గ్రామీణ భారతంలో సంక్షోభం ..!

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థికాభివృద్ధికి వెన్నెముక. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, గ్రామీణ ఉపాధి, చిన్న వ్యాపారాలు—ఇవన్నీ కలిసి గ్రామీణ జీవనాన్ని నడిపిస్తాయి. అలాంటి గ్రామీణ కుటుంబాల ఆదాయ వృద్ధి మందగించడం, అనధికారిక అప్పులపై ఆధారపడటం పెరగడం ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాదు, సామాజిక స్థిరత్వానికీ ఆందోళనకర సంకేతం. నాబార్డ్ తాజాగా విడుదల చేసిన “రూరల్ ఎకనామిక్ కండిషన్స్ అండ్ సెంటిమెంట్స్ సర్వే” ఈ విషయంలో తీవ్రమైన హెచ్చరికను జారీ చేసింది. ఏడాది క్రితం తో పోలిస్తే కేవలం 27.7 శాతం గ్రామీణ కుటుంబాలే తమ ఆదాయం పెరిగిందని చెప్పడం, ఈ సర్వే ప్రారంభమైనప్పటి నుంచి అత్యల్ప స్థాయి. అదే సమయంలో 52.6 శాతం కుటుంబాల ఆదాయం ఎలాంటి పెరుగుదల లేకుండా నిలిచిపోవడం, దాదాపు 20 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోవడం గ్రామీణ భారతదేశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ప్రతిబింబిస్తోంది.

ఈ పరిస్థితి తెలంగాణ కు కూడా మినహాయింపు కాదు. రాష్ట్రం పారిశ్రామిక, ఐటీ రంగాల్లో వేగంగా ఎదుగుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు, చిన్న వ్యాపారులు ఇప్పటికీ ప్రకృతి, మార్కెట్‌, ధరలు, అప్పులు అనే నాలుగు చక్రాల మధ్యనే జీవిస్తున్నారు. ఇటీవల వర్షపాతం అస్థిరత, పంటల వ్యయభారం పెరగడం, ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరల పెరుగుదల రైతుల ఆదాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పంట దిగుబడి వొచ్చినా గిట్టుబాటు ధర లభించకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తోంది. ఇవి రైతులకు కొంత భరోసా కల్పిస్తున్నా, రైతు కుటుంబాల స్థిరమైన ఆదాయ వృద్ధికి మాత్రం సరిపోవడం లేదు. పెట్టుబడి సాయం ఒక్కటే పరిష్కారం కాదు. రైతు పండించిన పంటకు లాభదాయకమైన ధర, సమయానికి మార్కెటింగ్ సదుపాయాలు, నిల్వ గోదాములు, విలువ ఆధారిత ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఎగుమతి అవకాశాలు కల్పించినప్పుడే గ్రామీణ ఆదాయం నిజంగా పెరుగుతుంది.

నాబార్డ్ సర్వేలో మరో ముఖ్యమైన అంశం అనధికారిక అప్పులపై ఆధారపడటం పెరగడం. గ్రామీణ కుటుంబాలు బ్యాంకుల కంటే వడ్డీ వ్యాపారులు, మధ్యవర్తులు, బంధువుల నుంచి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే అది ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికే. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల నెట్‌వర్క్ బలంగా ఉన్నప్పటికీ, అత్యవసర అవసరాల సమయంలో చాలామంది ఇప్పటికీ అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. ఇది భవిష్యత్తులో అప్పుల ఊబి ని మరింత పెంచే ప్రమాదం ఉంది. గ్రామీణ ఆదాయం తగ్గితే దాని ప్రభావం కేవలం రైతు కుటుంబాలకే పరిమితం కాదు. గ్రామాల్లో వినియోగం తగ్గుతుంది. చిన్న దుకాణాలు, సేవారంగం, రవాణా, స్థానిక పరిశ్రమలు అన్నీ దెబ్బతింటాయి. యువత ఉపాధి కోసం నగరాలకు వలస వెళ్తుంది. వ్యవసాయ రంగంపై ఆసక్తి తగ్గుతుంది. చివరికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం మందగిస్తుంది. తెలంగాణలో ఇప్పటికే అనేక గ్రామాల నుంచి యువత హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి నగరాలకు లేదా ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు అవసరమైనది గ్రామీణ ఆదాయాన్ని పెంచే సమగ్ర వ్యూహం. సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ఉద్యానవనం, పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, ఆహార ప్రాసెసింగ్ వంటి అనుబంధ రంగాలను మరింత బలోపేతం చేయాలి. గ్రామీణ మహిళల స్వయం సహాయక సంఘాలను సూక్ష్మ పరిశ్రమలతో అనుసంధానం చేయాలి. ప్రతి మండలంలో విలువ ఆధారిత వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతుకు అదనపు ఆదాయం లభిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓలు), నేరుగా వినియోగదారులకు విక్రయించే వ్యవస్థలను విస్తరించాల్సిన అవసరం ఉంది.

అలాగే గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి వ్యవసాయేతర ఉపాధి అవకాశాలను పెంచాలి. గ్రామీణ పారిశ్రామికీకరణ, చిన్నతరహా తయారీ యూనిట్లు, హస్తకళలు, గ్రామీణ పర్యాటకం వంటి రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తే గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి వైవిధ్యీకరణ లేకుండా కేవలం వ్యవసాయంపై ఆధారపడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో మరింత ఒత్తిడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. నాబార్డ్ సర్వే ఒక గణాంక నివేదిక మాత్రమే కాదు; గ్రామీణ భారతదేశం నుంచి వినిపిస్తున్న హెచ్చరిక స్వరం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో పాటు, గ్రామీణ ఆదాయాన్ని పెంచే దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాలపై మరింత దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. గ్రామీణ కుటుంబాల కొనుగోలు శక్తి పెరిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రైతు, కూలీ, గ్రామీణ యువకుడు, మహిళ ఆర్థికంగా బలోపేతం అయితేనే తెలంగాణ అభివృద్ధి సమగ్రంగా, స్థిరంగా ముందుకు సాగుతుంది. గ్రామం బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది; ఇదే ఈ సర్వే మనకు చెబుతున్న అత్యంత ముఖ్యమైన సందేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *