అర్హులందికీ రేషన్ కార్డులు ఇస్తాం..
˜రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం / పాలేరు, ప్రజాతంత్ర, మార్చి 7 : రాష్ట్రవ్యాప్తంగా వొచ్చే వారం నుంచి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. పేదవారి ప్రభుత్వం కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని ఈ రోజుతో 15 నెలలు అయ్యిందని గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా తయారైందని అయినా కూడా తెలంగాణ ప్రజానీకానికి ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు.
అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేని కారణంగా తులం బంగారం లేటవుతోందని, ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించిందని, వాటన్నింటినీ గాడిన పెడుతూ అభివృద్ధి, సంక్షేమం చేపడుతు న్నామని తెలిపారు. ఎక్కడ తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్త శుద్దితో పని చేస్తోందని స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి మాటను.. హామీని ఆలస్యమైనా నిలబెట్టుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు.





