“తాజాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర జల సంఘం నుండి అనుమతి పొందాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర జల సంఘం కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియ జేస్తే ఆమోదించేందుకు సిద్ధంగా వుంది. కాని గతంలో ఒక మారు డిపిఆర్ కేంద్ర జల సంఘం తిప్పిపంపుతూ ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్నందున డిపిఆర్ ను ఆమోదించ లేమని నోట్ పెట్టింది. మరి ఇప్పుడు ఎట్లా ఆమోదించుతుంది? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల్లో ఏన్నో యక్ష ప్రశ్నలు వున్నాయి.”
తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర జల వివాదాలకు అంత సులభంగా తుది పరిష్కారం లభించే అవకాశాలు కన్పించడం లేదు. ప్రస్తుతం విచారణ జరుపుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వస్తే చాల వరకు సమస్యలు పరిష్కారమౌతాయని భావిస్తున్నారు. గాని తదుపరి కూడా బీరకాయలోని పీచు సముద్రంలోని నాచులాగా న్యాయ పరమైన సమస్యలు రెండు రాష్ట్రాల పరస్పర విరుద్ధమైన అవసరాలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి . దీనికి తోడు ఆయా రాష్ట్రాల్లోని ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య తలెత్తే రాజకీయ వైషమ్యాలు రెండు రాష్ట్రాల మధ్య సామరస్యానికి పెద్ద అడ్డంకిగా నిలుస్తున్నది.బచావత్ ట్రిబ్యునల్ కాల పరిమితి ముగిసిందని 2004 లో కృష్ణ బేసిన్ మొత్తం నీటి కేటాయింపులకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నియమింప బడింది. 2010 లో మధ్యంతర తీర్పు 2013 లో తుది తీర్పు ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు న్యాయం జరగలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించగా స్టే లభించింది. 2015 లో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ చేయలేదు. ప్రస్తుతం ఇంకా బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలు లో వుంది. 2013 లో అరకొరగా నైనా ఆంధ్ర ప్రదేశ్ కు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులకు చట్ట బద్దత లేదు. ఏ ట్రిబ్యునల్ తీర్పును గాని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ చేస్తేనే చట్ట బద్దత లభిస్తుంది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తను చేసిన కేటాయింపులను పరిగణనలోకి తీసుకోలేదు. ఒక వేళ తీసుకొంటే అదొక న్యాయ పరమైన అంశంగా తయారౌతుంది. ఇప్పుడు తను 2010 లో చేసిన కేటాయింపుల విషయంలో ట్రిబ్యునల్ ఏ వైఖరి తీసుకొంటుందో వేచి చూడాల్సిందే.
రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు ట్రిబ్యునల్ విచారణ జరుపుతుండగా కేంద్ర ప్రభుత్వం 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం కింద అదనపు అంశాలు జతపరుస్తూ నోటిఫై చేసింది. ఈ జీఓ చట్ట విరుద్ధమని ఆంధ్ర ప్రదేశ్ సుప్రీంకోర్టు కెక్కి వుంది. రెండు రాష్ట్రాల మధ్య ఏ అంశం పరిష్కారం కావాలన్నా పార్లమెంటు ఆమోదించిన రాష్ట్ర విభజన చట్టం కర దీపికని ఆంధ్ర ప్రదేశ్ సుప్రీంకోర్టుకు విన్నవించి వుంది. అయితే ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు తమ ఆదేశాలకు లోబడి వుంటుందని సుప్రీంకోర్టు చెప్పి వుంది. అంతిమంగా సుప్రీంకోర్టు ఏం చెబుతుందో వేచి చూడాలి.ఈ తీర్పు అతి కీలక మైనది. ఈ తీర్పు తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే ఇదొక న్యాయ పరమైన అంశమౌతుంది. రెండు రాష్ట్రాల మధ్య ఆరని నిత్యాగ్నిని రగలేస్తుంది.
ఒక వేళ సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణకు అనుకూలంగా వచ్చితే బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పే తీర్పు ఇంచు మించు రెండు రాష్ట్రాలను సంత్రుప్తి పర్చే విధంగా వుంటే ఫర్వాలేదు. ఒక ఎవరోఒకరికి తీవ్ర ఆశాభంగం కలిగితే ఎవరైనా సరే సుప్రీంకోర్టు తలుపు తట్టక మానరు. దీని పరిణామాలు ఏలా వుంటాయి.? కోర్టులు ట్రిబ్యునల్స్ తో ఎంత కాలం గడుపుతారు? ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు అంతర్గతంగా ప్రతి పక్షాల నుండి పెద్ద ఇబ్బంది లేదు గాని తెలంగాణ పరిస్థితి భిన్నంగా వుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాత్రం సర్దుబాటుకు సిద్ధమైతే బిఆర్ఎస్ పార్టీ నేతలు పెద్దగా అల్లరి చేసే అవకాశం వుంది. పైగా కాంగ్రెస్ ప్రభుత్వమే కృష్ణలో 70 శాతం నీటి వాటాలను ట్రిబ్యునల్ ను కోరి వున్నది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు అమలులోనికి వచ్చినా రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు గతంలో సాగిస్తుండిన విచారణ తిరిగి మొదలు పెట్ట వలసి ఉంటుంది. అంత వరకైతే ఫర్వాలేదు. వచ్చే సంవత్సరం జూన్ వరకు ప్రస్తుతం ట్రిబ్యునల్ కు గడువు వుంది. ట్రిబ్యునల్ విచారణ ముగించి తీర్పు చెప్పిన తరువాత ఏదో విధంగా 2013 లో వచ్చిన తుది తీర్పును కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తే అందులో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు కేవలం 39 టియంసిలు మాత్రమే లభించినా వాటి భవిష్యత్తు ఏమిటి?
రెండు రాష్ట్రాలకు మరో ప్రమాదం ముంచుకొస్తోంది. కర్నాటక ఆల్మట్టి నిర్మించిన తర్వాత కృష్ణలో వరద ఆలస్యంగా వస్తోంది. కర్నాటక శత విధాలా
బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 2013 నాటి తీర్పు నోటిఫై చేయించుకొనేందుకు యత్నించుతోంది. 2010 లో మధ్యంతర తీర్పు రాగానే 23 వేల కోట్లు వ్యయం చేసి కాలువలు తవ్వామని ఆ మేరకు అయినా అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కర్నాటక ఇటీవల అభ్యర్థించింది. సెప్టెంబర్ కు కోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఏదైనా జరిగితే లేదా ట్రిబ్యునల్ తీర్పు గెజిట్ నోటిఫికేషన్ జరిగితే 285 టియంసిలు కర్నాటక మహారాష్ట్ర తన్నుకు పోతాయి. మొదలే ముక్కడి పైగా పడిశం లాగా రెండు రాష్ట్రాల పరిస్థితి తయారౌతుందేమో.
తాజాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర జల సంఘం నుండి అనుమతి పొందాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర జల సంఘం కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియ జేస్తే ఆమోదించేందుకు సిద్ధంగా వుంది. కాని గతంలో ఒక మారు డిపిఆర్ కేంద్ర జల సంఘం తిప్పిపంపుతూ ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్నందున డిపిఆర్ ను ఆమోదించ లేమని నోట్ పెట్టింది. మరి ఇప్పుడు ఎట్లా ఆమోదించుతుంది? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల్లో ఏన్నో యక్ష ప్రశ్నలు వున్నాయి.
ఏదిఏమైనా కోర్టులు ట్రిబ్యునల్ లు తీర్పులు పక్కన బెట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యంతో పరస్పరం చర్చలతో ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో గౌరవప్రదమైన ఒప్పందానికి రావడమొకటే శాశ్వత పరిష్కారానికి మార్గం.





