నదుల అనుసంధానం! ఏనుగు ఏడుగురు గుడ్డి వాళ్ళు!!

“ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి మరో బాంబు పేల్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టియంసిలు దిండికి 30 టియంసిలు మొత్తం 120 టియంసిలకు ఎన్వోసి ఇచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ తో చర్చలు జరుగుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రతిపాదనపై ఆంధ్ర ప్రదేశ్ ఉలక పలక లేదు. వాస్తవంలో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లే . కృష్ణ జలాలు ఏకంగా 120 టియంసిలు తెలంగాణకు అనుమతి ఇచ్చే స్థితిలో ఆంధ్ర ప్రదేశ్ లేదని భావిస్తున్నారు..”

దక్షిణాది రాష్ట్రాల్లో నదుల అనుసంధానం ఏనుగు ఏడుగురు గుడ్డి వాళ్ల కథలాగా తయారైంది. ఎవరి దారి వారిది. ఎవరి కోర్కెలు వారివి. ఇవి చట్ట పరిధిలో లేకున్నా కొన్ని రాష్ట్రాలు పట్టు వదలడం లేదు. వాస్తవం చెప్పాలంటే గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని దక్షిణాది రాష్ట్రాలు ఆడిస్తున్నాయి. నదుల అనుసంధానంలో మొదటిదైన మహానది గోదావరి అనుసంధానానికి అప్పట్లో ఒడిషా నిక్కచ్చిగా తిలస్కరించింది. ఈ అనుసంధానం జరగనిదే గోదావరి కావేరి అనుసంధానానికి అంగీకరించనని కెసిఆర్ అడ్డు పడ్డారు. ఇది గతం. కాగా ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రానంత వరకు గోదావరి కావేరి అనుసంధానం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి పడుతూ లేస్తూ వుండినది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న కాలంలోనే పోలవరం నుండి కావేరి అనుసంధానం చేపట్టమని పలు మార్లు కోరారు. అయితే పోలవరం వద్ద నికర జలాలు లేవని చేపట్టడానికి అనువైన పరిస్థితులు లేవని నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ తేల్చి చెప్పింది. ఇది రికార్డుల రూపంలో కూడా వుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం బనకచర్ల అనుసంధానం తలకెత్తుకున్న తర్వాత” సీన్” మారి పోయింది. కేంద్ర జల సంఘానికి పిచ్చెక్కే పరిస్థితి కల్పించారు. గోదావరి వరద జలాలతో డిపిఆర్ ఆమోదించ లేక తొలి రోజుల్లో తిరస్కరించింది. అయితే పై నుండి ఆదేశాలు వస్తుంటే కేంద్ర జల సంఘం ఒక మెట్టు దిగింది. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు వున్న పరపతి దృష్ట్యా ఏ విధంగానైనా పోలవరం బనకచర్ల అనుసంధానం గట్టెక్కించేందుకు ప్రత్యామ్నాయ ప్రతి పాదనలకు సిద్ధ పడింది. ఒకప్పుడు అమలుకు వీలుకాదని తిరస్కరించిన పోలవరం కావేరి అనుసంధానానికి దిక్కుమాలిన ఫార్ములాలను కేంద్ర జల సంఘం తయారు చేసింది. నరేంద్ర మోదీ  ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత రాజ్యాంగ బద్దత గల సంస్థలు సిబిఐ, ఇడి లాంటివి పంజరంలో పక్షులు అయినట్లే కేంద్ర జల సంఘం కూడా తయారైంది. తమ రాష్ట్రం నుండి అనుసంధానం చేపట్టక పోతే తాము అంగీకరించబోమని తెలంగాణ మొండి కేస్తోంది. పోలవరం నుండి అనుసంధానం చేపట్టినా తెలంగాణను సంత్రుప్తి పర్చేందుకు ప్రత్యామ్నాయాలు చేపట్టింది. ఇందులో భాగంగా కృష్ణలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 45 టియంసిలకు ఆంధ్ర ప్రదేశ్ ఎన్వోసి ఇవ్వాలని తెలంగాణ గోదావరిలో సమ్మక్క బ్యారేజీ నుండి 45 టియంసిలు ఆంధ్ర ప్రదేశ్ కు ఇవ్వాలని కేంద్ర జల సంఘం ప్రతి పాదించింది. గోదావరి ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారిగా నీటిని కేటాయించనందున దీనికి చట్ట బద్దత లేదని ఆంధ్ర ప్రదేశ్ తటపటాయిస్తోంది. ఈ పరిస్థితుల్లో తుంగభద్ర డ్యాంకు గేట్లు బిగించే సందర్భంలో కర్నాటక తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముగ్గురు జనాంతిక సమావేశం నిర్వహించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు ఏదో సాధించినట్లు వార్తలు వచ్చాయి. కాని వాస్తవంలో ఏమీ సాధించ లేదు. సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లుంది. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి మరో బాంబు పేల్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టియంసిలు దిండికి 30 టియంసిలు మొత్తం 120 టియంసిలకు ఎన్వోసి ఇచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ తో చర్చలు జరుగుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రతిపాదనపై ఆంధ్ర ప్రదేశ్ ఉలక పలక లేదు. వాస్తవంలో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లే . కృష్ణ జలాలు ఏకంగా 120 టియంసిలు తెలంగాణకు అనుమతి ఇచ్చే స్థితిలో ఆంధ్ర ప్రదేశ్ లేదని భావిస్తున్నారు. . నిత్య క్షామ పీడిత ప్రాంతమైన రాయల సీమ శ్రీ శైలం జలాశయంపై ఆధార పడి గాలేరు నగరి (38)హంద్రీనీవా (40)వెలుగొండ (43)తెలుగు గంగ (29)నాలుగు పథకాలు వున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో వీటికి రక్షణ వుంది. త్వరలో ట్రిబ్యునల్ తీర్పు రానున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏక పక్షంగా ఎన్వోసి ఇవ్వడం మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిల్లీ వెళ్లి కేంద్ర జల శక్తి శాఖ మంత్రి పాటిల్ ను కలసి పోలవరం కావేరి అనుసంధానం అమలు గురించి సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. తిరిగి కథ మొదటికి వచ్చినట్లయింది. గోదావరి బేసిన్ లోని భాగస్వామ్య రాష్ట్రాల సమావేశం త్వరలో ఏర్పాటు చేసి చర్చించుదామని కేంద్ర మంత్రి ముఖ్యమంత్రికి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. గత పది సంవత్సరాలుగా దఫ దఫాలుగా సమావేశాలు జరుగుతున్నాయి. ఒక సందర్భంలో ఒకరు అభ్యంతరం పెడితే మరో సందర్భంలో మరొకరు కొత్త ప్రతి పాదనతో తెర మీదకు వస్తున్నారు. అంతెందుకు? తుంగభద్ర ప్రాజెక్టుకు గేట్లు బిగించే సమయంలో ముఖ్యమంత్రులు  ముగ్గురు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సమక్షంలో సమావేశమై చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశానంతరం ఏమీ మాట్లాడ లేదు గాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అంతా ఒక కొలిక్కి వచ్చిందని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి పాటిల్ చెప్పినట్లు వ్యవహరించుతామని అంతా ఆయన బాధ్యత అని తేల్చి చెప్పారు. భారత దేశంలో నీటి కేటాయింపులు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గాని కేంద్ర జల సంఘం గాని కేటాయించిన సందర్భం లేదు. తీరా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు భాగస్వామ్య రాష్ట్రాల సమావేశం ఏర్పాటు చేస్తానని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి చెప్పి చేతులెత్తేశారు. ఒక పక్క బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. ఎంత లేదన్నా 2027 జూన్ లోపు తుది తీర్పు రానున్నది. మొన్న బుధవారం కూడా ట్రిబ్యునల్ విచారణ జరిపింది. ఆంధ్ర ప్రదేశ్ అడ్వొకేట్ తన వాదన వినిపించారు. క్యారీ ఓవర్ కింద వున్న 150 టియంసిలు ఆలాగే వుండాలని కోరారు. గతంలో తెలంగాణ 80 టియంసిల చాలని వాదించి వుంది. ఈ పరిస్థితుల్లో కృష్ణ జలాల గురించి రెండు రాష్ట్రాలు ట్రిబ్యునల్ వెలుపల ఒప్పందాలకు రావడం రెండు రాష్ట్రాలకు ఆత్మహత్యా సదృశ్యం తప్ప వేరు కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *