“శంషాబాద్ టు చెన్నై విషయానికొస్తే అమరావతి వరకు నేరుగా ఉండే మార్గం జాతీయ రహదారి 65 మాత్రమే. దీనికి సమాంతరంగా రైల్వే కారిడార్ నిర్మించాల్సి ఉంది. ఏ శాస్త్రీయ నియమాలను పాటించకుండా శంషాబాద్ నుండి యాచారం, మాల్,మర్రిగూడా, గుర్రంపాడు, హాలియా దామరచర్ల మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశించి అమరావతికి చేరే విధంగా అలైన్మెంట్ మార్చారు.రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అశాస్త్రీయ పద్ధతిలో అలైన్మెంట్ మార్చడం ప్రజాగ్రహానికి కారణమైంది..”
దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచుతూ / రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే రైల్వే వ్యవస్థలో మౌలిక వసతులు కల్పిస్తూ హైస్పీడ్ రైళ్ల కారిడార్ల నిర్మాణాలను అప్ గ్రేడ్ చేస్తూ మార్పులు తీసుకువస్తున్నది . అందులో భాగంగానే వందేమా భారత్, అమృత్ భారత్ ప్రెస్ రైళ్లతో పాటు బుల్లెట్ ట్రైన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నది. అమృతభారత్ సాధారణ స్పీడ్ రైలు కాగా, వందే భారత్ ట్రైన్ మరింత సౌకర్యవంతంగా, వేగంగా వెళ్లే రైలు. అత్యంత వేగంతో దూసుకుపోయే సామర్థ్యం కలిగిన ఏడు బుల్లెట్ ట్రైన్ ల ఏర్పాటు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే శంషాబాద్ హాబ్ గా కేంద్ర ప్రభుత్వం మూడు బుల్లెట్ ట్రైన్లకు అనుమతించింది. శంషాబాద్ టు పూణే ని ముంబయి వరకు పొడిగించింది. దీని డి.పి.ఆర్. ( డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ) పూర్తయినది. మరొక బుల్లెట్ ట్రైన్ శంషాబాద్ టు బెంగళూర్ కు నిర్ధారించగా దానిని పుట్టపర్తి నుండి తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడంతో దీని డి. పి. ఆర్. వాయిదా పడింది. కానీ శంషాబాద్ టు చెన్నై బుల్లెట్ రైలు మార్గాన్ని పూర్తిగా మార్చి వేయడంతో ఎన్ హెచ్ 65 వెంట ఉన్న ప్రజలు ఆందోళన బాట పట్టారు.
శంషాబాద్ టు చెన్నై విషయానికొస్తే అమరావతి వరకు నేరుగా ఉండే మార్గం జాతీయ రహదారి 65 మాత్రమే. దీనికి సమాంతరంగా రైల్వే కారిడార్ నిర్మించాల్సి ఉంది. ఏ శాస్త్రీయ నియమాలను పాటించకుండా శంషాబాద్ నుండి యాచారం, మాల్,మర్రిగూడా, గుర్రంపాడు, హాలియా దామరచర్ల మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశించి అమరావతికి చేరే విధంగా అలైన్మెంట్ మార్చారు.రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అశాస్త్రీయ పద్ధతిలో అలైన్మెంట్ మార్చడం ప్రజాగ్రహానికి కారణమైంది.
మొదటగా ప్రకటించిన అలైన్మెంట్ లో శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, బాటసింగారం (డ్రై పోర్ట్ ) చౌటుప్పల్,నార్కట్పల్లి, నకరికల్,సూర్యాపేట, మునగాల కోదాడ జగ్గయ్యపేట,నందిగామ, ఇబ్రహీంపట్నం, విజయవాడ నేరుగా ఉండే మార్గం( N. H.65)మీదుగా అమరావతి ద్వారా చెన్నై వెళ్లే మార్గాన్ని కేంద్రం సరిగ్గానే రూపొందించింది . ఇందుకుగాను బడ్జెట్లో 5454 కోట్ల రూపాయలను కేటాయించారు. శంషాబాద్ టు చెన్నై దూరాన్ని 760 కిలోమీటర్ల దూరంగా గుర్తించారు. అందుకు అవసరమైన నిర్మాణాలకు( భారీ టెర్మినల్, డిపోల కోసం ) గాను 500 ఎకరాల స్థలం, అవసరం అవుతుందని అంచనా వేశారు. ఈ నిర్మాణ బాధ్యతను దక్షిణ మధ్య రైల్వే, మార్గన్ని సర్వే చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ, దీన్ని నేషనల్ హైవే స్పీడ్ రైల్ కార్పొరేషన్ ( N.H.S.R.C) కు అప్పగించింది.
హైవే స్పీడ్ రైల్ కార్పొరేషన్ (N. H. S. R. C), బుల్లెట్ ట్రైన్ మార్గం కోసం ఎక్కడెక్కడ ఎంత ల్యాండ్ అక్విజేషన్ చెయ్యాలి, స్టేషన్లు ఎక్కడెక్కడ ఉండాలి, ఇంజనీరింగ్ డిజైన్స్ ఎలాఉండాలి, సిగ్నల్ వ్యవస్థ ట్రాక్ రిలేటెడ్ గా ఎలా ఏర్పాటు చెయ్యడం , దారి వెంట ఉండే ట్రాఫిక్ పై అవగాహన, ప్రయాణికుల సంఖ్య, ఎంత మొత్తంలో ఆదాయం వస్తుంది అనే అంశాలపై డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేసి దక్షిణ మధ్య రైల్వే బోర్డు కు సమర్పిస్తుంది. ఈ రైల్వే కారిడార్ లో మనం చూస్తున్నా మెట్రో రైల్ లాగా స్టాండర్డ్ గేజ్ లో ఉంటుంది . రైలు మార్గంలో ప్రతి ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి వంకరలు / వంపులు లేకుండా నిర్మాణం చేయవలసి ఉండటం కీలకాంశం. వీటన్నింటినీ పూర్తిగా అవగాహన చేసుకుని నివేదికను రైల్వే బోర్డుకి పంపుతారు. దక్షిణ మధ్య రైల్వే బోర్డు వీటన్నింటినీ స్క్రూట్నీ చేస్తుంది.ఆ తరువాత రిపోర్టును ఫైనలైజ్ చేసి ఎకనామిక్ ఎఫైర్స్ కమిటీకి పంపడం జరుగుతుంది. రిపోర్టును సమగ్రంగా పరిశీలించిన అనంతరం సంపూర్ణమైన నివేదికను ప్రధాని అధ్యక్షతన ఉండే క్యాబినెట్ కమిటీ కి సమర్పిస్తుంది. క్యాబినెట్ కమిటీ ఆమోదం పొందిన తర్వాతే బుల్లెట్ రైల్వే కారిడార్ ప్రాంతాన్ని/ మార్గన్ని నిర్ణయించి అమలు చేస్తారు. ఒక అంచనా ప్రకారం ఈ కారిడార్ 2034 వరకు పూర్తవుతుంది. అంచనా వ్యయం పెరిగినా బడ్జెట్లో కేటాయింపులు జరుగుతాయని ప్రకటించింది
బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు కోసం జరిగిన చర్చలో వీటిని ప్రధాన పట్టణాల గుండా, జిల్లా కేంద్రాల మీదుగా, వర్తక వాణిజ్య కేంద్రాలకు అనుసంధానం చేస్తూ, రాష్ట్ర రాజధానులను కలుపుతూ ఉండే విధంగా నిర్మించాలని ప్రధానమంత్రి ప్రకటించారు. ఆ విధంగా చూస్తే మొదటి అలైన్మెంట్ జాతీయ రహదారిపై అనేక పట్టణాలతో పాటు జిల్లా కేంద్రం సూర్యాపేట ఉన్నది. అలాగే శంషాబాద్ నుండి విజయవాడ ( వాణిజ్య,వ్యాపార కేంద్రం) మీదుగా అమరావతికి ఉండే దారి నేరుగా ఉండే దారిగుండా చేరుకుంటుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏడు నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాల పునర్విభజన చట్టం13 వ షెడ్యూల్ లో కూడా ఈ విధమైనరైలు మార్గాలు ఏర్పాటు చేయాలని ఉన్నది.
సూర్యాపేట ఒక చారిత్రక స్థలం. ఇది రెండు రాజధానులకు సరిగ్గా మధ్యలో ఉన్న కూడలి ప్రాంతం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ పెద్దగట్టుజాతర ఇక్కడే ఇక్కడే జరుగుతుంది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సుధాకర్ పివిసి పైపులు, పాలిమర్స్ ఇక్కడే ఉంది. చారిత్రాత్మక దేవాలయాలు పిల్లలమర్రి, నాగులపాడు, ఉండ్రుగొండ ఈ ప్రాంతానివే . ఒకప్పుడు తెలంగాణలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ సూర్యాపేటలోనే ఉండేది. గతంలో జనగామ టు మిర్యాలగూడ వయా సూర్యాపేట రైల్వే మార్గం అని ప్రకటించారు. ఆ తరువాత డోర్నకల్ టు గద్వాల మార్గమని సర్వే చేశారు. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని ఆసాంతం మార్చేసి ప్రజల ఆశలపై, ఆకాంక్షలపై నీళ్లు చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సూర్యాపేట గతంలో కూడా జిల్లా కేంద్రం కాదనే ఒకే ఒక్క కారణం వల్ల హైదరాబాద్ నుండి నల్లగొండ జిల్లామీదుగా , సికింద్రాబాద్ నుండి ఖమ్మంజిల్లా మీదుగా రైల్వే మార్గాలు, స్టేషన్ లు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాకు వైద్య కళాశాల వచ్చింది. జిల్లాస్థాయి న్యాయస్థానం ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ చెందింది. కానీ సూర్యాపేట జిల్లాకు మొదటిసారిగా వచ్చిన బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు అవకాశాన్ని, రాష్ట్ర ప్రభుత్వం మార్చి వేయడంతో, జాతీయ రహదారి 65 వెంట ఉన్న ప్రాంత వాసులకు జరుగుతున్న మోసంగా భావిస్తున్నారు. తెలంగాణకు జరిగిన ద్రోహంగాఅభివర్ణిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు చొరవ చూపకపోవడం, అఖిలపక్షం, ప్రతినిధులను కలిసి వినతి పత్రాలు అందజేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే అపవాదు మూట కట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రత్యేక అవకాశాన్ని, అందుపుచ్చు కోలేకపోతున్నామని, దేశ అభివృద్ధి పటానికి దూరం అవుతున్నామని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చితే విద్యా,వైద్య, రవాణా,ఉపాధి రంగాలలో వెనకబడి పోతామనే ఆలోచన బలంగా ఉన్నది .
అందుకే మరో మారు మోసపోకూడదని ఇప్పుడు రాజకీయాలకు, అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు,అన్ని ప్రజా సంఘాలు, అఖిలపక్షంగా ఏర్పడి ఉద్యమ కార్యాచరణతో బుల్లెట్ రైలు సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ముందుకు సాగుతున్నారు. కలెక్టర్కు మెమోరండం ఇవ్వడం, హైవే రాస్తారోకో, జాతీయ రహదారి 65 వెంట ఉన్న శాసనసభ్యులు, నకిరేకల్,మునుగోడు,కోదాడ, జిల్లా మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు అఖిలపక్ష కమిటీ సభ్యులు స్వయంగా కలిసి వినతి పత్రాలు ఇచ్చారు . వామపక్ష ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఎం నాయకులు జాన్ వెస్లీ, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెస్సీ కోదండరాం, బిజెపి సభా పక్ష నేతకు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులకు వినతి పత్రాలు ఇచ్చారు.
సూర్యాపేట పట్టణంలో విద్యార్థి మహార్యాలీ అనంతరం, 14వ తేదీ నుండి నిరాహార దీక్షతో పాటు మన ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇంతలోనే ఈనెల 12న భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవను కలసి బుల్లెట్ ట్రైన్ నకరేకల్ మీదుగా వెళ్లేట్లు చూడాలని వినతి పత్రం అందజేశారు. సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించడం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలా సానుకూలంగా స్పందించడంతో పాటు, సహకారాన్ని అందిస్తామన్నారు. మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు, గుమ్మడి నరసయ్య గుమ్మడి నరసయ్య కూడా పూర్తి మద్దతు ప్రకటించి, భాగస్వాములవ్వడం విశేషం. నిరాహార దీక్ష శిబిరంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం వలన ఉద్యమ ఊపందు కుందుకున్నది.
రమణాచారి





