రాజ్యాంగ వ్యవస్థలపై ‘ఇండి’ కూటమి ముప్పేట దాడి

– బోగస్ ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్, ఆప్ ద్వంద్వ నీతి బట్టబయలు
– గతంలో వారి డిమాండ్ మేరకే ఓటర్ల జాబితా ప్రక్షాళన
– తెలంగాణ రైతుల సమస్యలు వదిలేసి దిల్లీలో ధర్నాల డ్రామాలు-
– డాక్టర్‌ లక్ష్మణ్ ధ్వజం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 12 : ఎన్నికల్లో ప్రజా మద్దతు పొందలేక రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థలపై నిరాధార ఆరోపణలు చేస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేసే కుట్రలకు కాంగ్రెస్ పార్టీ, ‘ఇండి’ కూటమి తెరలేపింద‌ని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. గతంలో మధ్యప్రదేశ్, గుజరాత్, దిల్లీ, కేరళ తదితర రాష్ట్రాల్లో లక్షలాది బోగస్ వోట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని కాంగ్రెస్, ఆప్ నేతలే ఈసీకి వినతిపత్రాలు ఇచ్చారని లక్ష్మణ్ గుర్తుచేశారు. ఆనాడు దొంగ వోట్లను ఏరివేయాలని డిమాండ్ చేసి ఇప్పుడు చట్టబద్ధంగా సమగ్ర సవరణ ప్రక్రియ చేపడితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ వీధుల్లోకి రావడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమన్నారు. చనిపోయిన వారి వోట్లను, డబుల్ ఎంట్రీ ఉన్న వోట్లను తొలగిస్తుంటే అడ్డుపడటం వెనుక దొంగ వోట్లతో గెలవాలనే కాంగ్రెస్ దురుద్దేశం ఉందని విమర్శించారు.

న్యాయ వ్యవస్థను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు

వోటర్ల సవరణ ప్రక్రియను సుప్రీంకోర్టు స్వయంగా సమర్థించినప్పటికీ దాదాపు 42 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు కాంగ్రెస్ నిరాధార ఆరోపణలను తప్పుపట్టినప్పటికీ వారి తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ముందే ధర్నాలు చేస్తామని ప్రకటించడం న్యాయ వ్యవస్థను బ్లాక్‌మెయిల్ చేయడమేనని దుయ్యబట్టారు. 1957 బెగుసరాయ్ బూత్ క్యాప్చరింగ్ నుంచి 1975 నాటి ఎమర్జెన్సీ విధింపు, ఆర్టికల్ 356 దుర్వినియోగం, ఎంపీల కొనుగోలు వరకు కాంగ్రెస్‌ది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన నల్ల చరిత్ర అని విమర్శించారు.

రైతులను గాలికొదిలేసిన రేవంత్ ప్రభుత్వం

తెలంగాణలో తీవ్ర వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయి, సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ రాక రైతాంగం సంక్షోభంలో ఉంటే, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రజా సమస్యలను గాలికొదిలేసి అధిష్టానం మెప్పు కోసం దిల్లీ ధర్నాల పేరిట నాటకాలు ఆడుతున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వోట్ల సవరణ ప్రక్రియ అంతా స్థానిక ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల సమక్షంలోనే జరిగిందని స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ సవరణ ప్రక్రియపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *