– ఆరుగురు విద్యార్థుల మృతి
– చెరువులో మట్టి కోసం తీసిన గుంతలతోనే ప్రమాదం
– ఈత రాకపోవడంతో విగ్రహం సహా మునిగిపోయిన విద్యార్థులు
– ఘటనపై ఆరా తీసిన ఎమ్మెల్యే జీఎంఆర్
– ప్రాచీన్ హాస్పిటల్‌కు చేరుకున్న సైబరాబాద్ డీసీపీ శ్రీనివాస్
– మంత్రి సీతక్క దిగ్భ్రాంతి
పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. నిమజ్జనం కోసం నేరేడు చెరువులో దిగి విద్యార్థులు మృతిచెందారు. మృతులను పెద్ద కంచర్ల చెందిన శిరీష చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులుగా గుర్తించారు. మృతులు నర్సింహ రాజు, సుమంత్ (డిప్లొమా సెకండ్ ఇయర్), గణేష్ (డిప్లొమా సెకండ్ ఇయర్), ఉదయ్ కిరణ్ (డిప్లొమా థర్డ్ ఇయర్), శ్యామ్ కుమార్ (డిప్లొమా ఫస్ట్ ఇయర్), సిద్దార్థ్ (టెన్ల్ క్లాస్) చదువుతున్నారు. విద్యార్థుల మృతి పట్ల పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాచీన గ్లోబల్ హాస్పిటల్‌కు వెళ్లి విద్యార్థుల మృతదేహాలకు నివాళులర్పించారు. గురువారం ఉదయం 10 గంటల లోపు పోస్టుమార్టం పూర్తి చేయాలని, తదనంతరం వారి వారి సొంత స్థలాలకు అంబులెన్స్‌లో తరలించాలని అధికారులను ఆదేశించారు. సొంత నిధులతో అంబులెన్స్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైబరాబాద్ డీసీపీ శ్రీనివాస్ ప్రాచీన్ హాస్పిటల్‌కు చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఒకేసారి ఆరుగురు విద్యార్థులు చెందడం పట్ల ఆయన తీవ్రంగా కలతచెందారు. శిరీష ట్రస్ట్ శివనగర్ చౌరస్తా పెద్దకంజర్లలో ఉండగా 70 మంది విద్యార్థులు ఒకటవ తరగతి నుండి పాలిటెక్నిక్, బీటెక్ వరకు చదివే పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులను మాత్రమే ట్రస్టులో చేర్చుకుంటారు. ఆంధ్రకు చెందిన కృష్ణంరాజు అనే వ్యక్తి తన కుమార్తె శిరీష పేరు మీద ట్రస్ట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతిచెందడంతో పటాన్ చెరు ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.
విద్యార్థుల మృతిపై రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా చెరువులో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతిచెందడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి సీతక్క దిగ్భ్రాంతి
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పఓవన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక నిమజ్జనం సందర్భంగా చెరువులోకి దిగి ఆరుగురు చిన్నారులు మృతిచెందిన ఘటనపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పండుగ వేళ ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు మంత్రి సీతక్క సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, చేపట్టిన సహాయక చర్యలు, బాధిత కుటుంబాలకు అందుతున్న సహాయం తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శృతి ఓఝాతో మంత్రి సీతక్క మాట్లాడారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం, పిల్లల భద్రతకు సంబంధించిన చర్యలను సమన్వయంతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చిన్నారుల భద్రత విషయంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా నిమజ్జన కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో పిల్లలు ప్రమాదకరమైన నీటి వనరుల వద్దకు వెళ్లకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





