మోదీజీ మీరు పెట్టుకోకూడ‌ని వారితో పెట్టుకున్నారు!

  • న‌వ‌త‌రం స్వ‌రం మారుతోంది
  • యువ‌త‌రంతో పెట్టుకోవ‌ద్దు
  • హ‌క్కుల‌ కోసం పోరాడే వారిని ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు
  • సీబీఐ, ఈడీల‌కు యువ‌త‌రం భ‌య‌ప‌డ‌దు
  • ఇందిరాపార్క్ వ‌ద్ద ధ‌ర్నాలో కేటీఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: మోడీజీ  మీరు పెట్టుకోకూడని వారి తో పెట్టుకున్నారు, యువతరంతో పెట్టుకున్నారు. మోడీ గారు జాగ్రత్త పడండి. స్వరం మారుతున్నది రాజ్యం ఉలిక్కి ప‌డాలని కేటీఆర్ అన్నారు. సీజేపీ ఇచ్చిన పిలుపు మేర‌కు నీట్ పేప‌ర్ల లీక్‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ రాజీనామా చేయాలంటూ ఇందిరాపార్క్ వ‌ద్ద శుక్ర‌వారం నిర్వ‌హించిన‌ ధ‌ర్నా కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  స్వరం మారుతు న్నది, నవతరం మారుతున్నది అని కేంద్రం తెలుసుకోవాలి. శ్రీలంకలో ఈ యువతరం ఉరికించి ప్రభుత్వాలను పాతరేసింది. అలాంటి యువతరంతో పెట్టుకోవద్దని ఆయ‌న హెచ్చ‌రించారు.  తమ హక్కుల కోసం పోరాడుతున్న యువతరాన్ని తీవ్రవాదులు, దేశద్రోహులు, పాకిస్తానీలు అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నిజంగానే కేంద్రానికి బాధ్యత ఉంటే విద్యార్థుల వద్దకు వెళ్లి ఇప్పటికే అనేకసార్లు చర్చలు చేసి సమస్యలు పరిష్కరించాల్సి ఉండే. ఈ యువతరం ఈ జనరేషన్ సిబిఐ, ఈడి, ఐటిలకు భయపడేది కాదు అని మోడీ తెలుసుకోవాలి.తెలంగాణ యువతతో పాటు దేశం యువత ఆగ్రహంతో ఉన్నారు. పొట్టు పొట్టు కోపంగా ఉన్నారు. నిన్ను నీ ప్రభుత్వాన్ని మెట్టు మెట్టు ఎక్కి తొక్కుతారు. ఈ విషయాన్ని మోడీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. యువతరానికి ఏ రాజకీయ నాయకుడి అండ లేదు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వేలాదిమంది తరలి వస్తున్నారు. యువతరం ఆందోళన ఆగ్రహం కేవలం పేపర్ లీక్ కి సంబంధించిందే కాదు. 12 ఏళ్లుగా కేంద్రం చేస్తున్న మోసాలు, ద్రోహాలపైన ఆగ్రహం.అసలు పని చేయకుండా కేవలం మతం పేరుతో తప్పించుకుంటున్న తీరుని యువతరం అర్థం చేసుకున్నది. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ 24 కోట్ల ఉద్యోగాలు ఇయ్యలేనందుకే యువతరం ఈరోజు బయటకు వచ్చింది. మేకిన్ ఇండియా అడిగితే లీకిన్ ఇండియా బీజేపీ ఇచ్చింది. విద్యార్థులు యువతరం కేంద్రం నుంచి జవాబుదారితనాన్ని అడుగుతున్నది.

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పైందా అని యువతరం అడుగుతున్నది, నిలదీస్తున్నది. ఈరోజు చేపట్టిన నిరసనలో ఎలాంటి రాజకీయాలు లేవు. విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని చూడలేకనే ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం చేసి తెలంగాణ సాధించిన ఉద్యమ పార్టీగా విద్యార్థుల ఉద్యమానికి అండగా ఉండాలనుకున్నాం.
పార్టీల జెండాలు, ఎజెండాలతో వారి ఉద్యమానికి కలుషితం చేయవద్దు. కానీ వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులు ఒక్కరే కాదు వారందరికీ మనమంతా అండగా ఉన్నామని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాష్టికాన్ని అణచివేతను చూస్తే ఎవరి మనసైనా కరగాల్సిందే. వాళ్ళు అడిగిన దాంట్లో అన్యాయం ఏమున్నది? వాళ్ళు అడిగింది కేవలం తమకు న్యాయం చేయమని తమ భవిష్యత్తును కాపాడమని. యువతరం ప్రధానమంత్రి కుర్చీ అడిగిందా? కేంద్రమంత్రి కుర్చీ అడిగిందా? నీట్ పరీక్షా పత్రం పేపర్ లీక్ తో పాటు విద్యారంగంలో సంస్కరణ రావాలని సోనమ్ వాంగ్‌చుక్‌ నిరసనకు కూర్చున్నారు. మీడియా మద్దతు లేకున్నా సోషల్ మీడియా తోనే జెన్ జీ యువతరం దేశం మొత్తాన్ని కదిలించింది. ఇదే తెలంగాణ గడ్డ నుంచి 50 ఏళ్ల కింద జీనా హై తో మర్నాసికో కదం కదం పర్ లడ్నాసికో అని ఒక యువకుడు పిలుపునిచ్చిండు. ఆ స్ఫూర్తితో తెలంగాణ యువత, దేశ యువత గట్టిగా కొట్లాడుతున్నది. దేశంలోని ఆడబిడ్డలను పోలీసులు తీవ్రంగా దాడి చేస్తున్నారు. కొట్టకూడని చోట కొడుతున్నారు. విద్యార్థులకు యువతకు సంఘీభవంగా రాజకీయాలతో సంబంధం లేకుండా మా పార్టీ సంఘీభావం తెలిపింది ఈరోజు. విద్యార్థులు కోరుతున్నట్లుగా ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయించాలి. విద్యార్థులపై పెట్టిన పోలీసు కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. విద్యార్థులపై చేసిన దాష్టీకానికి అక్రమ కేసుల నమోదుకు క్షమాపణ చెప్పాలి. దేశంలో కేంద్ర మంత్రుల కొడుకులు రేపులు చేస్తే వెంటనే బెయిల్ వస్తున్నాయి కానీ పేపర్ లీకుల పైన ఎంత అడిగినా సమాధానం మాత్రం ఎందుకు రావడం లేదు. ఏ దేశం కోసం? ఏ ధర్మం కోసం? పేపర్ లీకుల పైన సమాధానం చెప్పడం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి. అడగవలసిన అవసరం ఉన్నది, నిలదీయాల్సిన అవసరం ఉన్నద‌న్నారు.

మోదీ త‌ప్పు చేశాడంటే రేవంత్‌కు ఎందుకు కోపం?

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: మోడీ పైన నేను కొట్లాడితే రేవంత్ రెడ్డి అనే కేడీకి ఎందుకు కోపం వచ్చింది? మోడీ తప్పు చేసిండు అంటే రేవంత్ రెడ్డికి ఎందుకు కోపం? మోడీని ప్రశ్నిస్తే యూత్ కాంగ్రెస్ ని ఎందుకు పంపించి నన్ను అడ్డుకుంటు న్నాడు రేవంత్ రెడ్డి చెప్పాలి. రాహుల్ గాంధీ ఢిల్లీలో కొట్లాడితే కొడంగల్లో పోయి రేవంత్ రెడ్డి దాక్కున్నాడు. నల్లమల్ల పిల్లి వోయి కొడంగల్లో దాక్కున్నది. రేవంత్ రెడ్డి కూతురునో, మ‌న‌వ‌డినో ఢిల్లీలో పిల్లల్ని కొట్టినట్లు కొడితే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా? ఢిల్లీ దాకా వెళ్లి మీ నాయకుడితో కూర్చుండి నిరసించే ధైర్యం కూడా రేవంత్ రెడ్డికి లేదు. దేశమంతా నరేంద్ర మోడీని ధర్మేంద్ర ప్రధాన్ ని ప్రశ్నిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్, కేటీఆర్ ని విమర్శిస్తున్నాడు. మేము మాట్లాడుతుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నాడు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఢిల్లీని వణకించి తెలంగాణ తెచ్చిన పార్టీ మాది. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి గడగడలాడించి అయినా విద్యార్థుల వెంట నిలబడతాం. నీకు ఎలాగూ ఢిల్లీని ప్రశ్నించే ధైర్యం లేదు రేవంత్ రెడ్డి. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నాడో రేవంత్ రెడ్డి చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *