పోలీసుల ఆరోగ్య భద్రతకు ‘ఫిట్ కాప్‌’

– సిబ్బంది ఆరోగ్య పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ
– సమస్యల ఆధారంగా వైద్య సూచనలు
– 90 వేలకు పైగా సిబ్బందికి ప్రయోజనం: డీజీపీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 6 : నిరంతర విధులు, పని ఒత్తిడి కారణంగా పోలీసులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని, వీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజానికి మరింత మెరుగైన సేవలు అందించగలరని డీజీపీ సి.వి.ఆనంద్ పేర్కొన్నారు. పోలీసుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ‘ఫిట్ కాప్‌’ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుకు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, ఇతర సంస్థల సహకారంతో రూపొందించినట్టు తన కార్యాలయంలో ఫౌండేషన్ సభ్యులు, ఇతర పోలీసు అధికారులతో శుక్రవారం జరిపిన సమావేశంలో ఆయన తెలిపారు. పోలీస్ హెల్త్ మేనేజ్‌మెంట్ ప్రొఫైల్ సిస్టమ్‌గా రూపొందించిన ఈ విధానాన్ని ప్రత్యేక యాప్ ఆధారంగా రూపొందించారు. ఈ యాప్‌లో ఎనిమిది ప్రధాన ఆరోగ్య అంశాలకు సంబంధించిన ప్రశ్నలతోపాటు వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేసే అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 90 వేల మందికిపైగా పోలీసు సిబ్బంది తమ సెల్‌ఫోన్ నంబరు ఆధారంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. మధుమేహం, రక్తపోటు, బాడీ మాస్ ఇండెక్స్, ఇతర ఆరోగ్య సమస్యలు, జీవనశైలి అలవాట్లు, శారీరక శ్రమ, ధూమపానం, మద్యపానం వంటి అంశాలపై సమాచారం సేకరిస్తారు. ఈ వివరాల ఆధారంగా సిబ్బందిని తక్కువ, మధ్యస్థ, అధిక ఆరోగ్య ముప్పు విభాగాలుగా గుర్తిస్తారు. ఆరోగ్య ప్రమాద స్థాయినిబట్టి కాల్‌సెంటర్ ద్వారా సంబంధిత సిబ్బందిని ఫోన్ ద్వారా అప్రమత్తం చేస్తామని హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఫౌండర్ సల్మాన్ వివరించారు. అవసరమైన వారికి వైద్య పరీక్షలు, దవాఖానాల ద్వారా చికిత్స, ఆరోగ్య సలహాలు, కౌన్సెలింగ్ అందించేలా చర్యలు తీసుకుంటారు. కిడ్నీ సంబంధిత సమస్యలు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల ముప్పును ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఈ విధానం ఉపయోగపడుతుందని డీజీపీ వివరించారు.

సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం

పోలీసు సిబ్బందిలో ఆరోగ్యంపై అవగాహన పెంచడంతోపాటు వ్యాధులు ప్రమాదకారంగా మారకముందే నివారణ చర్యలు చేపట్టడం ఫిట్ కాప్ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రతి పోలీసు ఉద్యోగి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఫిట్ కాప్ కీలకంగా నిలుస్తుందని డీజీపీ ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సజ్జనార్, ఏడీజీ అకున్ సబర్వాల్, ఐజీపీ, పీ అండ్ ఎల్ గజరావు భూపాల్, భద్రత అండ్ ఆరోగ్య భద్రత సెక్రటరీ ఉదయ్ కుమార్ రెడ్డి(రిటైర్డ్), టి స్పార్క్ ఎస్పీ రూపేష్, ఎస్పీ అవినాష్, ఇతర అధికారులు, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *