తెలంగాణ సమాజంలో గడచిన కొన్ని నెలలుగా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు వివాదానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన తాజా వివరణ ఒక స్పష్టమైన ముగింపునిచ్చింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీల బృందం (ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, డి.కె. అరుణ తదితరులు) దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌ను కలిసి, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున, కన్నెపల్లి పంప్‌హౌస్ నుండి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని, అలాగే కాళేశ్వరం బ్యారేజీల (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల) మరమ్మత్తులను వేగవంతం చేయాలని కోరారు. ఇందుకు సమాధానంగా ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ఎన్‌డీఎస్ ఏ వర్గాలు స్పష్టం చేస్తూ—బ్యారేజీల భద్రత, వాటి పునరుద్ధరణ డిజైన్లు, మరమ్మత్తులపై శాస్త్రీయ సలహాలు ఇవ్వడం మాత్రమే ఎన్డీఎస్ఏ బాధ్యత అని పేర్కొన్నాయి. ఏ సమయంలో నీటిని నిల్వ చేయాలి, పంపింగ్ చేయాలి లేదా విడుదల చేయాలనే విధానపరమైన నిర్ణయం పూర్తిగా ప్రాజెక్ట్ యజమాని అయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేయడంతో ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్‌డీఎస్ ఏను సాకుగా చూపుతూ, నీటిని ఎత్తకపోవడంలో ఆంతర్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ఒక ప్రవాస భారతీయుడు దాఖలు చేసిన అభ్యర్థనకు ఎన్‌డీఎస్ఎ తన అధికారిక సమాధానంలో స్పష్టత నిచ్చింది. తాము కేవలం బ్యారేజీల భద్రతను దృష్టిలో ఉంచుకుని గేట్లు తెరవాలని సూచించాం తప్ప, నదిలో వొచ్చే సహజ ప్రవాహాన్ని బ్యారేజీ వద్ద నిల్వ చేయకుండా నేరుగా కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా ఎత్తిపోసుకునే వ్యూహాలు లేదా ప్రత్యామ్నాయాలపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని ఎన్‌డీఎస్ఏ తన లేఖలో స్పష్టం చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో —మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లను తెరిచి ఉంచాలని, మరమ్మత్తులు పూర్తయ్యే వరకు నీటిని నిల్వ చేయవొద్దని ఎన్‌డీఎస్ఏ ఆదేశించిందని, అందుకే తాము పంపింగ్ చేయలేకపోతున్నామని చెబుతున్న మాటల్లో విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోంది.
ఈ నేపథ్యంలో నిబంధనలను సాకుగా చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, ఎంపీ రఘునందన్ రావు విమర్శించడమే కాదు, గత రెండు, మూడేళ్లుగా ఇచ్చిన నివేదికలపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసిందని, తద్వారా రైతులకు నీరు అందకుండా చేస్తోందని ఆరోపించారు. మరి ఇదే సంగతిని బీఆర్ ఎస్ నేతలు కేటీఆర్, హరీష్‌రావులు మొదట్నుంచీ మొత్తుకుంటూనే ఉన్నా , రేవంత్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులు కాళేశ్వరం కూలేశ్వరం అయిందంటూ ఎదురుదాడికి దిగారే తప్ప, తక్షణం మరమ్మతులు చేపట్టడానికి నిర్ణయం తీసుకోలేదు. దీని ఫలితంగా ఇప్పుడు తెలంగాణ సాగునీరు, తాగునీటి ఎద్దడితో సతమతమవుతున్నది .
దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌తో రాష్ట్ర బీజేపీ ఎంపీల బృందం జరిపిన భేటీ, ఆ తర్వాత ఎన్డీఎస్‌ఏ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలు ప్రాజెక్టు నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతను పటాపంచలు చేశాయి. ఇన్నాళ్లూ కేవలం సాంకేతిక నివేదికల వెనుక దాక్కుంటూ, నీటిని ఎత్తిపోయకుండా కాలయాపన చేస్తున్న పాలకుల రాజకీయ వ్యూహాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. ఎన్డీఎస్‌ఏ పరిధి కేవలం బ్యారేజీల రక్షణ, మరమ్మత్తుల సలహాలకే పరిమితమని, కరువు కాలంలో రైతులకు నీళ్లు ఇవ్వాలా వొద్దా అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమేనని కేంద్రం తేల్చిచెప్పడం గమనార్హం.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యాలు బయటపడినప్పటి నుండి, తెలంగాణ రాజకీయాలు ఈ నిర్మాణాలు చుట్టూనే తిరుగుతున్నాయి.
మునుపటి ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపుతూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కనబెట్టిందనే విమర్శలు తీవ్రమయ్యాయి. ఎన్డీఎస్‌ఏ బ్యారేజీలలో నీటి నిల్వను నిలిపివేయాలని చెప్పిందన్న సాకుతో, కన్నెపల్లి పంప్‌హౌస్ నుండి నీటిని ఎత్తిపోసే ప్రక్రియను సైతం నిలిపివేశారు. కానీ, నదిలో ప్రవహించే నీటిని బ్యారేజీలలో నిల్వ చేయకుండా, నేరుగా పంప్‌హౌస్ ద్వారా కాలువల్లోకి తరలించే ప్రత్యామ్నాయ వ్యూహాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదన్నది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. సాంకేతిక నియమాలను సాకుగా చూపిస్తూ ప్రాజెక్టును పడావు పెట్టడం వెనుక జలద్రోహం దాగి ఉందన్న విపక్షాల ఆరోపణలకు ఎన్‌డీఎస్‌ఏ వివరణ మరింత బలాన్ని చేకూర్చింది.





