ట్రూ-అప్ పేర ప్రజల నెత్తిన పిడుగు

– రూ.5420 కోట్లు ప్రజలపై భారం
– ఇప్పటికే ఎల్నినో, ధరలపెరుగుదలపై ప్రజల ఇబ్బందులు
– విద్యుత్ కొనుగోళ్లకు, ప్రజలకు ఏంటి సంబంధం?
–  ప్రభుత్వ కొనుగోళ్లకు వినియోగదార్లపై భారమా?
–  ప్రజా ఉద్యమం చేస్తాం
– ప్రభుత్వంపై విరుచుకుపడ్డ హరీష్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: దసరా, దీపావళి పండుగల వేళ ప్రజలకు శుభవార్త చెప్పాల్సిన ప్రభుత్వం, విద్యుత్ బిల్లులు పెంచి నెత్తిన పిడుగు వేసింది.ట్రూ-అప్‌ పేరుతో ప్రజల నడ్డి విరిచేందుకు సిద్దమైందని మాజీ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.5,420 కోట్లు ప్రజల ముక్కు పిండి వసూలు చేయాలనే ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నరు. ఒక దిక్కు ఎల్ నినో, మరోవైపు ధరల పెరుగుదల ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు.ప్రజల తరుపున నేను రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా రూ.5,420 కోట్ల విద్యుత్ బిల్లులను వినియోగదారులపై మోపే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? విద్యుత్ కొనుగోళ్లకు వెచ్చించిన సొమ్మును వినియోగదారుల నుంచే వసూలు చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం? బాధ్యత నుంచి తప్పించుకున్న ప్రభుత్వం ప్రజలపై భారం వేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే కరెంట్ కోతలతో అల్లాడుతున్న ప్రజలకు..ఇప్పుడు కరెంట్ బిల్లులు పెంచి వాతలు పెడతారా అని ప్రశ్నించారు. ప్రజలపై భారం మోపే కాంగ్రెస్ సర్కారు తుగ్లక్ నిర్ణయాన్ని బిఆర్ఎస్ పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజలపై 5వేల కోట్ల భారం మోపాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక తుగ్లక్ పాలన నడుస్తున్నది. స్వయంగా ముఖ్యమంత్రి పాలన చేతగాక చేతులెత్తేసిన పరిస్థితి. పరిపాలనపై ధ్యాస లేదు అనడానికి సంక్షోభంలో కూరుకుపోతున్న విద్యుత్ రంగమే నిదర్శనం. తప్పు చేసింది కాంగ్రెస్.. విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టింది కాంగ్రెస్.. కానీ భారం మాత్రం ప్రజలపై వేస్తున్నరు. కరెంట్ సరఫరా చేయలేని చేతగాని సర్కారు.. బిల్లులు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నది. నిర్వహణ లోపాలు, నిర్లక్ష్యంతో విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టి.. ఇప్పుడు ఆ భారాన్ని ప్రజలపైకి నెడుతారా? ఇదేం పాలన రేవంత్ రెడ్డి? మీరు చేసిన తప్పుకు వినియోగదారులు బలి కావాలా? 5వేల కోట్లు అంటే మాటలా? రెండు నెలల్లో వినియోగదారుల నుంచి వసూలు చేయడం దుర్మార్గమన్నారు. పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలు ఎన్నడూ తీసుకోలేదు.2016-17 నుంచి 2021-22 వరకు ట్రూ-అప్‌ చార్జీలు రూ.12,718.40 కోట్లు వేయాలని ఇఆర్స్సీ చెప్పినా ఈ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు కేసీఆర్ గారు అనుమతించలేదు. విద్యుత్ సంస్థల భారాన్ని ప్రజలపై వేయొద్దు అని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి కరువు పరిస్థితుల్లో ప్రజలపై 5200 కోట్ల భారం వేస్తున్నడు.ఇది ప్రజాపాలన కాదు, ప్రజా పీడన. ఉమ్మడి పాలనలో కరెంట్ కోతలతో రైతులు పడ్డ నరకయాతనను కండ్ల నిండా చూసిన కేసీఆర్ గారు, అధికారంలోకి రాగానే విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేసారని గుర్తుచేశారు.
విద్యుత్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి 91,000 కోట్లతో జెన్‌కో, ట్రాన్స్‌కో అభివృద్ది సహా మౌలిక వసతులను బలోపేతం చేశారన్నారు. మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,450 మెగావాట్లకు పెంచారన్నారు. అనతి కాలంలోనే రాష్ట్రాన్ని ’పవర్‘ ఫుల్ తెలంగాణగా నిలబెట్టిండు.అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసే స్థాయికి విద్యుత్ వ్యవస్థను అభివృద్ది చేసిండు. కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్లాంట్లను 42 నెలల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించాం.
భద్రాద్రి 1080 మెగావాట్లతో నిర్మించాం. 4000 మెగావాట్లతో ఆల్ట్రా థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. భూపాలపల్లిలో 600 మెగావాట్లను ఉత్పత్తి అందుబాటులోకి తెచ్చినం.ఒక్క థర్మల్ లోనే 6480 మెగవాట్లు యాడ్ చేసినం. సోలార్ పవర్ 3600 మెగావాట్లు యాడ్ చేసినం.విద్యుత్ వ్యవస్థను ఎంతో బలోపేతం చేసినం. సింగరేణి మరో 800 మెగావాట్ల విషయంలో రాజస్థాన్ తో జేవీ చేసుకున్నరు.అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేసిన కొత్త పని ఒక్కటీ లేదు.కొత్తగా ఒక్క సబ్ స్టేషన్ కట్టింది లేదు..
కొత్తగా ఒక్క మెగావాటు ఉత్పత్తి సామర్థ్యం పెంచింది లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏమైంది.
కరెంట్ కే కరోనా పట్టినట్లు అయ్యింది.కరోనా కంటే, ఎల్ ని నో కంటే కాంగ్రెస్ డేంజర్ అని మేము నోటి మాటగా చెప్పడం లేదు
అవకాశం ఉండి నీళ్లు ఇవ్వడం లేదు, అవకాశం ఉండి కరెంట్ ఉత్పత్తి చేయడం లేదు.కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫుల్ గా ఉన్న కరెంట్ ఇప్పుడు ఎందుకు నిల్ అయ్యింది. కేసీఆర్ ఉన్నపుడు 24 గంటల కరెంట్ వస్తే, ఇప్పుడు ఎందుకు 6 గంటలు కూడా కరెంట్ రాని పరిస్థితి వచ్చింది. అన్నింటికి ఒకే మంత్రం అన్నట్లు.. మీ పాలన వైఫల్యాన్ని, చేతగాని తనానికి ఎల్ ని నో పేరు చెప్పి, కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటారా? ఎల్ నినోకు బొగ్గు ఉత్పత్తికి కారణం ఏమిటి? దేవాదులలో 24 గంటల మోటార్లు నడపండి అంటే 8 గంటలే నడుపుతున్నరు. దీని వల్ల వరంగల్ జిల్లాకు కరవు వచ్చింది.ఎల్ ని నో కరువు కాదు, కాంగ్రెస్ కరువు. కల్వకుర్తి ప్రాజెక్టును కేసీఆర్ గారు పూర్తి చేస్తే, నీళ్లు ఎత్తు అంటే 8 గంటలే కల్వకుర్తి మోటార్లు నడుపుతున్నరు. నీళ్లు ఇచ్చే ఉద్దేశ్యం లేదు. కన్నెపల్లి దగ్గర కట్క ఒత్తితే నీళ్లు వస్తయి ఎత్తుమంటే, ఎన్డీఎస్ఏ కారణం చెప్పారు. కానీ ఆ ఎన్డీఎస్ఏనే చెంప ఛళ్లుమనేలా సమాధానం చెప్పింది. భద్రాద్రి, యాదాద్రి, సింగరేణి థర్మల్, కేటీపీఎస్ విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తే, వాటిని నడిపే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదు.భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో మూడో యూనిట్ ఉత్పత్తి ఎందుకు నిలిచిపోయింది.యాదాద్రి పవర్ ప్లాంట్ సామర్థ్యం 4వేల మెగావాట్లు అయితే 400 కూడా ఉత్పత్తి చేయడం లేదు. సింగరేణి బొగ్గు సంస్థ ఉండి కూడా సింగరేణి థర్మల్ ప్లాంట్ కు బొగ్గు సరఫరా చేయలేని పరిస్థితి. నదుల్లో నీళ్లు ఉన్నా రిజర్వాయర్లు నింపలేదు, నీళ్లు లిఫ్ట్ చేయలేదు. బొగ్గు ఉన్నా సరఫరా చేయరు, కరెంట్ ఉత్పత్తి చేయరు.రూ. 1600 కోట్లు విలువ చేసే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు మాయం అయ్యాయని, అదో పెద్ద కుంభకోణం అని మేం ముందు నుంచి హెచ్చరించాం.లేని నిల్వలు ఉన్నట్లు చూపి టాక్స్, కోల్ సెస్, సీఎస్ఆర్ చెల్లింపులు చేసి మోసం చేసారని సింగరేణి వ్యాప్తంగా తిరిగి పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చినం. ఇప్పుడు ఏం అయ్యింది. బొగ్గు నిల్వలు లేవు అన్న విషయం తేటతెల్లం అయ్యింది. అప్పుడు బొగ్గు కుప్పల మీద సేల్ బొగ్గు వేసి కవర్ చేసే ప్రయత్నం చేసారు. మరి ఇప్పుడు ఎల్ ని నో వల్లే కరెంట్ ఉండటం లేదని కారణం చెబుతున్నారు.
పాలన తక్కువ, ప్రతిపక్షాల మీద బురద జల్లడం ఎక్కువ.రైతులకు అనేక ఇబ్బందులు ఉన్నా పట్టించుకోవడం లేదు.
మీ నిర్లక్ష్యం, మీరు చేసిన పాప ఫలితం ఈరోజు రాష్ట్రంలో కరెంట్ సంక్షోభం. ఉచిత కరెంట్ పేటెంట్ కాదు, పేషెంట్ అయ్యింది. చేతికి వచ్చే పంటను కాపాడుకుందాం అంటే కరెంట్ లేదు, నీళ్లు లేవు. కడుపు మండిన రైతులు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నరు. గ్రామీణ ప్రాంత రైతులు కరెంట్ కోసం పోరాటాలు చేస్తున్నరు. నీ కొండారెడ్డి పల్లిలోనే రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే నీకు కనిపించడం లేదా రేవంత్ రెడ్డి. కరెంట్ కోతలు, లో ఓల్టేజ్ సమస్యతో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. క్రాప్ హాలిడే, పవర్ హాలిడేలను ఉమ్మడి పాలనలో చూసినం. మీ పాలనలో మల్లా క్రాప్ హాలిడే, పవర్ హాలిడేలు తెస్తున్నవు.ఆనాటి రోజులు తెస్తాం అన్న రేవంత్ రెడ్డి, నిజంగానే ఆనాటి కరెంట్ కోతల రోజులు తెచ్చిండు.నాడు కోతలు పెడితే, కరెంట్ ధరలు పెంచితే నాడు తెలుగు దేశంకు ప్రజలు షాక్ ఇచ్చారు. నేడు నువ్వు ధరల నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే షాక్ తప్పదు అని హెచ్చరిస్తున్నాం. కేసీఆర్  ప్రతి రోజు 140 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తే, అందులో 100–110 యూనిట్లు కూడా ఉత్పత్తి చేయడం లేదు? బొగ్గు లేక, నీళ్లు లేక సరైన నిర్వహణ లేక యాదాద్రి జనరేషన్ కెపాసిటీ 96 మిలియన్ యూనిట్లు అయితే, 39 మిలియన్ యూనిట్లు కూడా దాటడం లేదు? ఉన్న కెపాసిటీని వినియోగించే తెలివి లేదు, బయట నుంచి రూ.10, 12లకు యూనిట్ కొని ప్రజలపై భారం వేస్తారా? అడ్డగోలుగా విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలపై భారం మోపుతారా? రాష్ట్రంలో మొత్తం థర్మల్ విద్యుత్ ఇన్టాల్డ్ కెపాసిటీ 13,384 మెగావాట్లు అయితే, 8000 మెగావాట్లు కూడా ఉత్పత్తి చేయడం లేదు? ఇది నిర్వహణ లోపం కాకుంటే ఏమిటి రేవంత్ రెడ్డి? నైనీలో మంచి బొగ్గు అందుబాటులో ఉన్నా.. అది కాదని విదేశాల నుంచి అధిక ధరకు బొగ్గు దిగుమతి చేసుకుంటరట లేని బొగ్గు 40లక్షల టన్నులు ఉన్నట్లు చెప్పారు. అది కుంభకోణం అని బయటపెట్టి కిషన్ రెడ్డికి లేఖ రాస్తే చర్యలు తీసుకోలేదు. ఇది చాలదన్నట్లు ట్రాన్స్ కోను ప్రైవేటుపరం చేసే నిర్ణయం తీసుకున్నరు.వేల కోట్ల ఆస్తులున్న రాష్ట్ర విద్యుత్తు ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ను అమ్మేందుకు సిద్ధమైంది. 26శాతం వాటాల విక్రయానికి నిర్ణయించుకున్నరు.టీజీ-ట్రాన్స్‌కో, టీజీ-జెన్‌కో, సింగరేణి, డిస్కంల ప్రైవేటీకరణకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నది. రాహుల్ గాంధీనేమో పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయొద్దు అని అంటడు, సిడబ్లుసీ లో తీర్మానాలు చేస్తరు.కానీ ఇక్కడేమో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తరట.కేసీఆర్ థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటు వాళ్లు పెడతం అంటే ఒప్పుకోలేదు. యాదాద్రి, భద్రాద్రి, సింగరేణి ప్లాంట్లు పెట్టి ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేసారు. ఇప్పటికే యాదాద్రిలో యాష్, కోల్ ప్లాంట్ల ప్రైవేటీకరణ పూర్తి చేసారు. విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాలపై పోరాటం చేయాలని కోరుతున్నాం., వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీకి చిత్తశుద్ది ఉంటే, కాంగ్రెస్ విధానాలపై మీది ఒకటే మాట అయితే ఇక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరుతున్నాం. ఇవన్నీ చాలదన్నట్లు ఇప్పుడు ట్రూ అప్ చార్జీల పేరిట ఏకంగా 5,420 కోట్లు ప్రజల పై వేస్తారా? బొగ్గు నిల్వలు చేసుకోవడంలో కాంగ్రెస్ ఫెయిల్.రిజర్వాయర్లు నింపి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్. హైడల్ విద్యుత్ ఉత్పత్తి చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్. మరి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలి? ఎవరు ఆదేశిస్తే ఈ నిర్ణయాలు అమలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి?సరిగ్గా 16 ఏండ్ల క్రితం చంద్రబాబు అడ్డగోలుగా విద్యుత్ చార్జీలు పెంచినందుకు, బషీర్ బాగ్ కాల్పుల దాకా వెళ్లింది. ఈరోజు విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపి ఏం చేయదల్చుకున్నావు. ఆనాడు విద్యుత్ బిల్లులపై పోరాటం చేసిన కమ్యూనిస్టులు, నేడు రేవంత్ రెడ్డి చేసే పాపంలో పాల్పంచుకోకండి.ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ చేసే పోరాటంలో పాల్పంచుకోవాలని, కలిసి రావాలాని కోరుతున్నాం. ట్రూ-అప్‌ పేరుతో ప్రజలపై మోపే విద్యుత్ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని, రూ.5,420 కోట్ల ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే మరో ప్రజా పోరాటానికి బిఆర్ఎస్ సిద్దమవుతుందని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *