తెలంగాణతో తురింగియా భాగస్వామ్యం

  • టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారానికి ఒప్పందం
  • తెలంగాణ రైజింగ్ విజన్‌పై జర్మనీ ప్రతినిధుల ప్రశంసలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3: వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమైన తెలంగాణతో జర్మనీలోని తురింగియా రాష్ట్రం పలు కీలక రంగాల్లో భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం రాష్ట్ర ప్రభుత్వం, జర్మనీలోని తురింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. తురింగియా ముఖ్యమంత్రి మారియో వోయిట్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రగతిశీల పనులను జర్మనీ ప్రతినిధులు ప్రశంసించారు. తెలంగాణను భారత దేశంలో అభివృద్ధి, ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారియో వోయిట్ అభివర్ణించారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ సాధించిన అభివృద్ధి ప్రత్యేకమైనదిగా వ్యాఖ్యానించారు. భారత-జర్మనీ సంబంధాల్లో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఇంతటి వృద్ధి సాధించిన రాష్ట్రంతో భాగస్వామ్యం కావడం తమకు గౌరవంగా ఉందని అన్నారు. రెండు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరేలా కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉపాధి రంగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని గుర్తు చేశారు.

ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రభావంతో సంప్రదాయ ఉద్యోగాల స్థానంలో కొత్త అవకాశాలు వస్తున్నాయని వివరించారు. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు అవసరమైన నైపుణ్యాలతో తెలంగాణ యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీలు), పాలిటెక్నిక్ కళాశాలల్లో బోధన విధానాలను మార్చేందుకు తురింగియా సహకారం కావాలని కోరారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు స్పందించిన మారియో వోయిట్ తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు రూపొందించేందుకు తమ పరిశ్రమలు, విద్యాసంస్థలు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

జర్మనీలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఏమిటో గుర్తించి వాటికి అనుగుణంగా తెలంగాణ యువతకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ యువత ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతున్నారంటూ అమెరికాలోని సిలికాన్ వ్యాలీ విజయాల్లో కీలక పాత్ర పోషించినట్లు గుర్తు చేశారు. ప్రపంచంలోని అనేక అగ్రశ్రేణి సంస్థల్లో హైదరాబాద్‌కు చెందినవారే కీలక పదవుల్లో ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో జర్మన్ భాషా పరిజ్ఞానం కూడా ఎంతో అవసరమని, జర్మన్ భాషా శిక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంలో సహకరించాలని తురింగియా ప్రతినిధులను సీఎం రేవంత్ కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీ గురించి కూడా వివరించారు. ప్రపంచంలోని ఫార్చ్యూన్-500 కంపెనీలను తెలంగాణకు ఆకర్షించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నామని తెలిపారు. ఇటీవల మిస్ వరల్డ్-2025 పోటీలకు వందకుపైగా దేశాల ప్రతినిధులు హైదరాబాద్‌కు రావడం రాష్ట్ర ప్రతిష్ఠకు నిదర్శనమన్నారు.

సెమీ కండక్టర్ రంగంలో కొత్త అవకాశాలు
సెమీకండక్టర్ రంగానికి చెందిన జర్మన్ కంపెనీల ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తురింగియా సీఎం తెలిపారు. ఇక్కడి అవకాశాలను పరిశీలించి పెట్టుబడులపై చర్చలు జరుపుతామన్నారు. ఈ ప్రతిపాదనను మంత్రి దుద్దిళ్ళ స్వాగతిస్తూ ఇప్పటికే అనేక అంతర్జాతీయ సెమీ కండక్టర్ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. త్వరలోనే తయారీ రంగంలో కూడా తెలంగాణ ముందంజలో నిలుస్తుందని తెలిపారు. కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ మాట్లాడుతూ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ(టామ్‌కామ్) ద్వారా ఇప్పటికే జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయని తెలిపారు. ఏటీసీలో యువతకు అత్యాధునిక నైపుణ్యాలు అందిస్తున్నామని, తురింగియా ప్రతినిధులు ఈ కార్యక్రమాలను పరిశీలించవచ్చని సూచించారు. తురింగియా స్టేట్ సెక్రటరీలు డాక్టర్ టైచార్ట్, సకెర్ట్, జర్మన్ కాన్సుల్ జనరల్ హాస్పర్ సహా వివిధ రంగాలకు సంబంధించిన జర్మనీ పారిశ్రామికవేత్తలు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, టీజీఐఐసి ఎండీ శశాంక పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *