– పంటల ఎంపికపై ముందస్తు సూచనలు
– కృష్టా జలాల్లో న్యాయమైన వాటా సాధిస్తాం
– తాగునీటికే తొలి ప్రాధాన్యత
– శాసనసభలో మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎల్ నినోపై శాసనసభలో శుక్రవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొంటూ ఇది రైతు ప్రభుత్వం.. అన్నదాతలను ఒంటరిగా వదలబోమన్నారు. ఎల్ నినో తీవ్రతపై ముందుగానే రైతులకు అవగాహన కల్పించామన్నారు. వర్షపాతం తగ్గే అవకాశం, సాగునీటి కొరతపై అన్నదాతలను అప్రమత్తం చేశామని తెలిపారు. రైతులు నష్టపోకుండా పంటల ఎంపికపై ముందస్తు సూచనలు ఇచ్చాం. ఆయకట్టు వారీగా నీటి లభ్యతపై ఖచ్చితమైన సమాచారం అందిస్తున్నాం. ప్రతి మంగళవారం రైతు నేస్తం ద్వారా జలాశయాల పరిస్థితిని వివరిస్తున్నాం. నీరు సరిపోని చోట పంటలు వేయమని చెప్పడం బాధ్యతారాహిత్యమవతుందన్నారు. ప్రజల తాగునీటికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుంది. తాగునీటి అవసరాలు తీర్చిన తరువాతే మిగులు జలాలను సాగుకు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే వేసవినిదృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే నీటి నిల్వలను పరిరక్షిస్తున్నామని గుర్తుచేశారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక నీటి బడ్జెట్ అమలు చేస్తున్నాం. జలాశయాల నిల్వలు, కొత్త ప్రవాహాలను పది రోజులకోసారి సమీక్షిస్తాం. శ్రీశైలంలో వినియోగయోగ్యమైన నీరు గత ఏడాది 153.56 టీఎంసీలు.. ప్రస్తుతం 61.65 టీఎంసీలే వున్నాయన్నారు. నాగార్జునసాగర్‌లో గత సంవత్సరం 174.25 టీఎంసీలుండగా ఈసారి 44.89 టీఎంసీలే వున్నాయన్నారు. జలాశయాల్లో కనిపించే మొత్తం నీరు సాగుకు అందుబాటులో ఉన్నట్లు కాదు. రాష్ట్రంలోని 44,034 చెరువుల్లో 40 శాతం పావు సామర్థ్యం కన్నా తక్కువగా నిండాయి. వాస్తవాలను దాచకుండా నీటి పరిస్థితిని ప్రజల ముందు ఉంచుతున్నాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను సాధించి తీరుతామని స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన ఒక్క చుక్క నీటినీ వదులుకోబోమన్నారు. కృష్ణా జలాల కోసం ట్రిబ్యునల్, కేఆర్ఎంబీ, కేంద్రం వద్ద బలంగా వాదనలు వినిపిస్తున్నామన్నారు. కృష్ణా జలాల్లో 66:34 తాత్కాలిక నిష్పత్తిని శాశ్వత హక్కుగా అంగీకరించలేదని గుర్తుచేశారు. కృష్ణా జలాల్లో 50:50 పంపిణీ కోసం తెలంగాణ పట్టుబట్టింది. మేడిగడ్డ ఏడో బ్లాక్ దెబ్బతినడంతో నీటి మళ్లింపునకు పనికిరాని పరిస్థితి ఏర్పడింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రస్తుతం నీటి నిల్వకు సురక్షితం కావని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిందన్నారు. ప్రజల ప్రాణభద్రతను పణంగా పెట్టి కాళేశ్వరం బ్యారేజీలను వినియోగించలేమన్నారు. చిన్న మరమ్మతుతోనే కాళేశ్వరాన్ని నడపవచ్చన్న బీఆరఎస్ వాదన సాంకేతికంగా తప్పన్నారు. ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారమే బ్యారేజీల పునరుద్ధరణ చేపడతామన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులో సురక్షితంగా ఉన్న లింక్–2 ద్వారా పంపింగ్ కొనసాగిస్తున్నామన్నారు. పాలమూరు-రంగారెడ్డి పథకం 90 శాతం పూర్తయిందన్న బీఆర్ఎస్ ప్రచారం అవాస్తవం. కేవలం పంప్‌హౌస్‌లు నిర్మిస్తే ఎత్తిపోతల పథకం పూర్తయినట్లు కాదన్నారు. పాలమూరు-రంగారెడ్డిలో కాలువలు, పంపిణీ వ్యవస్థ, భూసేకరణ, పునరావాస పనులు అసంపూర్తిగా ఉన్నాయని గుర్తుచేశారు. చట్టబద్ధ అనుమతులు, మిగిలిన నిర్మాణాలు పూర్తిచేసి పాలమూరు–రంగారెడ్డిని వినియోగంలోకి తెస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్య క్రమంలో పూర్తిచేస్తామన్నారు. కాలువల మరమ్మతులు, పంపింగ్ వ్యవస్థల పునరుద్ధరణను వేగవంతం చేస్తున్నామన్నారు. అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను సమర్థంగా వినియోగిస్తామన్నారు. నిలిచిన పంటల రక్షణతోపాటు యాసంగి అవసరాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఎల్ నినోను ఆపలేకపోయినా దాని ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతుల పంటలు, ప్రజల తాగునీరు, రాష్ట్ర జలహక్కుల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని మరోమారు స్పష్టం చేశారు.నీటి అవసరాలకు ప్రాధాన్యత : సీతక్క
మంత్రి సీతక్క మాట్లాడుతూ వచ్చే వర్షాకాలం వరకు తాగు నీటి అవసరాలకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నామన్నారు. రిజర్వాయర్ల నీటి వినియోగానికి సంబంధించి తాగు నీటికే ప్రథమ ప్రాథాన్యత నిస్తున్నాం. ప్రతిరోజూ అన్ని జలాశయాల్లోని నీటి మట్టాలను పర్యవేక్షిస్తున్నాం. ఇరిగేషన్ శాఖ వారితో వారాని కోకసారి సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నాం.నీటి నిల్వ తగినంత అందుబాటులో లేని, ఇన్ ఫ్లోలు ఆశించనంతగా లేని రిజర్వాయర్లలో, డెడ్ స్టోరేజీ నీటిని వినియోగించుకునేందుకు వీలుగా మోటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో తాగు నీటి కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న జలాశయాల్లో సింగూరు ఒకటే కొంత ఇబ్బందికరంగా ఉందన్నారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వ సుమారు 75 రోజులకు సరిపోతుంది. ఆ తర్వాత వర్షాలు కురవక పోతే ఏం చేయాలి అనే ఆలోచిస్తున్నాం. సింగూరు రిజర్వాయర్‌పై 4 జిల్లాల్లోని 2,395 గ్రామీణ ఆవాసాలు , 19 పట్టణ స్థానిక సంస్థలు ఆధారపడి ఉన్నాయి. ప్రత్యామ్నాయ తాగు నీటి సరఫరా కోసం ఆవాసాల వారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశాం. స్థానిక నీటి వనరులైన చేతి పంపులు, సింగిల్ ఫేజ్/త్రీ ఫేజ్ పథకాలు, బావులు సిద్ధంగా ఉంచాం. స్థానిక నీటి వనరులు అందుబాటులో లేని ప్రాంతాల్లో బోర్ వెల్స్‌ను అద్దెకు తీసుకోవడం లేదా సమీపంలోని నీటి వనరుల నుంచి నీటిని తరలించడం వంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. కృష్ణా బేసిన్లో 14, బేసిన్లో 20 రిజర్వాయర్ల నీటిని వినియోగించుకుంటున్నామన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. వీబీజీరాంజీ.. పేరు ఏదైనా కరవు, కష్ట కాలంలో ప్రజలకు ఉపాధి కల్పించడమే ఉపాధి హామీ పథకం లక్ష్యం. అందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీల్లో కనీసం 60 కుటుంబాలకు పని కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున పనులు ప్రారంభించాం.ఎండలు తీవ్రంగా ఉన్న ఏప్రిల్ నుంచి జూన్ వరకు రోజుకు సగటున 12 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. జూలై నుంచి రోజుకు సగటున 2 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ ల్లో గతంలో ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో పనులు కల్పిస్తున్నాం. ఇప్పటివరకు 2 వేల కోట్లకు పైగా వేతనాలు నేరుగా కూలీలకు చెల్లించాం. వీబీ జీ రాం జీ వల్ల రాష్ట్రం మీద 40శాతం భారం పడుతోందన్నారు. ఇంటింటికీ ఇంకుడు గుంత.. ప్రతి పొలానికి పంట కుంట.. ప్రతి ఊరికి ఊట కుంట.. అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అని మంత్రి సీతక్క చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





