– ఈ ఏడాది అదనంగా 2 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యం
– ఉద్యానరంగ అభివృద్ధికి రూ.1,000 కోట్లతో కార్యాచరణ
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఉద్యాన పంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత-జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శాసనసభలో ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్ సాగుకుపై సభ్యులు బుధవారం అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2026-27లో రాష్ట్రంలో అదనంగా రెండు లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగులోకి తేవాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పండ్లు, కూరగాయలు, ఆయిల్‌పామ్ తదితర పంటల వైపు రైతులను మళ్లించేందుకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉద్యాన పంటల సాగు విస్తరణకు మొక్కలు, ఎరువులు, మల్చింగ్, షేడ్‌నెట్, ఫామ్పాండ్లు, శీతల గిడ్డంగులు, శాశ్వత పందిళ్లు, బిందు, తుంపర సేద్యం వంటి సదుపాయాలను 40 నుంచి 90 శాతం వరకు రాయితీపై అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. 2026-27లో మొక్కలు, మల్చింగ్, షేడ్‌నెట్, కోత అనంతర నిర్వహణ సదుపాయాలు, గిడ్డంగులు, ఉద్యాన యాంత్రీకరణ, పందిళ్ల కోసం రూ.150 కోట్లు, బిందు, తుంపర సేద్యానికి రూ.243 కోట్లు, ఆయిల్‌పామ్ అభివృద్ధికి రూ.261 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
3.20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
రాష్ట్రంలో 88,282 మంది రైతులు 3.20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఎన్ఎంఈఓ-ఓపీ పథకం కింద 2021-22 నుంచి ఇప్పటివరకు 2.74 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టి దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 2023 డిసెంబర్ నుంచి 1.37 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును విస్తరించామని చెప్పారు. సాంప్రదాయ పంటలతో పోలిస్తే ఆయిల్‌పామ్‌కు ఉన్న ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పంటల వైవిధ్యీకరణలో భాగంగా ప్రభుత్వం ఈ పంటను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. మొక్కలు, డ్రిప్, మొదటి నాలుగేళ్లకు ఎరువులు, అంతర పంటల సాగు తదితరాలకు కలిపి ఎకరానికి రూ.46,250 వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఫామ్పాండ్లు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను కూడా రాయితీపై అందిస్తున్నట్లు చెప్పారు.
టన్నుకు రూ.24,025 ధర
ఆయిల్‌పామ్ చట్టం-1993 ప్రకారం ఫ్యాక్టరీ జోన్ కేటాయించిన ప్రతి ఆయిల్‌పామ్ కంపెనీ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ప్రతి నెలా ఆయిల్‌పామ్ గెలలను కొనుగోలు చేయాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఆయిల్‌పామ్ గెలలకు టన్నుకు రూ.24,025 ధర ఉందన్నారు. కనీస హామీ ధర కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, అయినా రైతులకు మరింత భరోసా కల్పించేందుకు కేంద్రాన్ని ఎంజీపీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోందని తెలిపారు.
కొత్తగా ఆరు ఆయిల్‌పామ్ మిల్లులు
రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ మిల్లులు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో అశ్వారావుపేట, అప్పారావుపేట, నర్మెట్టలో, గోద్రెజ్ ఆధ్వర్యంలో అంజనాపురంలో మిల్లులు పనిచేస్తున్నాయని చెప్పారు. కల్లూరుగూడెం, ఇంచెర్ల, పెద్దరాతు, రేగొండ/చిన్నపాక, యాచారం, శంకరంరెడ్డిపల్లి ప్రాంతాల్లో ఆరు మిల్లులు నిర్మాణ దశలో ఉన్నాయని, వచ్చే ఏడాదికి ఇవి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
10 వేల ఎకరాల్లో పంట ఉంటే ఫ్యాక్టరీ
ఆయిల్‌పామ్ సాగు విస్తరిస్తున్న ప్రాంతాల్లో ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ఒక ఫ్యాక్టరీ నిరంతరాయంగా పనిచేయాలంటే కనీసం 10 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట హార్వెస్టింగ్ దశకు రావాల్సి ఉంటుందని వివరించారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో మిల్లుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ములుగు, భూపాలపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే ఫ్యాక్టరీల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించామని, జనగామ, మహబూబాబాద్ ప్రాంతాల్లో కూడా ఆయిల్‌పామ్ సాగు విస్తరిస్తున్నందున అక్కడ అదనపు ప్రాసెసింగ్ సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కనీసం 10-15 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరించేలా రైతులను ప్రోత్సహిస్తే అక్కడే ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. ఆయిల్‌పామ్‌కు మార్కెటింగ్ సమస్య ఉండదని, పంట కొనుగోలు కోసం ప్రాసెసింగ్ సదుపాయాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు. ఎగుమతులకు కూడా అవకాశాలున్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, బీసీలు, చిన్నకారు రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం వరకు సబ్సిడీలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మల్చింగ్, షేడ్‌నెట్, డ్రిప్, స్ప్రింక్లర్ తదితర ఉద్యాన సదుపాయాలకు రాయితీలు అందిస్తున్నామన్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేసుకుని ఈ ఏడాది రూ.1,000 కోట్లతో ఉద్యాన పంటల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఫామ్పాండ్ల ఏర్పాటుకు కూడా సబ్సిడీ అందిస్తున్నామని, ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు ఉచితంగా ఫామ్ పాండ్లు తవ్వుకునే అవకాశం ఉందని అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో బొప్పాయి మార్కెట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కోరగా ప్రస్తుతం అక్కడ 36 ఎకరాల్లో మాత్రమే సాగు జరుగుతున్నందున తక్షణం ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేసే అవకాశం లేదని మంత్రి తెలిపారు. పోడు వ్యవసాయం చేస్తున్న రైతులను కూడా సోలార్ వ్యవస్థ వైపు మళ్లించి ఉద్యాన పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని మంత్రి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



