హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ సి.వి.ఆనంద్ సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ తనిఖీల్లో అధికారులకు, సిబ్బందికి డీజీపీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయంలోని అన్ని విభాగాలు అత్యంత పరిశుభ్రంగా ఉండాలని, విధి నిర్వహణలో మరింత సమర్థతను చాటాలని ఆదేశించారు. ఆఫీస్ రూపురేఖలు మార్చేలా గోడలు, అల్మారాలు, టేబుళ్లకు ఒకే విధమైన (స్టాండర్డైజ్డ్) రంగులు వేయించాలని సూచించారు. కార్యాలయంలో ఎక్కడపడితే అక్కడ ఫైళ్లను ఉంచకుండా తక్షణమే వాటిని రికార్డు రూమ్‌కు తరలించాలని స్పష్టం చేశారు. అలాగే కాన్ఫరెన్స్ హాల్, ట్రైనింగ్ హాల్ సహా ఇతర గదులను మరింత విశాలంగా మార్చేందుకు వీలుగా రీ-డిజైనింగ్ (పునర్నిర్మాణం) చేయాలని అధికారులతో చర్చించారు. ఈ తనిఖీల్లో డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ ఎమ్. భగవత్, డీజీ (ఆర్గనైజేషన్ అండ్ హోంగార్డ్స్) స్వాతి లక్రా, డీజీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి.శ్రీనివాసరావు, డీజీ (సీఐడీ) చారు సిన్హా, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, గజరావు భూపాల్ తదితరులు తమతమ విభాగాల పనితీరు, ప్రస్తుతం కొనసాగుతున్న కార్యకలాపాలను డీజీపీ ఆనంద్‌కు వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


