ఆప్త మిత్రుడిని కోల్పోయాను

-పెద్ది మరణం పట్ల కేసీఆర్‌ ‌సంతాపం
– పార్టీ అండగా ఉంటుంది

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 31: పెద్ది మృతితో తానొక ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేసారు. కుటుంబ సభ్యులకు పార్టీ కార్యకర్తలకు, పెద్ది అభిమానులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కేసీఆర్‌ అన్నారు. సుదర్శన్‌ ‌రెడ్డి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతితో ఆయ‌న‌ తన సంతాపాన్ని ప్రకటించారు. రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో వరంగల్ జిల్లాలో తనతోపాటు కలిసి నడిచిన జ్ఞాపకాలను కేసీఆర్‌ ఈ ‌సందర్భంగా స్మరించుకున్నారు. పెద్దిని బతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వప్రయత్నాలూ, డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం పట్ల కేసీఆర్‌ ‌ఆవేద‌న‌ వ్యక్తం చేశారు. తెలంగాణనే శ్వాసగా, నీతి నిజాయతీతో సాగించిన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమన్నారు. పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్‌ఎస్‌ ‌గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్‌ ‌రెడ్డి అని కేసీఆర్‌ ‌ కొనియాడారు. ఉద్యమకాలం నుంచి చివరిశ్వాస వరకూ గులాబీ జెండా నీడలో నడిచిన పెద్ది అటు పోరాటంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధి లోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడని తెలిపారు. పార్టీ పట్ల అత్యంత విధేయతతో పనిచేసిన పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఒత్తిళ్లు, నాన్‌-‌బెయిలబుల్‌ ‌కేసులు, జైలు నిర్బంధాలకు కూడా లొంగని పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి ఉద్యమ పటిమ, ధైర్య సాహసాలు, స్ఫూర్తి, ఆయన సేవలు నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటాయన్నారు. పెద్దిని కోల్పోయి శోకతప్త హృదయులై ఉన్న భార్యాపిల్లలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని అధినేత సూచించారు. సుదర్శన్‌ ‌రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, పెద్ది కుటుంబ సభ్యులకు, నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులకు, కేసీఆర్‌ ‌గారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *