“బిడ్డ పోయినా పురిటి వాసన మిగిలినదన్నట్లు రెండు వేపుల సైలెంట్ అయినా సోషల్ మీడియా మాత్రం యధావిధిగా వికటాట్టహాసం చేస్తోంది. సోషల్ మీడియా రెండు వేపుల రెచ్చిపోయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను సృష్టించుతోంది. సోషల్ మీడియా ఏదైనా మిగిల్చి ఉంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లి కాస్త పూర్తి చేశారు..”
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ.మైక్ చేతికొస్తే తనను తాను మరచిపోతాడు. లేకుంటే కోనసీమ వెళ్లి ఎండి పోతున్న కొబ్బరి చెట్లు చూసి తెలంగాణ దిష్టి తగిలిందని వ్యాఖ్యానించి అదే తెలంగాణ వెళ్లి మీ కోసం నేను పోరాడుతానని చెప్పడం పవన్ కళ్యాణ్ కే చెల్లు. దురదృష్టమేమంటే జనసేన పెట్టిన నాటి ఈ వ్యాఖ్యానం ఇన్నేళ్ల తర్వాత కూడా సరిపోవడమే. తను ప్రసంగించే సమయంలో ఊగిపోతాడు. ఏ వక్తకు ఇది ఉండ కూడదు. తన ప్రసంగంతో ప్రేక్షకులు ఊగి పోవాలి. కానీ పవన్ కళ్యాణ్ విషయం తద్విరుద్ధంగా ఉంటుంది . లేకుంటే హైదరాబాద్ ప్రెస్ మీట్ లో ఆయన హావభావాలు అలా ఉండేవి కావు. పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం ఆలోచన ఉండి ఉంటే తను జనసేన పార్టీ నేత అయినా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం లో ఉప ముఖ్యమంత్రినని భావించి తదనుగుణంగా వ్యవహరించే వారు. హైదరాబాద్ ప్రెస్ మీట్ లో ఈ ప్రభుత్వంపై పోరాడతానని ప్రసంగం చేసే వారు కాదు. ఈ పాటికే రెండు రాష్ట్రాల మధ్య ఎడతెగని తగాదాలు వాదవాగ్వివాదాలు ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు ల్లో కేసులు నడుస్తున్న నేపథ్యంలో అదీ తెలంగాణ ఆవిర్భావం రోజున పార్టీ సభ నిర్వహించే వారు కారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా రెండు రాష్ట్రాల మధ్య సామరస్యం నెలకొల్పేందుకు కృషి చేయవలసిన బాధ్యత వదలి పెట్టి తెలంగాణ ప్రజల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతానని చెప్పడంలో ఏ మాత్రం ఔచిత్యం ఉందా ? మంత్రి పదవికి రాజీనామా చేసి తను ఏ ప్రసంగమైనా చేయవచ్చు. ఒక మంత్రిగా ఉంటూ మరో రాష్ట్రం వెళ్లి సభ పెట్టి ఆ రాష్ట్ర ప్రజల సమస్యలపై పోరాడతానని చెబితే ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రులు మరొక రాష్ట్రంలో పార్టీ పరంగా కెలుకుతూ ఉంటే వాస్తవంలో రెండు రాష్ట్రాల మధ్య ప్రజా జీవితానికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అటుంచి మరింత జటిలం కావా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి పదవి వదలి పెట్టి తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా ఎన్ని సభలు సమావేశాలైనా పెట్టుకోవచ్చు. గమనార్హమైన అంశమేమంటే హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగం శూల శోధన గావించితే ఆంధ్రప్రదేశ్ నుండి జెండా ఎత్తేసేటిగానే ఉంది . తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన కూడా చేశారు. ఇప్పటి వరకు ఒక రాష్ట్ర స్థితి గతులు గురించి ఆ రాష్ట్రం వెళ్లి మరొక రాష్ట్ర మంత్రి సభలు పెట్టి కామెంట్ చేయడం ఎరగం. కానీ మంత్రిగా ఉండి మరో రాష్ట్రం వెళ్లి సవాళ్లు విసరడం ఇదే ప్రధమం. పైగా భావోద్వేగాల ప్రాతిపదికగా తెలంగాణ ఏర్పడింది. ఆ రాష్ట్రం ఆవిర్భావ రోజున హైదరాబాద్ లో తన మంత్రివర్గ సభ్యులు పవన్ కళ్యాణ్ చేసిన హడావుడి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందించుతారో చూడ వలసి ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన నేత కావచ్చు. రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యులు అనే విషయం మర్చి పోకూడదు. రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు ఒకరు ఇలా వ్యవహరించడంతో రెండు రాష్ట్రాల మధ్య మొదలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింతగా క్షీణించే అవకాశాలు లేక పోలేదు.
పవన్ కళ్యాణ్ యే కాదు. ఏ ఇతర రాష్ట్రానికి చెందిన వారెవరైనా ఏ రాష్ట్రంలోనైనా రాజకీయ పార్టీలు పెట్టవచ్చు. ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ప్రజలతీర్పు శిరోధార్యం. కానీ పవన్ కళ్యాణ్ తన నేపథ్యం గురించి ఆలోచన చేయకుండా వ్యవహరించడంతోనే తెలంగాణలో ప్రతిఘటన ఏర్పడింది. కేంద్ర మంత్రి అమిత్ షా తో తన చర్చల గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ టీవీ చర్చల్లో వెల్లడించిన అంశాలపై జనసేన విభేదించింది. ఇలాంటి కీలక మైన అంశాలు వెల్లడించే సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ అవసరమైతే సాక్ష్యాధారాలు ఉంచుకొని మాట్లాడాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పటికైనా తనకు అందిన సోర్స్ వెల్లడించాలి. లేదా నింద మోయక తప్పదు. ఆయన స్థాయికి తగనిదిగా మిగిలి పోతుంది. అయితే టివి చర్చల అనంతరం అంతిమంగా జనసేన పార్టీ పరంగా సర్దుబాటు చేసుకున్నదని చెబుతున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కావడంతో ఇంత రగడ రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది.
భావోద్వేగాలు చాలా సున్నితమైనవి. తెలంగాణ అవతరణే భావోద్వేగాలు ప్రాతిపదికగా అవతరించింది. ఆలాంటప్పుడు కనీసం తెలంగాణ ఆవిర్భావ రోజు కాకుండా మరో రోజు పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకొని ఉన్నా ఇంత రగడ ఏర్పడేది కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పార్టీ పరంగా జనసేన సర్దుబాటు చేసుకున్న తర్వాత కూడా పోలీస్ కేసులు నమోదు అయ్యాయంటే అంతా ఒక వ్యూహం మేరకు జరిగినట్లుంది. సర్దుబాటుతో ఈ సమస్యకు తెరపడి ఉంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ రోజున తెలంగాణకు వచ్చి ఉండే వారు కారేమో! ఇంతకీ జనసేన పార్టీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తో ఉత్తుత్తిగానే సర్దుబాటు చేసుకొన్నట్లుంది. లేకుంటే పవన్ కళ్యాణ్ మెప్పుపొందేందుకు కొందరు పోలీస్ స్టేషన్ లు ఎక్కి ఉండవచ్చు.
ఏదిఏమైనా ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరు ఏం మాట్లాడినా లేక రాసినా పోలీసులు అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్ లు తిప్పే విధానం అమలు జరుగుతోంది. ఆ కోవలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ను ఆంధ్రప్రదేశ్ లో పలు పోలీస్ స్టేషన్ లు తిప్పాలని భావించారు. ఒక వేళ ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు కాబడి పోలీస్ స్టేషన్ లు తిప్పి ఉంటే జనసేన బలహీనతలే బహిర్గతమయ్యేవి. ఇప్పుడేమైంది? కేవలం దస్త్రాలకు పరిమితం అయ్యాయి. మున్ముందు అయినా ప్రొఫెసర్ నాగేశ్వర్ జోలికి వెళ్లరేమో! బిడ్డ పోయినా పురిటి వాసన మిగిలినదన్నట్లు రెండు వేపుల సైలెంట్ అయినా సోషల్ మీడియా మాత్రం యధావిధిగా వికటాట్టహాసం చేస్తోంది. సోషల్ మీడియా రెండు వేపుల రెచ్చిపోయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను సృష్టించుతోంది. సోషల్ మీడియా ఏదైనా మిగిల్చి ఉంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లి కాస్త పూర్తి చేశారు.





