– ఆయన సంకల్పమే లేకుంటే నేడు దేశంలో తెలంగాణ ఉండేదా?
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి పేర్లు వింటే యువతరం నరనరాల్లో దేశభక్తి ఉప్పొంగుతుంది.. అదే స్థాయిలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ త్యాగాన్ని, ధైర్యాన్ని కూడా భావితరాలు స్మరించుకోవాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. నాడు పటేల్ తెగువ చూపకపోయి ఉంటే నేడు తెలంగాణ భారత యూనియన్‌లో ఉండేది కాదని స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో బుధవారం ఏర్పాటు చేసిన చారిత్రక ఫొటో ఎగ్జిబిషన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులతో కలిసి ప్రదర్శనను తిలకించిన ఆయన నిజాం నిరంకుశ పాలనపై సాగిన వీరోచిత పోరాట ఘట్టాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ దేశమంతటికీ 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్ సంస్థానానికి మాత్రం దాదాపు పదమూడు నెలల తర్వాత 1948 సెప్టెంబరు 17న స్వేచ్ఛ లభించిందని గుర్తు చేశారు. భారతదేశంలో కలవబోనంటూ మొండికేసిన నిజాం నవాబు దురహంకారాన్ని సర్దార్ పటేల్ ‘ఆపరేషన్ పోలో’తో తుత్తునియలు చేసి తన ముందు మోకరిల్లేలా చేశారన్నారు. ఆ చారిత్రక లొంగుబాటు దృశ్యాలను ఈ ఎగ్జిబిషన్ కళ్లకు కడుతోందన్నారు. నిజాం అణచివేతకు వ్యతిరేకంగా కొమురం భీం, రాంజీ గోండు, వందేమాతరం రామచంద్రరావు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వంటి ఎందరో యోధులు పోరాటం కొనసాగించారని కొనియాడారు. నాడు పోరాట యోధులను కదనరంగంలో నడిపించిన మహత్తర మంత్రం ‘వందేమాతరం’ అని, ఆ గీతాన్ని నేటి బాలలంతా సంపూర్ణంగా నేర్చుకుని, గర్వంగా ఆలపించాలని పిలుపునిచ్చారు. మన భవిష్యత్తు చరిత్ర పునాదులపైనే నిలబడుతుందని, అందుకే తెలంగాణలో ఆగస్టు 15, సెప్టెంబరు 17 తేదీల్లో రెండుసార్లు గర్వంగా మువ్వన్నెల జెండాను ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పిస్తున్నామని తెలిపారు. 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలంతా తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ, దేశాన్ని ‘వికసిత్ భారత’ వైపు నడిపించే సంకల్పానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




