భారత ఆర్థిక వ్యవస్థ…సంక్షోభ సంకేతాలు 

భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఇటీవల కనిపిస్తున్న కొన్ని ఆర్థిక సూచికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రూపాయి విలువ క్షీణించడం, ద్రవ్యోల్బణ ఒత్తిడులు పెరగడం, ప్రైవేట్ పెట్టుబడులు బలహీనపడటం, మూలధన ఖాతాలో ఒత్తిడి పెరగడం వంటి పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థ ఒక కొత్త రకమైన స్థూల ఆర్థిక అస్థిరత దశలోకి ప్రవేశిస్తున్నదనే సంకేతాలను ఇస్తున్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే కేవలం సంఖ్యల సమస్య కాదు; పెట్టుబడిదారులు, వినియోగదారులు, అంతర్జాతీయ మార్కెట్లు భారత ఆర్థిక భవిష్యత్తు పై కలిగి ఉన్న విశ్వాసంలో ఏర్పడుతున్న చీలికలను సూచిస్తున్నాయి.

మొదటగా రూపాయి విలువ క్షీణత పరిశీలిస్తే, అది కేవలం విదేశీ మారకద్రవ్య మార్కెట్లలో జరిగే సాధారణ హెచ్చుతగ్గుగా చూడలేం. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు ఖరీదవుతాయి. ముఖ్యంగా చమురు, సహజ వాయువు, ఎరువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి కీలక వస్తువుల దిగుమతులపై అదనపు భారం పడుతుంది. దాని ప్రభావం నేరుగా దేశీయ ధరలపై పడుతుంది. ఫలితంగా ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయం మరింత భారంగా మారుతుంది. వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది.

ఇక ద్రవ్యోల్బణం విషయంలో కూడా పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని చెప్పడం కష్టం. కొన్ని నెలల్లో ఆహార ధరలు తగ్గినప్పటికీ, అంతర్జాతీయ ఇంధన ధరల అస్థిరత, వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయ ఉత్పత్తిలో ఏర్పడే అనిశ్చితి, సరఫరా వ్యవస్థలోని లోపాలు ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం ఎక్కువ కాలం కొనసాగితే మధ్యతరగతి, పేద వర్గాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ప్రజల వినియోగ సామర్థ్యం తగ్గిపోవడంతో దేశీయ డిమాండ్ కూడా బలహీనపడే ప్రమాదం ఉంది.

ఈ నేపథ్యంలో అత్యంత ఆందోళనకరమైన అంశం ప్రైవేట్ పెట్టుబడుల మందగమనం. ఏ దేశ ఆర్థికాభివృద్ధికైనా ప్రభుత్వ వ్యయం మాత్రమే సరిపోదు. పరిశ్రమలు, కార్పొరేట్ రంగం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలి. ఉద్యోగాలు సృష్టించాలి. కానీ ప్రస్తుతం అనేక సంస్థలు కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి, అంతర్జాతీయ ఘర్షణలు, దేశీయ డిమాండ్‌పై సందేహాలు, వడ్డీ రేట్ల ప్రభావం వంటి కారణాలు పెట్టుబడిదారులను వెనుకడుగు వేయిస్తున్నాయి. దీని ప్రభావం ఉద్యోగ అవకాశాలపై పడుతోంది. ముఖ్యంగా యువతలో నిరుద్యోగం సమస్య మరింత తీవ్రమవుతోంది.

మూలధన ఖాతాలో కనిపిస్తున్న ఒత్తిడి కూడా చిన్న విషయం కాదు. విదేశీ పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థపై విశ్వాసానికి ప్రతీక. అయితే విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు తరచూ వెనక్కి వెళ్లడం, డాలర్ ఆధిపత్యం పెరగడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న రక్షణాత్మక ధోరణులు భారత మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు స్థిరత్వాన్ని కోరుకుంటారు. కానీ విధానపరమైన అనిశ్చితి లేదా అంతర్జాతీయ పరిస్థితుల వల్ల వారు ఇతర మార్కెట్ల వైపు మళ్లే అవకాశం ఉంటుంది.

ఈ పరిస్థితులను విడివిడిగా పరిశీలిస్తే అవి సాధారణ ఆర్థిక సవాళ్లుగా కనిపించవొచ్చు. కానీ ఇవన్నీ ఒకేసారి చోటుచేసుకోవడం మరింత ప్రమాదకరం. రూపాయి బలహీనత ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. ద్రవ్యోల్బణం వడ్డీ రేట్లపై ఒత్తిడి పెంచుతుంది. అధిక వడ్డీ రేట్లు పెట్టుబడులను నిరుత్సాహపరుస్తాయి. పెట్టుబడులు తగ్గితే ఉద్యోగాలు తగ్గుతాయి. ఉద్యోగాలు తగ్గితే వినియోగం బలహీనపడుతుంది. ఈ విధంగా ఒక ప్రతికూల చక్రం ఏర్పడే ప్రమాదం ఉంది.

అయితే పరిస్థితి పూర్తిగా నిరాశాజనకమని కూడా చెప్పలేం. భారతదేశానికి పెద్ద అంతర్గత మార్కెట్ ఉంది. యువ జనాభా ఉంది. సేవారంగం బలంగా ఉంది. డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయిలో ప్రశంసలు పొందుతున్నాయి. ఈ బలాలను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవొచ్చు.  దీనికోసం ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు తీసుకోవాలి. విధాన స్థిరత్వాన్ని పెంచాలి. ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చౌకగా రుణాలు అందించాలి. వ్యవసాయం, తయారీ రంగాల్లో ఉత్పాదకత పెంపుపై దృష్టి పెట్టాలి. అలాగే ఉపాధి కల్పనను కేంద్రంగా చేసుకుని ఆర్థిక విధానాలను రూపొందించాలి.

ఆర్థిక వ్యవస్థలో విశ్వాసం కోల్పోవడం ఏ దేశానికైనా అత్యంత ప్రమాదకర పరిస్థితి. ఎందుకంటే ఆర్థికాభివృద్ధి కేవలం మూలధనం, సాంకేతికత, వనరులపై మాత్రమే ఆధారపడదు; ప్రజలు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు భవిష్యత్తుపై కలిగి ఉన్న నమ్మకం పైన కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు అదే విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాయి. సరైన విధానాలు, దూరదృష్టి, సమర్థమైన అమలు ద్వారా ఈ సంక్షోభ సంకేతాలను అధిగమించడం సాధ్యమే. కానీ ఆలస్యం చేస్తే ఈ హెచ్చరికలు మరింత తీవ్రమైన ఆర్థిక సమస్యలకు దారి తీసే ప్రమాదాన్ని విస్మరించరాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *