ప్రతీ కేసును వేగంగా పరిష్కరించాలి
ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించిన మంత్రి పొంగులేటి
అధికారులకు టెలికాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం
మా భూమి మాకు దక్కింది : దరఖాస్తుదారులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : నిషేధిత జాబితా(22/ఎ)లో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి త్వరితగతిన తెరదించేందుకు ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22/ఎ జాబితాలో భూమి ఉందనే ఒక్క కారణంతోనే రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని, ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి 22/ఎ అంశంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు జరిపారు. మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్లు సబ్ రిజిస్ట్రార్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతోపాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ సంబంధిత భూమి 22/ఎ నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది.. రికార్డులు ఏమి చెబుతున్నాయి.. ప్రస్తుతం భూమి వాస్తవ పరిస్థితి ఏమిటి.. హక్కుదారుడి వద్ద ఉన్న పత్రాలు ఏమిటి.. గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలు ఏమిటి వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని వాటికి రిజిస్ట్రేషన్ ఎందుకు సాధ్యం కాదో దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని, నిబంధనల ప్రకారం ముందుగా చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 22/ఎ భూముల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ భూములను కూడా పరిరక్షిస్తూ ప్రతీ కేసును చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
నా భూమి నాకు దక్కింది.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు 
22/ఎ సమస్యను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్న ప్రభుత్వ చర్యలకు లబ్దిపొందిన పోచారం గ్రామానికి చెందిన రాకేష్ తన అనుభవాన్ని వెల్లడించారు. ‘నేను 2022లో పోచారం గ్రామంలో వంద గజాల స్థలం కొనుగోలు చేశాను. ఇటీవల ఆ స్థలాన్ని విక్రయించేందుకు నార్లపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాను. మొదట డాక్యుమెంట్ రైటర్‌ను సంప్రదించగా మీ భూమి22/ఎలో ఉందని చెప్పారు. దీంతో ఆందోళనకు గురయ్యాను. అయితే మూడు, నాలుగు రోజుల క్రితం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి మీ భూమికి ఎలాంటి సమస్య లేదని తెలిపారు. ఈ రోజు నేను ఆ స్థలాన్ని కొనుగోలుదారుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చేశాను. నా భూమి నాకు దక్కేలా సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు’ అని అన్నారు.
క్లియరెన్స్ వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాం
నారపల్లి సబ్ రిజిస్ట్రార్ సునీల్ మాట్లాడుతూ పోచారంలోని సర్వే నం.50ను ఏపీ హౌసింగ్ బోర్డు భూమిగా పేర్కొంటూ గత ఏడాది డిసెంబర్‌లో 22/ఎ జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని తెలిపారు. ఇటీవల కలెక్టర్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. వెంటనే గతంలో రిజిస్ట్రేషన్ కోసం మమ్మల్ని సంప్రదించిన వారికి ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నాం. వారు కార్యాలయానికి వచ్చిన వెంటనే నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నాం అని సబ్ రిజిస్ట్రార్ సునీల్ తెలిపారు.
మా సొసైటీలోని 300 ప్లాట్లకు పూర్తి విముక్తి: చక్రపాణి (కొనుగోలుదారు) 
కూకట్‌పల్లి అడ్డగుట్ట సొసైటీలోని నెం.80-సిలోగల 250 గజాల స్దలాన్ని నెల క్రితం కొనుగోలు చేశాను. అయితే రిజిస్ట్రేషన్ కోసం కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే ఆ భూమి 22-ఎ నిషేధిత జాబితాలో ఉందని రిజిస్ట్రేషన్ చేయలేదు. తాజాగా ప్రభుత్వ చర్యల కారణంగా నిన్ననే నాకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఈ రోజు వెళ్లగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అంతేగాక మా సొసైటీలోని 300 ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
\సకాల చర్యల వల్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది : రాజేంద్రప్రసాద్

బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని మూసాపేట్‌లో గల రెయిన్‌బో విస్టాలో ఉన్న ప్లాట్ నెంబర్ 804ను విక్రయించేందుకు కొద్ది కాలం క్రితం యజమాని వెంకట విజయ్‌కుమార్ ప్రయత్నించారు. అయితే 22-ఎ నిషేధిత జాబితాలో ఉన్నందున రిజిస్ట్రేషన్ జరగలేదు. విజయ్‌కుమార్ ఆస్ట్రేలియా వెళ్లిపోతూ తన మామ రాజేంద్రప్రసాద్‌కు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. ఈనెల 12న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సమాచారం రావడంతో ఈరోజు రాజేంద్రప్రసాద్ వెళ్లి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. తమ అల్లుడు అమ్ముదామనుకున్న ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం వస్తే 22-ఎ కింద గవర్నమెంట్ నిషేధం విధించిందని చెప్పినందున ఆ రోజు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఆ తర్వాత అల్లుడు తన పేరŠ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. అది ఇంకా చాలా కాలమే పడుతుందేమో అనుకున్నాం గానీ అదృష్టవశాత్తూ ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకున్నందున వెంటనే వారం రోజుల్లోనే ఇది క్లియర్ అయి అనుకూలంగా తేలింది. ఈ రోజు రిజిస్ట్రేషన్ కోసం వచ్చాం, రిజిస్ట్రేషన్ కూడా మాకు సంతృప్తికరంగా పూర్తిగా అవుతుంది. ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తి : శ్రీనివాస్
బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని మూసాపేట్‌లో గల వైష్ణవి ఎస్టేట్ ప్రతినిధి శ్రీనివాస్ మూసాపేట సర్వే నెం.108లో గల భూమిని విక్రయించేందుకు రాగా 22-ఎ నిషేధిత జాబితాలో ఉందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తిరస్కరించారు. తాజాగా ప్రభుత్వ చర్యల కారణంగా ఈరోజు శ్రీనివాస్ తన భూమికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తమకు 2005లో సీలింగ్ పర్మిషన్ వచ్చింది. తాము రిజిస్ట్రేషన్‌కి అప్పటినుంచి ప్రయత్నిస్తున్నాము. తాజాగా రెండు వారాల క్రితం మూసాపేట్ బాలానగర్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్‌కి వెళ్తే 22-ఎలో పెట్టామని చెప్పారు. తాము కలెక్టర్‌ని కలిశాము. ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ అది క్లియర్ చేశారు. దాంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేశాము. ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ అయింది. థాంక్యూ వెరీ మచ్.
పలు సర్వే నెంబర్లలో నిషేధం తొలగింపు – ఆర్‌వో
బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో సర్వే నెం.101/1, 101/2, 102, 108, 109, 112, 81లో ఉన్న సుమారు 3000 చదరపు మీటర్ల స్దలంపై ఉన్న 22-ఎ నిషేధం తొలగిపోయింది. ఈ నెంబర్లలో ఉన్న భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుపుకోవచ్చునని బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.
అధికారుల ఆదేశాలతో వెంటనే రిజిస్ట్రేషన్
తాము ఏజీ కాలనీ గుండ్ల పొచంపల్లిలోని గౌరీశంకర్ వద్ద ఒక ప్లాట్ తీసుకున్నాం. జూలై 6న ఇక్కడ రిజిస్ట్రేషన్‌కి రాగా 22-ఎ నిషేధిత జాబితా పేరిట రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. అప్పటినుంచి తాము కలెక్టర్ ఆఫీస్‌కి, అక్కడ ఇక్కడ తిరుగుతుంటే ఈరోజు డిప్యూటీ కలెక్టర్ వచ్చి క్లియర్ చేయమని సబ్-రిజిస్ట్రార్‌కు చెప్పారు. ఆ వెంటనే సబ్ రిజిస్ట్రార్ ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి తమకు డాక్యుమెంట్స్ ఇచ్చారని ఒక దరఖాస్తుదారు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




