అప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు?

– హరీష్‌రావుపై మంత్రి పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు
– పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై నకిలీ ఎన్‌వోసీ ఆరోపణ
– గంగుల విషయంలోనూ నిషేధిత భూమి రిజిస్ట్రేషన్
– 22ఏలో నాలుగు లక్షల ఎకరాలే పట్టా భూములు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : మాజీ మంత్రి హరీష్‌రావుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు ఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అది తప్పేనని, అలాంటప్పుడు తన మామ భూముల విషయంలో రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని హరీష్‌రావును ప్రశ్నించారు. అప్పుడు నీ బుద్ధి ఎక్కడికి పోయింది అని అడిగారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన పొంగులేటి తన మామ భూములకు గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్‌వోసీ ఇచ్చిందన్న హరీష్‌రావు వ్యాఖ్యలపై స్పందించారు. అసైన్డ్ భూములకు అనుమతి ఇవ్వడం చట్టబద్ధం కాదని, ఏ ప్రభుత్వం అలా చేసినా తప్పేనని అంటూ ఆ విషయం హరీష్‌రావుకు తెలియదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి భూదాన్ భూమిని నకిలీ ఎన్‌వోసీతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పొంగులేటి ఆరోపించారు. అది కూడా తప్పేనన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ విషయంలోనూ నిషేధిత భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని ఆరోపించారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో స్టేటస్‌కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని ఏ సర్కార్ రిజిస్ట్రేషన్ చేసినా అది తప్పేనని స్పష్టం చేశారు. 22ఏ నిషేధిత జాబితాపైనా పొంగులేటి కీలక వివరాలు వెల్లడించారు. ఈ జాబితాలో ఉన్న భూముల్లో నాలుగు లక్షల ఎకరాలు మాత్రమే పట్టా భూములని, మిగిలిన భూమంతా ప్రభుత్వ భూమేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 22ఏ జాబితా నుంచి 47,440 ఎకరాలు తగ్గించినట్లు అసెంబ్లీలో ఇప్పటికే వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలపై త్వరలోనే పూర్తి వివరాలు బయటపెడతామని పొంగులేటి తెలిపారు. 22ఏ భూముల వ్యవహారంపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయాలు తీసుకోనుందని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *