ఈఎస్‌ఐ హాస్పిట‌ల్‌కు ఇంటి యాజమాని తాళం

– రెండో ఫ్లోర్‌కు అద్దె చెల్లించాలని ఇవ్వాలని డిమాండ్‌
– వివేకానంద కాలనీలో నిలిచిన సేవలు
వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: ప్రభుత్వ ద‌వాఖానా నిర్వహణకు భవనం ఇస్తే అద్దె చెల్లించడం లేదని, ఎన్నిమార్లు జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిన భవన యాజమాని ద‌వాఖానాకు తాళం వేసిన ఘటన వరంగల్‌ కాశిబుగ్గ వివేకానంద కాలనీలోని శుక్రవారం చోటుచేసుకుంది. వరంగల్‌లో గిర్మాజీపేట ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఏర్పాటు కోసం కాశిబుగ్గ వివేకానంద కాలనీలోని కోదాటి గణేష్‌ అనే వ్యక్తి తన భవనాన్ని 2010లో అద్దెకు ఇచ్చారు. నెలకు రూ.25వేలు అద్దె ఇచ్చేందుకు అంగీకరించి స్టేట్‌ మెడికల్‌ కమిషనర్‌ ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ కమిషనర్‌ చెల్లిస్తున్నారు. మందులు పెద్ద మొత్తంలో రావడంతో స్థలం సరిపోవడం లేదని అదనంగా మరో ఫ్లోర్‌ నిర్మించి ఇవ్వాలని అధికారులు కోరడంతో గణేష్‌ అదనంగా ఫ్లోర్‌ నిర్మించి అధికారులకు 2012లో అప్పగించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌కు రూ.25వేలు చెల్లిస్తున్నందున మరో ఫ్లోర్‌కు మరో రూ.25వేలు చొప్పున మొత్తం రూ.50వేలు నెలకు అద్దె చెల్లించాలని యాజమాని ఈఎస్‌ఐ నిర్వాహకులను కోరారు. 08/06/2010 నుంచి 31/03/2014 వరకు అద్దెను చెల్లించగా ప్రతి ఏడాది అగ్రిమెంటు ప్రకారం అద్దె 5శాతం పెంచాలని కోరగా 01/04/2014నుంచి ఫిబ్రవరి 2026వరకు నెలకు రూ.26,500లు చెల్లించారు. ఏటా పెంచాల్సిన 5శాతం అద్దె బకాయిలతోపాటు 2012నుంచి అదనపు ఫ్లోర్‌కు సంబంధించిన అద్దె మొత్తం చెల్లించాలని పలుమార్లు లిఖితపూర్వకంగా అధికారులకు విన్నవించారు. బకాయిలతో చెల్లించాలని లేకుంటే భవనం ఖాళీ చేయాలని మూడుసార్లు లీగల్‌ నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం ప్రైవేట్‌ భవనాలను అద్దెకు తీసుకునే ప్రక్రియలో ఆర్‌అండ్‌బీ అధికారులు భవనాన్ని పరిశీలించి కొలతలు తీసుకుని నివేదిక సమర్పించగా జిల్లాస్థాయి భవన అద్దె ఫిక్సేషన్‌ కమిటీ 10/09/2025న జరిగిన సమావేశంలో అద్దెను చదరపు అడుగుకు రూ.20ల చొప్పున నిర్ణయించినట్లు గణేష్‌ తెలిపారు. కమిటీ నిర్ణయించినప్పటికి ఇప్పటివరకు సంబంధిత ప్రొసీడింగ్స్‌ జారీ చేయలేదని, కమిటీ నిర్ణయించిన అద్దె అమల్లోకి రాలేదన్నారు. ఇప్పటికీ అద్దె సమయానికి చెల్లించడం లేదని, సంవత్సరానికి ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే ఇస్తున్నారని, ఇందువల్ల తన కుటుంబ పోషణ, పిల్లల చదువు, ఇతర ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడం చాలా ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు 01/07/2026, 12/08/2026, 24/09/2026న వినతులు సమర్పించానని, కలెక్టర్‌ స్పంధించి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించినా ప్రయోజనం లేకపోవడంతో తాళం వేశానని గణేష్‌ తెలిపారు. సేవలు నిలిచిపోవడంతో సిబ్బంది ఫిర్యాదుతో వరంగల్‌ డిఎంహెచ్‌వో వెంటనే వచ్చి సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో తాళం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *