దమ్ముంటే ధరలు దించు

– పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పన్ను భారం తగ్గించాలి
– సీఎం రేవంత్‌కు హరీశ్ రావు లేఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో చోద్యం చూడటం మానేసి వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోమవారం లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయి.. రాష్ట్ర పన్నులు తగ్గించాలి అని నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడిన రేవంత్ రెడ్డి నేడు అధికారంలో ఉండి ఎందుకు వ్యాట్ తగ్గించడం లేదని లేదని నిలదీశారు. ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచుడు కాదు.. దమ్ముంటే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించి ధరలు దించాలని డిమాండ్ చేశారు. వారంలో నాలుగుసార్లు ఇంధన ధరలు పెంచి కేంద్రం ప్రజలపై పెను భారం మోపితే మరోవైపు రేవంత్ రెడ్డి రాష్ట్ర పన్నుల భారం తగ్గించడంలేదని మండిపడ్డారు. సాగు ఖర్చులు భరించలేక రైతులు సతమతమవుతుంటే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు రైతుల పరిస్థితి తయారైందన్నారు. రవాణా రంగం తీవ్ర సంక్షోభానికి లోను కావడంతో ద్రవ్యోల్బణం పెరిగి అన్ని వర్గాల ప్రజల జీవనంపై ప్రతికూల ప్రభావం పడుతున్నదన్నారు. రైతు పొలం దున్నాలన్నా డీజిల్ భారం.. సామాన్యుడు బైక్ తీయాలన్నా పెట్రోల్ భారం.. ఆటో సోదరుడి బతుకు బండి నడవాలన్నా ఇంధన భారం.. పెరిగిన ధరలు ప్రజానీకానికి పెను శాపంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. పెరిగిన ధరలతో ప్రతి నెలా రూ.162 కోట్లు ఏడాదికి దాదాపు 2,000 కోట్ల అదనపు వ్యాట్ ఆదాయం వస్తుంటే ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విడిచి పెట్టి ప్రచారాలకే పెద్ద పీట వేస్తున్నదని విమర్శించారు. ఎన్నికల ముందు వ్యాట్ పై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లుగా కేనీసం 0.1% వ్యాట్ కూడా తగ్గించకపోవడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. నిజంగా ప్రజా పాలనే అయితే వెంటనే పెట్రోల్, డీజిల్‌పై కనీసం 10% వ్యాట్ తగ్గించి, ఇంధన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాలని బీఆరఎస్ పక్షాన హరీష్‌రావు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ పెంపుపై మొసలి కన్నీరు కార్చే రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యాట్ దోపిడీపై స్పందించాలని, వ్యాట్ తగ్గించేలా రేవంత్ రెడ్డిని ఆదేశించాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *