కేసీఆర్ ఫామ్ హౌస్ భూములపై విచారణ

‌‌– 30 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అదేశాలు
– కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సర్వే నంబర్లతో సహా వెల్ల‌డి
– ఫామ్ హౌస్ పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్న సీఎం
– ప్రభుత్వ భూమిగా తేలితే పేదలకు పంచుతామని ప్రకటన

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 16 : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ పరిధిలోని భూములపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ వేదికగా ఈ సంచలన ప్రకటన చేసిన సీఎం.. కేసీఆర్ ఫామ్ హౌస్ ఆధీనంలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విచారణను 30 రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ సకాలంలో విచారణ పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు, మంత్రులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విపరీతంగా ఆస్తులు కూడబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం పేరు మీద ఎక్కడెక్కడ, ఎన్ని ఎకరాల స్థిరాస్తులు ఉన్నాయో సర్వే నంబర్లతో సహా సభలో చదివి వినిపించారు. కేసీఆర్ దంపతులకు 27 ఎకరాలు ఉండాల్సి ఉండగా ఏకంగా 67 ఎకరాల భూమి ఉందని తెలిపారు. కేటీఆర్ కుటుంబంలో నలుగురి పేరు మీద 123 ఎకరాల భూములు ఉన్నాయని వెల్లడించారు. ఇందులో కేటీఆర్ పేరు మీద 49.5 ఎకరాలు, ఆయన భార్య శైలిమ పేరు మీద 17.5 ఎకరాలు, అలేఖ్య పేరు మీద 9.38 ఎకరాలు, హిమాన్ష్ పేరు మీద 46.3 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. ఉద్యమాన్ని, ధరణిని అడ్డంపెట్టుకుని భారీగా దోపిడీ చేశారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఫామ్ హౌస్ పరిధిలో దాదాపు 340 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అసలు ఆ ఫామ్ హౌస్ భూమి కథేంటో తేల్చాలని ఇప్పుడే కలెక్టర్‌ను ఆదేశిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌కు తక్షణమే నోటీసులు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అధికారుల విచారణలో అది ప్రభుత్వ భూమిగా తేలితే, ఆ భూమినంతటినీ పేదలకు పంచుతామని ఆయన స్పష్టం చేశారు. హరీష్ రావు.. ఫాం హౌస్ రంగనాయక సాగర్ దగ్గర ఉందని.. హరీష్ రావు తన ఫాం హౌస్కు స్పెషల్గా రోడ్డు వేయించుకున్నాడని చెప్పారు. 10 ఎకరాల ఇరిగేషన్ భూమిని సుడాకు హరీశ్ బదిలీ చేయించాడని సీఎం రేవంత్ చెప్పారు. 9 జిల్లాలు, 24 మండలాలు, 31 గ్రామాల్లో కేసీఆర్ ఫ్యామిలీకి 440 ఎకరాల భూమి ఉందని సీఎం ప్రకటించారు. సిద్దిపేట మున్సిపాలిటీ నిధులతో హరీశ్ రావు ఫాంహౌస్కు రోడ్లు వేయించుకున్నాడని ఆరోపించారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫ్యామిలీకి షాబాద్లో 47 ఎకరాలు ఉన్నాయని సీఎం చెప్పారు. ఇందులో 11.5 ఎకరాల ఇనాం భూములు తీసుకున్నారని.. ఇనాం భూములు జగదీశ్వర్ రెడ్డికి ఎలా పట్టా అయిందని సీఎం రేవంత్ ప్రశ్నించారు. పైలెట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్ అసైన్డ్ భూముల్లో ఉందని సీఎం వెల్లడించారు. కిషన్ రెడ్డి సొంతూరు తిమ్మాపూర్లో కబ్జాలు చేశారని.. తిమ్మాపూర్లో 77 ఎకరాల భూదాన్ భూమి ఉందని సీఎం చెప్పారు. 77 ఎకరాల భూదాన్ భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరు పైకి వెళ్లిందని, అసలు భూదాన్ భూములు ఎలా పట్టా చేశారని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. 77 భూదాన్ భూములపై మాట్లాడితే సబిత తనను విమర్శిస్తోందని.. బహదూర్ పుర, తిమ్మాపూర్ భూములపై విచారణ జరగాలని సీఎం అభిప్రాయపడ్డారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎవరికి బంధువని సీఎం ప్రశ్నించారు. నమస్తే తెలంగాణ ఎండీకి విలువైన కార్లు ఎలా వచ్చాయని విస్మయం వ్యక్తం చేశారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ నుంచి గిఫ్ట్లు తీసుకుంది మీరు కాదా అని బీఆర్ఎస్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
బోయిన పల్లి వినోద్, బోయినపల్లి శ్రీనివాస రావు కేసీఆర్ బినామీలు అని సీఎం రేవంత్ ఆరోపించారు. వట్టినాగులపల్లిలో శ్రీనివాసరావు కబ్జాలను బయటపెడతానని సీఎం స్పష్టం చేశారు. భూపాలపల్లిలో 106 ఎకరాల ఫారెస్ట్ భూములు తొలగించి రిజిస్ట్రేషన్ చేశారని సీఎం వివరించారు. గండ్ర వెంకటరమణా పేరుతో 106 ఎకరాల ఫారెస్ట్ భూమి రిజిస్ట్రేషన్ అయి ఉందని చెప్పారు. నెలిమలి గ్రామంలో 13 వందల ఎకరాల భూమి బీఆర్ఎస్ వ్యక్తి పట్టా చేసుకున్నాడని సీఎం బయటపెట్టారు. సిరిసిల్లలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకు మారాయని, 8 వేల ఎకరాలు బీఆర్ఎస్ నేతల పేరుపైకి మార్చుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. హరీష్ రావు పేరు మీద 27 ఎకరాలు, ఆయన భార్య పేరు మీద 8 ఎకరాల భూమి ఉందని సీఎం చెప్పారు. కవిత ఫ్యామిలీకి 37 ఎకరాల భూమి ఉందని తెలిపారు. జోగినపల్లి సంతోష్ పేరుతో 53 ఎకరాలు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సర్వే నంబర్లతో సహా వివరాలను బయటపెట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *