– 2,160 ఇళ్ల మోడల్ కాలనీకి తుది మెరుగులు
– అర్హులకే ఇళ్లు.. ఒక్క అనర్హుడికీ అవకాశం ఇవ్వొద్దు
– అన్ని వసతులు కల్పించాకే గృహ ప్రవేశం
– అధికారులకు మంత్రి కెప్టెన్ ఉత్తమ్ ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : హుజూర్‌నగర్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 2,160 గృహాల హౌసింగ్ కాలనీని సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మిగిలిపోయిన పనులను సాధ్యమైనంత వరకు ఏడు నుంచి పది రోజుల్లో పూర్తి చేసి ప్రతీ ఇల్లు లబ్దిదారులు వెంటనే నివాసం ఉండగలిగే స్థితిలో సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఆర్డీవోలు, హౌసింగ్ శాఖ అధికారులు, ఇంజినీర్లు, ఇతర జిల్లా అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. హుజూర్‌నగర్ హౌసింగ్ కాలనీతోపాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుజూర్‌నగర్ హౌసింగ్ కాలనీ రాష్ట్రానికే ఆదర్శ గృహ నిర్మాణ ప్రాజెక్టుగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రారంభోత్సవానికి ముందు మొత్తం 2,160 ఇళ్లను ఇంటింటికీ సాంకేతికంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి తలుపులు, కిటికీలు సక్రమంగా ఉండటంతోపాటు విద్యుత్ సౌకర్యం, బాత్‌రూమ్‌లకు నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ సహా కనీస మౌలిక సదుపాయాలన్నీ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. లబ్దిదారుల ఎంపికలో పైరవీలకు, పక్షపాతానికి తావుండకూడదు. ఒక్క అనర్హుడికీ ఇల్లు దక్కకూడదు. అదే సమయంలో హుజూర్‌నగర్‌లో నిజంగా ఇల్లు లేని ఒక్క అర్హ కుటుంబం కూడా నష్టపోకూడదు అని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల నుంచి వచ్చే సిఫారసులను పరిశీలించవచ్చని, అయితే తుది ఎంపిక మాత్రం ప్రభుత్వ నిబంధనలు, అర్హత ప్రమాణాల ఆధారంగానే జరగాలని అధికారులకు సూచించారు. ఏళ్లతరబడి చేసిన కృషి, పెద్ద మొత్తంలో ప్రజాధనం వెచ్చించి నిర్మించిన కాలనీలో ప్రారంభోత్సవం అనంతరం చిన్నపాటి లోపాలు బయటపడినా ప్రాజెక్టు ప్రతిష్ఠ దెబ్బతింటుందని హెచ్చరించారు. అందువల్ల ప్రారంభోత్సవానికి ముందే ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించి లోపాలను సరిచేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి యూకే, అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన అనంతరం సెప్టెంబర్ తొలి వారంలో కాలనీ ప్రారంభోత్సవం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంతకుముందు ఆగస్టు 24 ప్రాంతంలో హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి కాలనీని తుది పరిశీలన చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అప్రోచ్ రోడ్డు, పచ్చదనం, ప్రజావసరాలు, ఇతర సామూహిక సదుపాయాలను సమాంతరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాలనీలో ఇప్పటికే దాదాపు పది వేల అదనపు మొక్కలు నాటినట్లు, విస్తృతంగా పచ్చదనం పెంపొందిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. కాలనీలో ప్రతిపాదించిన పాఠశాల, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్, సామూహిక మరుగుదొడ్లు, రీడింగ్ రూమ్ తదితర సదుపాయాల పనులను ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. సమీప వ్యవసాయ భూముల నుంచి వచ్చే నీటితో భవిష్యత్తులో కాలనీలో నీరు నిలవడం లేదా సీపేజ్ సమస్యలు తలెత్తకుండా అప్రోచ్ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న గృహ లబ్ధిదారుల జాబితాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. లబ్దిదారులు నిజంగా ఇళ్లు లేని కుటుంబాలా, అర్హమైన ఇంటి స్థలం ఉందా, బీపీఎల్ కుటుంబానికి చెందినవారా అన్న అంశాలను నిర్ధారించిన తర్వాతే మంజూరు ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. తాళం చెవి ఇచ్చి బాధ్యత ముగిసిందనుకోవద్దు. ఒక కుటుంబం తొలి రోజే ఆ ఇంట్లో అడుగుపెట్టి, ఎలాంటి ఇబ్బంది లేకుండా గౌరవంగా జీవితం ప్రారంభించగలిగేలా ఇల్లు సిద్ధం చేసి అప్పగించడమే మన లక్ష్యం అని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




