్లను గుర్తించినప్పటికీ, వాతావరణ మార్పులను ఎదుర్కొనే దీర్ఘకాలిక నిర్మాణాత్మక పరిష్కారాలను నివేదికలో చేర్చడంలో విఫలమైంది. వాతావరణ లోటు వర్షపాత ప్రభావాన్ని, నీటి కొరతను లెక్కించేందుకు అనుసరించే ప్రామాణిక శోషణ సూచీ విధానం P_d = (P_n – P_a/P_n) ×100. ఇక్కడ P_d అనేది వర్షపాత లోటు శాతం. P_n అనేది సాధారణ వర్షపాతం (740.60 మి.మీ). P_a అనేది వాస్తవంగా నమోదైన వర్షపాతం (234.80 మి.మీ). ఈ గణాంకాల ఆధారంగా తీవ్రమైన పొడి పరిస్థితులు ఆవహించిన వేళ, కమిటీ మరిన్ని మెరుగైన వ్యూహాలను నివేదికలో జోడించాల్సి ఉండాలి. కమిటీ ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని చెప్పినప్పటికీ, మార్కెట్ జోక్యం నిధి, కొనుగోలు గ్యారంటీని ప్రతిపాదించలేదు. రైతులు వరికి బదులు కందులు, జొన్నలు పండించినప్పుడు మార్కెట్‌లో మద్దతు ధర లభించకపోతే వారు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతారు. అందువల్ల ప్రత్యామ్నాయ పంటలకు నిర్దిష్టమైన కొనుగోలు యంత్రాంగాన్ని శాసనాత్మకంగా అమలు చేయాల్సి ఉన్నది. అదేవిధంగా సబ్సిడీ ఆధారిత పరికరాల పంపిణీ కంటే, వర్షాభావం వల్ల పంటలు దెబ్బతిన్న,  పంట సాగు చేయలేకపోయిన చిన్న, సన్నకారు రైతులకు ఎకరాకు నిర్దిష్ట మొత్తంలో “ప్రత్యక్ష వాతావరణ పరిహారం” నిధిగా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసే (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ – డీబీటీ) విధానాన్ని కమిటీ సిఫార్సు చేసి ఉండాల్సింది. సాంకేతికత వినియోగం విషయంలో, కేవలం వాతావరణ హెచ్చరికలకే పరిమితం కాకుండా, ప్రతి గ్రామానికి డిజిటల్ ఆక్విఫర్ మ్యాపింగ్, శాటిలైట్ ఆధారిత సాయిల్ మాయిశ్చర్ మ్యాపింగ్‌ను అందుబాటులోకి తెచ్చి, నీటి వాడకాన్ని డిజిటల్ బడ్జెటింగ్ చేసే యంత్రాంగాన్ని ప్రతిపాదించడంలో కమిటీ విఫలమైంది. అలాగే సమగ్ర పంటల బీమా వ్యవస్థ పునర్నిర్మాణాన్ని దీర్ఘకాలిక ప్రణాళికలో భాగం చేయకపోవడం నివేదికలోని ప్రధాన లోపం.

అత్యవసర సామాజిక భద్రతా చర్యలు అవసరం

వర్షాభావం, కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు వ్యవసాయ భూమి ఉన్న రైతుల కంటే, భూమి లేని గ్రామీణ కూలీలు, చేతివృత్తుల వారే తీవ్రంగా నష్టపోతారు. ఉపాధి లేక గ్రామాల నుంచి నగరాలకు వలసలు పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో నిరుపేదలను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం అందిస్తున్న 100 రోజుల ఉపాధిని కరువు పీడిత ప్రాంతాల్లో తక్షణమే 150 నుంచి 200 రోజులకు పెంచాలి. పనుల వేతనాలను వారంలోగా చెల్లించేలా నిధులు విడుదల చేయాలి. ఉచిత బియ్యంతో పాటు, వర్షాభావ కాలంలో పిల్లలు, గర్భిణుల్లో పెరిగే పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా కందిపప్పు, వంటనూనెలు, చిరుధాన్యాలు, గుడ్లను ఉచితంగానైనా, రాయితీపైన అయినా  అందించాలి. చిన్న రైతులు మేత లేక తమ పశువులను తక్కువ ధరలకు విక్రయించకుండా కాపాడేందుకు ప్రతి పంచాయతీ పరిధిలో ఉచిత పశుగ్రాస వితరణ కేంద్రాలను, ఉచిత పశు వైద్య శిబిరాలను తక్షణమే ప్రారంభించాలి. గ్రామీణ ప్రాంతాల్లో నీటి కాలుష్యం పెరిగి అంటువ్యాధులు వ్యాపించకుండా ట్యాంకర్ల ద్వారా ఉచితంగా మంచినీళ్లు సరఫరా చేయాలి. గ్రామాల్లో మొబైల్ మెడికల్ యూనిట్లను నిరంతరం అందుబాటులో ఉంచాలి.

వర్షాభావ పరిస్థితుల్లో గతానుభవాలు

భారతదేశంలో వర్షాభావం, కరువులు కొత్తగా వచ్చిన పరిణామాలు కావు. చారిత్రక సంక్షోభాలు దేశపు వ్యవసాయ, సామాజిక విధానాలను మార్చడంలో కీలక పాత్ర పోషించాయి. 1965-66 తీవ్ర కరువు కాలంలో దేశం తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొని, అమెరికా “పీఎల్-480” కింద ఆహార సాయంపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ అవమానకర స్థితి నుంచే భారత ప్రభుత్వం వ్యవసాయ సాంకేతికతను పెంచి “హరిత విప్లవం” సాధించడానికి, భారత ఆహార సంస్థ (ఎఫ్ సీఐ),  ప్రజా పంపిణీ వ్యవస్థలను శాశ్వతంగా ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టింది. 1972 మహారాష్ట్ర కరువు సమయంలో గ్రామీణ ప్రజల ఆకలి చావులను నివారించేందుకు అక్కడి ప్రభుత్వం “ఉపాధి హామీ పథకాన్ని” ప్రారంభించింది. ఈ చారిత్రాత్మక నమూనా తదుపరి కాలంలో జాతీయ స్థాయిలో 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి (ఎంజీఎన్ఆర్ఈజీఏ) ప్రాతిపదికగా మారింది. 1987, 2002 జాతీయ కరువుల సమయంలో, ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి “ఫ్యామిన్ కోడ్స్” నుంచి సైంటిఫిక్ విపత్తు యాజమాన్యం వైపు మారింది. ఫలితంగా 2005 లో “జాతీయ విపత్తు నిర్వహణ చట్టం” (డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు) రూపకల్పన జరిగి, కేంద్ర-రాష్ట్ర స్థాయిల్లో ఎస్ డీఆర్ఎఫ్/ఎన్ డీఆర్ఎఫ్ విపత్తు నిధుల నిరంతర కేటాయింపులు అమల్లోకి వచ్చాయి.

కరవును ఎదుర్కోవడంలో విధానపరమైన లోపాలు

ప్రపంచంలోనే తీవ్ర నీటి కొరత, పొడి వాతావరణం కలిగిన దేశాలు సాంకేతిక, విధానపరమైన విప్లవాల ద్వారా సంక్షోభాలను అధిగమించాయి. ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా దేశాల నమూనాలతో పోలిస్తే భారతీయ / తెలంగాణ విధానాలు ఇంకా సంప్రదాయ, తాత్కాలిక సహాయక ధోరణిలోనే ఉన్నాయి. ఇజ్రాయెల్ లో 86-90 శాతం రీసైకిల్ చేసిన మురుగునీటిని (వేస్ట్ వాటర్) వ్యవసాయానికి వాడుతున్నారు. 75 శాతం సాగును డ్రిప్ పరిధిలోనే ఉంచింది. ఆస్ట్రేలియాలో వాటర్ ట్రేడింగ్, వాటర్ మార్కెట్ వ్యవస్థల ద్వారా నీటిని సమర్థంగా వినియోగిస్తున్నారు. భారతదేశంలో ప్రధానంగా వర్షాపాతం, భూగర్భ జలాలు, నదీ జలాలపై ఆధారపడుతున్నారు. ఇక్కడ వ్యర్థ నీటి పునర్వినియోగం అతిస్వల్పంగా ఉన్నది. ఇజ్రాయెల్ లో 1959 నీటి చట్టం ప్రకారం నీరంతా ప్రభుత్వ ఆస్తి. భూమి ఉన్నంత మాత్రాన అక్కడ  ఉచితంగా నీటిని తోడడం చట్టవిరుద్ధం. ఆస్ట్రేలియాలో నీటి హక్కులను భూమి హక్కుల నుంచి వేరు చేశారు. అక్కడ కరువు కాలంలో నీటిని మార్కెట్లో విక్రయించే సదుపాయం ఉన్నది. భారతదేశంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. ఇక్కడ వ్యక్తిగత భూముల్లో అపరిమితంగా భూగర్భ జలాలను తోడుతుంటారు. ఉచిత విద్యుత్ వల్ల కూడా నీటి వృధా ఎక్కువగా ఉన్నదని ఒక నివేదిక ఉన్నది. ఇజ్రాయెల్ లో మెగా డిసాలినేషన్ ప్లాంట్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తారు. షాఫ్దాన్ వ్యర్థ నీటి ప్లాంట్ ద్వారా నెగెవ్ ఎడారిలో 60 శాతం పంటలు సాగు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో క్లైమేట్ డెసిషన్ సపోర్ట్ టూల్స్, శాటిలైట్ రన్ ఆఫ్ ట్రాకింగ్ వ్యవస్థలతోపాటు  రైతులకు రిస్క్ మేనేజ్‌మెంట్ ఇన్సూరెన్స్ కల్పించారు. భారతదేశంలో మాత్రం సంక్షోభం వచ్చిన తర్వాత తాత్కాలిక కరువు నివేదికలు ఇస్తూ, తూతూమంత్రంగా సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. ఇజ్రాయెల్ లో కరువు అనేది నివారించదగిన సాంకేతిక సమస్య” అనే నిర్మాణాత్మక ముందస్తు వ్యూహంతో ప్రభుత్వం విధానపరమైన లక్ష్యంతో పనిచేస్తున్నది. ఆస్ట్రేలియాలో నేషనల్ డ్రాట్ పాలసీ (1992)ని తెచ్చారు. రైతులు స్వీయ-సమర్థత సాధించేలా ఆర్థిక భద్రత కల్పించారు. భారతదేశంలో మాత్రం సంక్షోభం సంభవించిన తర్వాత సహాయ చర్యలు చేపట్టే తాత్కాలిక పద్ధతి (రియాక్టివ్ రిలీఫ్)ని అవలంభిస్తున్నారు. ఇక్కడి పాలకులకు విధానపరమైన లక్ష్యం లేకుండా పోయింది.

కరవు రాజకీయాలు, నిధుల మళ్లింపు, పథకాల రీ-డిజైనింగ్

దేశంలో కరవు ఏర్పడినప్పుడల్లా కేటాయించే ప్రత్యేక నిధులు క్షేత్రస్థాయి ప్రజలకు చేరకుండా మధ్యలోనే దుర్వినియోగం కావడం వెనుక ఒక రాజకీయ ఆర్థిక నిర్మాణం (పొలిటికల్ ఎకానమీ ఆఫ్ డ్రాట్ కరప్షన్) దాగి ఉన్నదనే విమర్శలు బలంగా ఉన్నాయి. కరువు సహాయ పథకాల రూపకల్పనే కొన్ని రకాల స్వార్థ ప్రయోజనాల కోసం డిజైన్ చేయబడుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు ఉపాధి హామీ, కరువు నిధుల కింద చేపట్టే పనుల్లో ఎక్కువ భాగం మట్టి పనులు, చెరువుల పూడికతీత, చెక్ డామ్‌ల నిర్మాణానికే కేటాయిస్తారు. ఎందుకంటే సివిల్ పనుల్లో ఎక్స్ కవేటర్లతో పనులు చేయించి, దొంగ మస్టర్లు నమోదు చేసి, నిధులను కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి పంచుకోవడం సులభం. అదేవిధంగా, సబ్సిడీ విత్తనాలు, డ్రిప్/స్ప్రింక్లర్ పరికరాల సరఫరా పథకాలలో కొన్ని నిర్దిష్ట ప్రైవేటు తయారీ కంపెనీలకు అనుకూలంగా నిబంధనలు రూపొందించి, నాసిరకం పరికరాలను ఎక్కువ ధరలకు రైతులకు అంటగట్టి కమీషన్లు పొందే సంస్కృతి ఉందని పరిశోధనలు తెలుపుతున్నాయి. కమిటీ కేటాయించిన రూ. 802.92 కోట్ల నిధుల్లోనూ పారదర్శకత లేకపోతే, నిధులు క్షేత్రస్థాయికి చేరవు. ఈ అవినీతి శృంఖలాన్ని తెంచడానికి, పథకాలను ప్రజల ప్రయోజనాల కోసం రీ-డిజైన్ చేయడానికి  పారదర్శక విధానాలను రూపొందించాల. ఉపగ్రహ ఆధారిత నష్ట అంచనా విధానాన్ని తప్పనిసరి చేయాలి. ఐఎస్ఆర్ వో, ఎన్ఆర్ఎస్ సీ ఉపగ్రహాల ద్వారా వెజిటేషన్ ఇండెక్స్ (ఎన్ డీవీఐ) లెక్కించి, నిజమైన పంట నష్టం ఆధారంగా మానవ ప్రమేయం లేకుండా పరిహారాన్ని నిర్ధారించాలి. సబ్సిడీ నిధులను కంపెనీలకు,  మధ్యవర్తులకు ఇవ్వకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) రూపంలో జమ చేయాలి. డ్రిప్ పరికరాలను ఏ కంపెనీ వద్దనైనా కొనుగోలు చేసే స్వేచ్ఛను రైతులకు ఇవ్వాలి. కరువు నిధుల వినియోగంపై ప్రతి గ్రామంలో “డిజిటల్ సోషల్ ఆడిట్” నిర్వహించి, చేపట్టిన పనులు, ఖర్చు చేసిన సొమ్మును గ్రామ పంచాయతీల్లో బహిరంగంగా ప్రదర్శించాలి.

నిధుల వినియోగంలో పారదర్శకమైన సాంకేతిక వ్యవస్థ రావాలి

చిన్నారెడ్డి నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో సవాళ్లకు ఒక ప్రాథమిక కార్యాచరణ చట్రాన్ని అందించింది. అయితే రూ.802.92 కోట్ల నిధుల సమీకరణతోపాటు క్షేత్రస్థాయిలో వరి సాగు నియంత్రణ, ప్రత్యామ్నాయ పంటల కొనుగోలు గ్యారంటీ, శాఖల మధ్య సమన్వయం సాధించడం ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్లు. తాత్కాలిక ఉపశమన చర్యల నుంచి బయటపడి, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా దేశాల తరహాలో శాశ్వత వాతావరణ నిరోధక మౌలిక వసతుల వైపు తెలంగాణ అడుగులు వేయాలి. హైదరాబాద్ వ్యర్థ నీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి మళ్లించడం, భూగర్భ జలాల వినియోగంపై చట్టబద్ధ నియంత్రణ తేవడం, కరవు నిధుల వినియోగంలో పారదర్శకమైన సాంకేతిక వ్యవస్థలను నెలకొల్పడం ద్వారా మాత్రమే రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ నిరుపేదల జీవనోపాధిని సుస్థిరంగా పరిరక్షించడం సాధ్యమవుతుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *