దానం పార్టీ ఫిరాయింపు తప్పే

– హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు
– మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిందే

దిల్లీ, సెప్టెంబర్ 24 : దానం నాగేందర్‌పై రాష్ట్ర హైకోర్టు అనర్హత వేటు వేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. దానం పిటిషన్‌పై విచారణకు న్యాయస్థానం నిరాకరించింది. ఆయనపై అనర్హత వేటు పడిందని.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని అభిప్రాయపడింది. వ్యక్తిగతంగా పార్టీలో చేరితే తప్పు కాదని.. పదవితోపాటు ఫిరాయింపు తప్పేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. హైకోర్టు ఉత్తర్వుల్లో ఎలాంటి జోక్యం చేసుకోమని నిరాకరిస్తూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేగా రాజీనామా చేయకపోయినా లేదా అధికారికంగా రాజీనామా పత్రం ఇవ్వకపోయినా వేరే రాజకీయ పార్టీ టికెట్‌పై నామినేషన్ వేసి పోటీ చేయడం రాజ్యాంగబద్ధంగా పార్టీని వీడినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని, సుస్పష్టమైన ఆధారాలు (మరో పార్టీ బీ-ఫాంపై పోటీ చేయడం) ఉన్నప్పుడు స్పీకర్ చర్య తీసుకోకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తెలిపింది. దానం తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ వాద‌న‌లు వినిపించారు. దానం తిరిగి సొంత పార్టీకి వచ్చి(ఘర్ వాపసీ) పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ఆయనపై పార్టీ నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదని అన్నారు. ఆయనపై అనర్హత వేటు పడకూడదని అన్నారు. పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడం వేరు.. చట్టసభ సభ్యత్వాన్ని నిలబెట్టుకోవడం వేరు అని ధర్మాసనం అభిప్రాయపడింది. పార్టీలోకి తిరిగి వచ్చినంత మాత్రాన చట్టసభ సభ్యత్వంపై పడే అనర్హత వేటు తొలగిపోదని సుప్రీంకోర్టు పేర్కొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *