‘నషా ముక్త్ భారత్ అభియాన్‌’పై విస్త్రత ప్రచారం

– మాజీ గవర్నర్ దత్తాత్రేయ

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : మాదకద్రవ్యాల నిరోధం కోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు యువతలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో గల ఆంధ్ర మహిళా సభ ఉమెన్స్ కాలేజీలో అలై బలై ఫౌండేషన్, వీ నెట్ స్వచ్చంద సంస్థల సంయుక్త ఆధ్వ‌ర్యంలో మంగళవారం నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్‌’ సమీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ మత్తు పదార్థాల మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తూ యువత భవిష్యత్తును, కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వికసిత్ భారత’ సాధించాలంటే యువతను ఈ వ్యసనాల బారి నుండి రక్షించడం అత్యంత ఆవశ్యకమన్నారు. కళాశాల స్థాయి నుంచే విద్యార్థులకు కౌన్సెలింగ్, అవగాహన సదస్సులు, నిరంతర ర్యాలీలు నిర్వహించడం ద్వారా మాదకద్రవ్యాల రహిత తెలంగాణను నిర్మించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యను కేవలం ఉపన్యాసాలు, అవగాహన సమావేశాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. మాదకద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, గ్రామాలను గుర్తించి అక్కడి ప్రజలతో, బాధితులతో నేరుగా మాట్లాడి వారిలో మార్పు తీసుకురావడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అలాగే వాటి వ్యసనం నుంచి బయటపడేందుకు చికిత్స పొందుతున్న వారిని ప్రోత్సహించేందుకు పునరావాస కేంద్రాలను సందర్శించి వారికి అవసరమైన మార్గదర్శకత్వం, మానసిక ధైర్యాన్ని అందిస్తామని దత్తాత్రేయ తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్ర మహిళా సభ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ డి.చక్రపాణి, ప్రొఫెసర్ మురళీమనోహర్, ప్రొఫెసర్ రాజిరెడ్డి, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర, సందీప్, విశ్వనాథ్, వీనెట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *