– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : ఎన్నికల హామీలను గాలికొదిలేసిన రేవంత్ సర్కార్ ప్రజల సొమ్ముతో రాహుల్ గాంధీని మళ్లీ పొలిటికల్ స్క్రీన్ మీద నిలబెట్టేందుకు తాపత్రయపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నిసార్లు ఫెయిలైనా రాహుల్‌ను రీలాంచ్ చేయడానికి తెలంగాణను ప్రయోగశాలగా మార్చడం సిగ్గుచేటని విమర్శించారు. ఒకపక్క రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది.. పెండింగ్ బిల్లులు కట్టడానికి, ఇచ్చిన హామీలు అమలుకు రూపాయి లేదంటారు.. మరి రాహుల్ గాంధీ ఆర్భాటాల కోసం ఖజానా తలుపులు ఎలా తెరుచుకుంటున్నాయి అని ప్రశ్నించారు. ప్రజల కష్టార్జితం ప్రజల సంక్షేమం కోసమా.. లేక గాంధీ కుటుంబానికి రాజకీయ పునరావాసం కోసమా అని రామచందర్ రావు నిలదీశారు. ఏ ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్ పార్టీ నేతగా రాహుల్‌కు తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే నైతిక హక్కు లేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాక సుమారు 40 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. జాబ్ క్యాలెండర్ హామీ ఊసే లేదు.. ఉద్యోగ నోటిఫికేషన్ల జాడే లేదు.. కొలువులు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ దగా చేసింది అని విమర్శించారు. మాటలు చెప్పి ఊరించడమే తప్ప రైతులకు ‘రైతు బంధు’ సాయం ఇంతవరకు ఖాతాల్లో పడలేదని, రైతులను కాంగ్రెస్ సర్కార్ నట్టేట ముంచిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వోద్యోగులకు డీఏలను పెండింగ్‌లో పెట్టారు.. రిటైర్ అయిన వారికి పెన్షన్లు, ప్రయోజనాలు అందక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ప్రజలకు ఇవ్వడానికి డబ్బులు లేవని సాకులు చెప్పే ప్రభుత్వం రాహుల్ గాంధీ కార్యక్రమాలకు మాత్రం రాష్ట్ర ఖజానాను ఊడ్చేయడానికి సిద్ధపడటం దారుణమన్నారు. రాహుల్‌ను మార్కెట్ చేయడానికి ప్రజలు అధికారం ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఉద్యోగాలు వస్తాయని, సంక్షేమం అందుతుందని, రైతులు బాగుపడతారని ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మితే ఆ నమ్మకాన్ని ప్రభుత్వం నట్టేట ముంచిందని మండిపడ్డారు. ప్రజల సొమ్మును రాహుల్ రాజకీయాల కోసం దుర్వినియోగం చేయడం తక్షణమే ఆపాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు క్లియర్ చేయాలని, ఉద్యోగ హామీలు నెరవేర్చాలని, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, ఉద్యోగుల పెండింగ్ డీఏలు, రిటైర్మెంట్ బకాయిలను వెంటనే జమ చేయాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





