హైడ్రాకు హైకోర్టు మొట్టికాయ‌లు!!

హైదరాబాద్ నగరాన్ని విపత్తుల నుండి రక్షించడానికి, ప్రభుత్వ ఆస్తులు, చెరువులను కాపాడటానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా ఇటీవల తీసుకుంటున్న కొన్ని శరవేగపు చర్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజా ప్రయోజనాల పేరిట ప్రభుత్వ విభాగాలు తీసుకునే నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమవుతున్నాయి.. అవి చట్ట పరిధులను, న్యాయవ్యవస్థ ఆదేశాలను ఉల్లంఘించినప్పుడు ప్రజాస్వామ్య సమతుల్యత దెబ్బతింటుంది. సికింద్రాబాద్ లోతుకుంటలోని ఒక ప్రైవేటు భూ వివాదంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పదే పదే ధిక్కరించడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రభుత్వ విభాగాలపై నమ్మకం కోల్పోయామని వ్యాఖ్యానిస్తూ, సదరు ప్రైవేట్ ఆస్తి రక్షణకు భారత సైన్యాన్ని రంగంలోకి దించాలని కోర్టు ఆదేశించడం అత్యంత అరుదైన, తీవ్రమైన పరిణామం. వ్యవస్థల వైఫల్యానికి ఇది ఒక హెచ్చరిక. హైడ్రా కమిషనర్ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేటు ఆస్తుల్లో జోక్యం చేసుకుంటున్నారని, కోర్టు ఉత్తర్వులను గౌరవించడం లేదని ధిక్కరణ పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయస్థానం మందలించింది.
కేవలం ఇదొక్కటే కాదు, శంషాబాద్ పరిధిలోని బహదూర్ గూడా లో  తగిన ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీస విచారణ జరపకుండా రైతుల పట్టా భూముల్లోకి జేసీబీలతో చొరబడి కంచెలు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టే విధించింది. ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థకు విశేషాధికారాలు ఉన్నప్పుడు, బాధ్యత కూడా అంతే స్థాయిలో ఉండాలి. చట్టబద్ధమైన నోటీసులు ఇవ్వకుండా, సరైన విచారణ జరపకుండా పౌరుల ప్రాథమిక హక్కులను, ముఖ్యంగా ఆర్టికల్ 300ఎ ప్రకారం లభించే ఆస్తి హక్కును కాలరాయడం రాజ్యాంగ విరుద్ధం. ఈ వివాదం కేవలం ఒక ప్రైవేట్ భూమికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది ప్రభుత్వ యంత్రాంగం అనుసరిస్తున్న తీరుపై మౌలికమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. శంషాబాద్ పరిధిలోని బహదూర్ గూడ గ్రామంలో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ భూసేకరణ పేరిట, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రైతుల పట్టా భూముల్లోకి జేసీబీలతో చొరబడి కంచెలు వేయడం, పంటలను నాశనం చేయడం వంటి ఘటనలపై కూడా హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ ‘యథాతథ స్థితి’ ని ప్రకటించింది. 1990ల నుండి రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ కలిగి ఉండి, నిరంతరం సాగు చేసుకుంటున్న దశాబ్దాల నాటి రైతులను రాత్రికి రాత్రే బలవంతంగా ఖాలీ  చేయించడం ప్రజాస్వామ్య పద్ధతి అనిపించుకోదు.
“ముందు కూల్చేయడం.. ఆ తర్వాత సమర్థించుకోవడం” అనే ధోరణిని ఉన్నతాధికారులు అలవాటుగా మార్చుకోవడం చట్టబద్ధ పాలనకు గొడ్డలిపెట్టు వంటిది. హైడ్రా కమిషనర్‌ను కోర్టు పదే పదే హెచ్చరించినా, న్యాయస్థాన ఉత్తర్వులను పక్కనబెట్టి ప్రైవేట్ స్థలాల్లో జోక్యం చేసుకోవడం వల్లనే న్యాయమూర్తి జస్టిస్ అనిల్ కుమార్ జుకంటి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న అడ్వకేట్ జనరల్ ఇచ్చిన హామీలను సైతం బేఖాతరు చేస్తూ అధికారులు వ్యవహరిస్తే, కోర్టులు కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరిట సామాన్య పౌరుల, రైతుల హక్కులను కాలరాయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులు తాము న్యాయవ్యవస్థ కంటే సుప్రీం అనే అహంకారాన్ని వీడాలి. కేవలం ప్రశంసల కోసమో, తక్షణ ఫలితాల కోసమో కాకుండా, సుదీర్ఘ కాలం నిలబడేలా చట్టబద్ధమైన పారదర్శక విధానాలను అవలంబించినప్పుడే హైడ్రా వంటి సంస్థల ఉనికికి, ఆశయానికి నిజమైన గౌరవం లభిస్తుంది.
హైకోర్టు స్పష్టంగా పేర్కొన్నట్లు, హైడ్రా పరిధి కేవలం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు,  పార్కుల పరిరక్షణకు మాత్రమే పరిమితం కావాలి. సివిల్ కోర్టుల పరిధిలో ఉన్న ప్రైవేట్ భూ వివాదాల్లో చొరబడే హక్కు లేదా ఒకపక్షంగా వ్యవహరించే అధికారం దానికి లేదు.హైడ్రా తన కూల్చివేతలు లేదా స్వాధీన చర్యలు చేపట్టే ముందు నిర్దిష్టమైన ప్రమాణాలను పాటించాలని కోర్టు ఇదివరకే స్పష్టం చేసింది.అత్యున్నత అధికారులు తామే చట్టమన్నట్లు వ్యవహరిస్తే, సమాజంలో ‘రూల్ ఆఫ్ లా’ కు అర్థం లేకుండా పోతుంది. ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక వ్యవస్థ మరియు న్యాయవ్యవస్థ పరస్పర గౌరవంతో పనిచేయాలి. ఆక్రమణలను తొలగించడం, నగరాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, దానికి ఎంచుకునే మార్గం కూడా అంతే చట్టబద్ధంగా ఉండాలి. ‘లక్ష్యం మంచిదైతే మార్గం ఏదైనా పర్లేదు’ అనే ధోరణి ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మరియు హైడ్రా ఉన్నతాధికారులు హైకోర్టు తాజా మొట్టికాయల నుండి పాఠాలు నేర్చుకోవాలి. తదుపరి చర్యలలో తొందరపాటు ప్రదర్శించకుండా, న్యాయస్థానాల ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ, పారదర్శకమైన విధానాలతో ముందుకు సాగినప్పుడే పాలనపై ప్రజల్లోనూ, వ్యవస్థల్లోనూ నమ్మకం నిలుస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి తీవ్రమైన న్యాయపరమైన చీవాట్లు ఎదురుకాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *