ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలి

– అటవీ సంపదతోపాటు ఆదివాసీల జీవనోపాధికి ప్రాధాన్యం 
– అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ సీఎస్‌తో మంత్రి సీతక్క సమీక్ష

ములుగు, ప్రజాతంత్ర, నవంబర్ 7 : ములుగు జిల్లాలో విస్తారంగా ఉన్న అటవీ, ప్రకృతి సంపదను పరిరక్షిస్తూనే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి స్థానిక ఆదివాసీ గిరిజనులకు జీవనోపాధి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. అటవీ సంపదకు ఎలాంటి నష్టం కలగకుండా పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ములుగులో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ములుగు జిల్లాకు వచ్చిన జయేష్ రంజన్ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి సీతక్కతో శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అటవీ ప్రాంతాలు, పర్యావరణ పరిరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధి, ఏజెన్సీ ప్రాంతాల మౌలిక వసతులు, ఆదివాసీ గిరిజనుల జీవనోపాధి తదితర అంశాలపై ఇరువురూ విస్తృతంగా చర్చించారు. జిల్లాకు ఉన్న ప్రత్యేక భౌగోళిక, ప్రకృతి వనరుల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని మంత్రి సూచించారు. జిల్లాలోని దట్టమైన అడవులు, కొండలు, వాగులు, జలపాతాలు, సహజసిద్ధమైన ప్రకృతి ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉన్నాయని, అయితే పర్యాటక అభివృద్ధి పేరుతో అటవీ సంపదకు ఎలాంటి నష్టం కలగకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడాలని సూచించారు. ప్రకృతిని కాపాడుతూ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఎకో టూరిజం కేంద్రాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్థానిక ప్రజలను, ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులను ఈ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేయడం ద్వారా వారికి స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించవచ్చన్నారు. స్థానికంగా లభించే అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, సంప్రదాయ కళలు, ఆహార ఉత్పత్తులు తదితరాలను పర్యాటక రంగంతో అనుసంధానం చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ములుగు ప్రకృతి సంపదను పరిరక్షించడంతో పాటు స్థానిక ప్రజల ఆదాయాన్ని పెంచే విధంగా అభివృద్ధి కొనసాగాలని అన్నారు. అటవీ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రహదారులు, తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ఇతర అత్యవసర మౌలిక వసతుల కోసం చేపట్టే అభివృద్ధి పనులకు కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతుల ప్రక్రియలో అనవసర జాప్యం లేకుండా చూడాలని కోరారు. ఏజెన్సీ గ్రామాల ప్రజలకు మౌలిక వసతులు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేయాలని జయేష్ రంజన్‌ను మంత్రి కోరారు. జిల్లా ప్రకృతి సంపదను భవిష్యత్ తరాలకు కాపాడుతూ అదే సమయంలో అక్కడి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా అటవీ, పర్యావరణ శాఖతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎఫఓతోపాటు అటవీ, పర్యావరణ, జిల్లా పరిపాలనకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *