మిన్నంటుతున్న పొగాకు రైతుల ఆర్తనాదాలు

sunkavalli sathibabu
-సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్)
మొ:9704903463.

ఒక వైపు ఎల్ నినో,సూపర్ ఎల్ నినో ప్రభావంతో, దేశంలోను,తెలుగు రాష్ట్రాల్లోను వర్షాభావ పరిస్థితుల వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక,పెట్టుబడి ఖర్చులు రాక అన్నదాత ఆక్రందనలు మిన్నంటుతున్నారు. ఎన్. ఎల్. ఎస్ ప్రాంతంలో పండే పొగాకుకు గిరాకీ ఎక్కువగా ఉంది. ఎన్. ఎల్. ఎస్ ప్రాంతంలో పండే పొగాకు కొనుగోలుకు ఆంధ్ర ప్రదేశ్ లోని జంగారెడ్డి గూడెంలో రెండు వేలం కేంద్రాలు, గోపాలపురం దేవరపల్లి,కొయ్యల గూడెం, లలో ఒక్కో వేలం కేంద్రం చొప్పున ఏర్పాటు చేసారు. ఎస్. ఎల్.ఎస్ పొగాకు కొనుగోలు కోసం 6 వేలం కేంద్రాలు,ఎస్.బి.ఎస్ కోసం 4, ఎన్. బి.ఎస్ కోసం ఒక వేలం కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా దక్షిణ తేలిక నేలల్లో (ఎన్. ఎల్. ఎస్ ) పండే పొగాకు కు సాధారణంగా గిరాకీ ఎక్కువ గా ఉంటుంది. పెట్టుబడి కూడా అధికంగానే ఉంటుంది. దీని వలన అధిక ధరలు పలికినా రైతులకు మిగిలేదేమీ ఉండదు. ఇక మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా పొగాకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఎన్. ఎల్. ఎస్ పొగాకు నిర్ణీత విస్తీర్ణత కంటే ఎక్కువగా ఉండడం, పరిమితికి మించి పొగాకు పండడం వంటి కారణాలతో గతం సంవత్సరం కంటే దాదాపు సగం ధరలకే పొగాకు కొనుగోలు చేయడం వలన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.

ఆంధ్రప్రదేశ్,కర్నాటక రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా పొగాకు పండిస్తున్నారు. ఇతర దేశాల్లో పొగాకు అధికంగా ఉత్పత్తి జరిగిందనే కారణం వలన, డిమాండ్ లేక పోవడం వలన ఈ ఏడాది పొగాకు మార్కెట్లో సంక్షోభం ఏర్పడింది. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి, పండించిన వర్జీనియా పొగాకు కారుచౌకగా అమ్ముడుపోతున్నది.బ్రెజిల్,జింబాబ్వే వంటి దేశాల్లో అధిక పొగాకు ఉత్పత్తి వలన ప్రస్తుతం పొగాకు కొనుగోలు మందకొడిగా సాగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది గతంలో కంటే సుమారు 600 మిలియన్లు అధికంగా ఉత్పత్తి చేయడం జరిగింది. ఎఫ్.సి.వి పొగాకు ఉత్పత్తిలో భారత దేశం నాల్గవ స్థానంలో ఉంది. చైనా,బ్రెజిల్, జింబాబ్వే దేశాలు మొదటి మూడు స్థానాల్లో ఉండగా,నాల్గవ స్థానాన్ని భారత్ ఆక్రమించింది.

పొగాకు ఎగుమతుల్లో భారత్ 2 స్థానం లో ఉంది. దేశానికి విదేశీ మారక ద్రవ్యం ఆర్జించి పెట్టే పొగాకు రైతులు ముఖ్యంగా ఎన్.ఎల్.ఎస్ పొగాకు రైతులు ఈ సంవత్సరం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా రాబోయే సంవత్సరానికి ఎన్. ఎల్. ఎస్ పొగాకు ఉత్పత్తి ని బేరన్ కు 20 క్వింటాళ్లుగా నిర్ణయించి, 2 ఎకరాల విస్తీర్ణానికి పొగాకు పంటను పరిమితం చేయడం సమంజసమా? దీని వలన కేవలం ఒక బారన్ మాత్రమే గల రైతులు ఇబ్బందులు పడతారు. కాబట్టి పొగాకు బోర్డు వారు పునరాలోచించి, గతంలో మాదిరిగానే బారన్ విస్తీర్ణ పరిధిని,క్వింటాళ్ల పరిమితిని గతంలో మాదిరిగా యథాతథంగా ఉంచాలి. అదనపు క్వింటాళ్లను అనుమతించ కూడదు. పొగాకు పై విధించిన జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. ఈ ఏడాది పొగాకు పండించిన రైతులు నష్టపోకుండా ,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు కంపెనీలు పెద్డ మనసుతో ఆదుకోవాలి.

దక్షిణ తేలిక నేలల్లో కేవలం పొగాకు,వరి పంటలకు మాత్రమే అలవాటు పడ్డ రైతులు ఇటీవల కాలంలో పామాయిల్ వైపు దృష్టి సారించడం శుభ పరిణామం. పొగాకు కు ప్రత్యామ్నాయంగా ఈ నేలలకు తగ్గ అన్ని రకాల ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు తమ దృష్టి కేంద్రీకరించాలి. వ్యవసాయం పై పెట్టుబడుల భారం విపరీతంగా పెరిగిపోయింది. ఈనాటికీ అధిక శాతం మందికి వ్యవసాయమే కీలకం. అలాంటి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి. చదువుకున్న యువత కు నేడు సాఫ్ట్ వేర్ రంగం తిండి పెట్టే పరిస్థితుల్లో లేదు. ఇప్పటికే ఐ. టి రంగంలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. పొలాలు అమ్ముకుని చదువుకుని,ఉద్యోగాలు రాక యువత నిరాశలో ఉంది. కేవలం 10 వేల జీతం దొరకడమే కష్టంగా మారింది. చిన్న పాటి జీతాల కోసం కంప్యూటర్ కోర్సులు చేస్తూ, తినీ తినకుండా ఆర్ధిక బాధలతో అలమటిస్తున్న వారి పరిస్థితి హృద్యంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మునిగి పోయే నావలా మారిన వ్యవసాయం పై పాలకులు అధిక శ్రద్ధ చూపాలి. ఇతర దేశాల్లో వ్యవసాయం చేసే వారు లేక,తినడానికి తిండి లేక ఆహారం కోసం హత్యలు చేసుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇలాంటి అస్తవ్యస్థ ఆర్థిక పరిణామాలు ఎదురు కాకుండా నిరాదరణకు గురవుతున్న వ్యవసాయ రంగాన్ని యుద్ధ ప్రాతిపదికపై సంస్కరించాలి. అలాగే పొగాకు మార్కెట్ లో ఏర్పడిన సందిగ్ధత తొలగించి,రైతులను ఆదుకోవాలి. పొగాకు బోర్డు నిర్ధేశించిన మేరకైనా పొగాకుకు గిట్టుబాటు ధరలు ప్రకటించి పొగాకు రైతులకు న్యాయం చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *