నిమ్స్ విస్తరణ పనులను వేగవంతం చేయాలి

– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : నిమ్స్ విస్తరణ ప్రాజెక్టు, గోషామహల్‌లో నిర్మిస్తున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ రెండు కీలక ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిపై సెక్రటేరియట్‌లో గురువారం మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాజెక్టుల కింద ఇప్పటివరకు చేపట్టిన నిర్మాణ పనుల పురోగతి, తదుపరి చేపట్టాల్సిన పనులపై మంత్రి అధికారులతో చర్చించారు. గోషామహల్‌లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణ పనులు 23 శాతం పూర్తయ్యాయని, నిమ్స్ విస్తరణ ప్రాజెక్టులో భవన నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేయడంతోపాటు, ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ఈ రెండు ప్రాజెక్టులు కీలక పాత్ర పోషించనున్నాయని మంత్రి పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, నిర్ణీత ప్రణాళిక ప్రకారం పనులు ముందుకు సాగేలా చూడాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో వ్యవహరిస్తూ నిర్మాణ సమయంలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం వైద్యరంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని, కీలకమైన ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక, టీజీఎంఎసఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *