– కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తా
– వెయ్యి కాదు, 3 వేల బస్సుల బాధ్యతలు మహిళలకే
– రిజర్వేషన్లతో కీలకం కానున్న మహిళల పాత్ర
– మహిళలను అన్నింటా ప్రోత్సహిస్తున్నాం
– ప్రజా ప్రభుత్వంలో సున్నా వడ్డీకే రుణాలు
– మహిళా శక్తి మహా సభలో సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9 : ఆడబిడ్డలను లక్ష్మీదేవితో కొలిచే సంస్కృతి మనది.. భూమిని భూమాతగా, దేశాన్ని భారత మాతగా, రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా భావిస్తాం.. చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం మన కీర్తిని ప్రపంచానికి చాటారు అని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఓటు హక్కును కల్పించి వారి చేతికి అధికారం ఇచ్చిన ఘనత నెహ్రూది. రాష్ట్రపతిగా, మంత్రులుగా ఆడబిడ్డలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్. గత ప్రభుత్వం మొదటి ఐదేళ్లు ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రిగా అవకాశం కల్పించలేదు.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏనాడూ వాళ్ల పార్టీకి మహిళను అధ్యక్షురాలిగా నియమించలేదు అని విమర్శించారు. ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా వారోత్సవాల సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మంత్రులుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, మునిసిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా ఆడబిడ్డలు రాణించారన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని 2013లో సోనియా గాంధీ పార్లమెంలో బిల్లు పెట్టారని, రాబోయే రోజుల్లో 33 శాతం మహిళలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో ప్రధాన పాత్ర పోషించబోతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ రుణాలను కూడా చెల్లించలేదని విమర్శిస్తూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు సున్నా వడ్డీ రుణాలను మంజూరు చేశామని సీఎం చెప్పారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, దీనిపై కొందరు కడుపునిండా విషం నింపుకుని కళ్లల్లో నిప్పులు పోసుకుంటూ ఉచిత బస్సు రద్దు చేయాలని రోడ్డెక్కారు.. అయినా వెనక్కి తగ్గకుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఉచితంగా ప్రయాణించి ఆడబిడ్డలు ఉన్నత చదువులు చదువుకుంటున్నారన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పని మహిళా సంఘాలకు అప్పగించామని, మహిళల” పెట్రోలు బంకులు నిర్వహించేలా ప్రోత్సహించామని, అదానీతో పోటీపడేలా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను నిర్వహించేలా ప్రోత్సహించామని వివరించారు. కార్పొరేట్ ఆఫీసులతో పోటీ పడేలా ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు హైటెక్ సిటీలో 106 స్టాల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు కేటాయించిన 553 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఎల్ నినో ఉందని వాతావరణ శాఖ చెప్పింది.. కానీ మనం 553 బస్సులను ప్రారంభించుకోగానే వరుణదేవుడు కరుణించాడు అన్నారు. తెలంగాణ ఆర్ధిక ప్రగతి ఆడబిడ్డల చేతిలో ఉంది.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మహిళా స్వయం సహాయక సభ్యుల సంఖ్య కోటిమందికి చేరాలంటూ ఈ వేదికగా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా.. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత నాది అని అన్నారు. 2034 వరకు మీ ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం.. వెయ్యి కాదు.. మూడు వేల బస్సులకు ఆడబిడ్డలను యజమానులను చేస్తాం అని హామీ ఇచ్చారు. వ్యవసాయంలో అన్ని రకాల పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి.. అన్ని రకాల పంటలను వేసేలా రైతులకు అవగాహన కల్పించండి .. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా అన్నారు.
మహిళా సమాఖ్యలకు చెక్కులు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి 
553 బస్సుల అద్దె చార్జీల నిమిత్తం ఆర్టీసీ నుంచి మండల మహిళా సమాఖ్యలకు రూ.20.34 కోట్ల చెక్కును సీఎం అందజేశారు. ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసి, నిర్వహించే ఈ 553 బస్సులకు మండల మహిళా సమాఖ్యలు (ఎంఎంఎస్) నిధులు సమకూర్చాయి. ఒక్కో బస్సుకు నెలకు రూ.69,468 చొప్పున ఆర్టీసీ నుంచి ఎంఎంఎస్‌లకు ఇప్పటివరకు మొత్తం రూ.20.34 కోట్లు అద్దె చార్జీలు చెక్కు రూపంలో అందజేశారు. వడ్డీ లేని రుణాలకు సంబంధించి రూ.500 కోట్ల చెక్కును అందజేశారు. రాష్ట్రంలోని మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా ఆదా చేసిన రూ.10,700 కోట్ల చెక్కును అందజేశారు. మహిళా శక్తి, మహాలక్ష్మి పథకాల్లో భాగంగా మహిళా స్వయం సహాయక సమాఖ్య(ఎస్‌హెచ్‌జీ), ఎంఎంఎస్‌లకు చెక్కులను అందజేశారు.
బాక్సు ఐటవమ్
మహిళా సభ గ్రాండ్ సక్సెస్ 
పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మహిళా శక్తి మహాసభ గ్రాండ్ సక్సెస్ అయింది. కుండపోత వర్షంలోనూ చెక్కుచెదరని సంకల్పంతో వేల సంఖ్యలో ఆడబిడ్డలు సభను సక్సెస్ చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి అశేషంగా తరలివచ్చారు. పాలపిట్ట రంగు చీరల్లో సభా ప్రాంగణం పండగ వాతావరణాన్ని తలపించింది. ఇందిరా మహిళా శక్తి చీరతోపాటు సాంప్రదాయ ఆదివాసీ వస్త్రధారణలో సభకు హాజరైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచిన ఆమెను మహిళలు అభినందించారు. మంత్రి సీతక్కతో కలిసి మహిళా సంఘాలకు అభివాదం చేసినప్పుడు చప్పట్లతో మార్మోగింది. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి సీతక్క మహిళలందరి తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పేదల పెన్నిధిగా, అక్కచెల్లెమ్మల ఆత్మీయ సోదరుడిగా మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహిళలందరి తరఫున స్వాగతం సుస్వాగతం అని మంత్రి సీతక్క అన్నారు. 553 మహిళా సంఘ బస్సుల కేటాయింపులో కీలక పాత్ర పోషించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సభకు హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా లక్ష్యసాధన సంకల్పంతో సభకు తరలివచ్చిన అక్కచెల్లెమ్మలకు మంత్రి సీతక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సంఘాలకు ఇప్పటివరకు రూ.61 వేల కోట్ల బ్యాంకు రుణాలు అందించామని, రూ.2 వేల కోట్ల వడ్డీ భారం ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్లు మహిళలకు అప్పగిస్తున్నామని చెప్పారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో 40 శాతం నిర్వహణ మహిళా సంఘాల చేతుల్లోనే ఉందని వివరించారు. మహిళలు సంతోషంగా ఉంటే ఆరఎస్ కండ్లల్లో నిప్పులు పోసుకొని విమర్శలు చేస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా లక్షలాదిమంది మహిళలకు అక్షరాస్యత కల్పిస్తున్నామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి యూనిఫాం కనిపించగానే ప్రతి ఒక్కరూ గౌరవంతో లేచి నిలబడే స్థాయికి తెలంగాణ మహిళలు ఎదగాలి అని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు నవీన్ యాదవ్, శ్రీ గణేష్, మల్‌రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కలువ సుజాత గుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు దాన కిషోర్, వికాస్ రాజ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.హరీష్ ముకుంద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, మహిళా సమాఖ్యల ప్రతినిధులు, అధికారులు, వేలాదిమంది మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మహిళల సంక్షేమం, భద్రతే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత
భారీ వర్షంలోనూ క్రమశిక్షణతో సభకు హాజరైన అక్కాచెల్లెమ్మలను మంత్రి సీతక్క అభినందించారు. మహిళా శక్తి మహాసభ విజయవంతం కావడం తెలంగాణ మహిళా శక్తికి నిదర్శనమన్నారు. మహిళలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునే వరకు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి మహిళ తన ఇంటికి సురక్షితంగా చేరే వరకు నిరంతర సమన్వయం కొనసాగించాలని ఆదేశించారు. మంత్రి సీతక్క ఆదేశాలతో జిల్లా డీఆర్‌డీవో అధికారులతో స్పెషల్ సీఎస్ దానకిషోర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళల రవాణా, భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాల వారీగా మహిళల తిరుగు ప్రయాణ ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. కాగా, పాలపిట్ట రంగు చీరల్లో సభా ప్రాంగణం పండగ వాతావరణాన్ని తలపించింది. ఇందిరా మహిళా శక్తి చీరతోపాటు సాంప్రదాయ ఆదివాసీ వస్త్రధారణలో సభకు హాజరైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచిన ఆమెను మహిళలు అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





