ఆయిల్ పామ్ విస్తరణలో అలసత్వాన్ని సహించం

– కంపెనీల పనితీరుపై మంత్రి తీవ్ర అసంతృప్తి
– లక్ష్య సాధనలో విఫలమైన కంపెనీలపై కఠిన చర్యలు తప్పవు
– ఇప్పటికే కంపెనీలకు పలుమార్లు నోటీసులు
– పురోగతి లేని కంపెనీలను తొలగించడానికైనా సిద్ధం
– ఆయిల్ ఫెడ్‌కూ మినహాయింపు లేదు : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల 

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 31: ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ సాగు విస్తరణ కార్యక్రమంలో నిర్లక్ష్యం, అలసత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేదన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనలో విఫలమవుతున్న ఆయిల్ పామ్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సెక్రటరీ కె.సురేంద్ర మోహన్‌ను ఆదేశించారు. సచివాలయంలో ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో సురేంద్ర మోహన్, ఆయిల్ ఫెడ్ ఎండి యాస్మిన్ బాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 85 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 17,090 ఎకరాలలో మాత్రమే సాగు నమోదైందని, అంటే లక్ష్యంలో సుమారు 20 శాతం మాత్రమే పురోగతి సాధించడం అత్యంత నిరాశ కలిగించే విషయమని అన్నారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నప్పటికీ కంపెనీలలో ఆశించిన స్థాయిలో చిత్తశుద్ధి కనిపించడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున ఇప్పటికే పలుమార్లు కంపెనీలతో సమావేశాలు నిర్వహించి ఆయిల్ పామ్ విస్తరణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కంపెనీల పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడంలేదని మంత్రి అన్నారు. రైతులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న సమయంలో కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. పనితీరు సరిగా లేని కంపెనీలకు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. జగిత్యాల జిల్లాలో లోహియా కంపెనీకి, గద్వాల, నారాయణపేట, జనగామ జిల్లాలలో పనిచేస్తున్న ఆయిల్ ఫెడ్‌కు నాలుగుసార్లు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లాలో తిరుమల కంపెనీకి, భూపాలపల్లి, ములుగు, వనపర్తి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రియూనిక్ కంపెనీకి, హనుమకొండ, వరంగల్ జిల్లాలలో పనిచేస్తున్న రామ్ చరణ్ కంపెనీకి మూడుసార్లు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో గోద్రెజ్ కంపెనీకి రెండుసార్లు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. విశ్వతేజ్ కంపెనీకి ఐదుసార్లు, కేన్ బయో కంపెనీకి ఆరుసార్లు, పతంజలి కంపెనీకి ఆరుసార్లు, మాట్రిక్స్ కంపెనీకి ఐదుసార్లు, సువేన్ ఆగ్రో కంపెనీకి మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ  కంపెనీలలో ఆశించిన మార్పు కనిపించలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పతంజలి, లోహియా, కేన్ బయో, మాట్రిక్స్ కంపెనీల పరిధిలోని కొన్ని జిల్లాలను గతంలోనే తొలగించి ఇతర కంపెనీలకు అప్పగించినప్పటికీ కంపెనీలలో ఇంకా బాధ్యతాయుతమైన వైఖరి కనిపించడంలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్య సాధనలో  వెనుకబడి న ఏ కంపెనీ అయినా వారి పరిధిలోని జిల్లాలను తగ్గించడానికైనా లేక పూర్తిగా తొలగించడానికైనా ప్రభుత్వం వెనుకాడదని, మెరుగైన పనితీరు కనబరిచే కంపెనీలకు మరికొన్ని జిల్లాలను అప్పగించే ఆలోచన ఉందని అన్నారు. ప్రభుత్వ సంస్థ ఆయిల్ ఫెడ్‌కు కూడా ఎలాంటి మినహాయింపు ఉండదని, పనుల్లో పురోగతి లేకుంటే ఆ సంస్థ పరిధిలోని జిల్లాలను కూడా ఇతర సంస్థలకు లేక కొత్త సంస్థలకు అప్పగించే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
సమావేశంలో మొక్కల లభ్యతపై కూడా మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. ఆగస్టు నెలలో మొక్కల కొరత ఎదురయ్యే అవకాశం ఉన్న కంపెనీలు ముందస్తుగా ఇతర కంపెనీల నుంచి మొక్కలను కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతు మొక్కలు కోరిన వెంటనే అందించే స్థాయిలో ప్రతి కంపెనీ సిద్ధంగా ఉండాలని సూచించారు. మొక్కల లభ్యత పేరుతో ఒక్క రైతు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. కంపెనీల ఫీల్డ్ సిబ్బంది గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. ఆయిల్ పామ్ సాగు యాజమాన్య పద్ధతులు, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, పంట సంరక్షణ తదితర అంశాలపై రైతులకు నిరంతరం అవగాహన కల్పిస్తూ, వారి సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని కంపెనీల ప్రతినిధులకు సూచించారు.యూనిట్ల ఏర్పాటులో జాప్యం కూడా ప్రభుత్వం సహించదని, ఇప్పటికే కావాల్సింత సమయం కంపెనీలకు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. యూనిట్లు త్వరగా అందుబాటులోకి వస్తే రైతులకు రవాణా భారం తగ్గడంతోపాటు పంటకు సకాలంలో ప్రాసెసింగ్ సౌకర్యం లభిస్తుందన్నారు. అందువల్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, రైతులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కంపెనీలకు సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *